Featuredస్టేట్ న్యూస్

సంక్షేమ బడ్జెట్‌

రూ.2,27,974.99 కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన బుగ్గన

 • వ్యవసాయ రంగానికి రూ.28, 866.23కోట్లు
 • సాగునీటి ప్రాజెక్టులకు రూ.13,139.13 కోట్లు కేటాయింపు
 • 2021 జూన్‌ నాటికి పోలవరం పూర్తిచేస్తాం
 • మిగిలిన ప్రాజెక్టుల సత్వర పూర్తికి చర్యలు
 • ఆరోగ్యశ్రీకి రూ.1740కోట్లు కేటాయింపులు
 • బెంగళూర్‌, హైదరాబాద్‌, చెన్నై రాష్ట్రాల్లోని ఆస్పత్రులను జాబితాలో చేర్చేలా నిర్ణయం
 • ఏపీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆర్థికశాఖ మంత్రి బుగ్గన

అమరావతి, జులై12(ఆర్‌ఎన్‌ఎ) : ఏపీ బ్జడెట్‌ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ శుక్రవారం శాసనసభలో ప్రవేశపెట్టారు. మొత్తం రూ.2,27,974.99 కోట్లుతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. రెవెన్యూ వ్యయం రూ.1,80,475 కోట్లు అని మంత్రి బుగ్గన వెల్లడించారు. మూలధన వ్యయం రూ.32,293.39 కోట్లు కాగా.. వడ్డీ చెల్లింపుల కోసం రూ.8,994 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. 2018-19 బ్జడెట్‌తో పోలిస్తే తాజా బ్జడెట్‌లో 19.32 శాతం పెరుగుదల ఉందని చెప్పారు. రెవెన్యూ లోటు రూ.1778.52, ద్రవ్యలోటు సుమారు రూ.35,260 కోట్లు, జీఎస్‌డీపీలో ద్రవ్యలోటు సుమారు 3.3 శాతం ఉన్నట్లు తెలిపారు. గత ప్రభుత్వం ఇచ్చిన రెండంకెల వృద్ధిరేటుపై సవిూక్షిస్తున్నామని బుగ్గన తెలిపారు. రెండంకెల వృద్ధి ఉంటే ప్రజలు ఇంకా పేదరికంలో ఎందుకున్నారో పరిశీలిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేను సత్యానికి తప్ప దేనికీ లొంగి ఉండను.. సత్యం కాక నేను సేవించ వలసిన ఏ దేవుడూ లేడు.. అంటూ గాంధీజీ చెప్పిన మాటలను ఉటంకించారు. రాజకీయాల్లో విశ్వసనీయత ముఖ్యమన్నారు. ప్రజలు కోరిన పాలన కోసం సీఎం కృషి చేస్తున్నారని, నమ్మకం, విశ్వసనీయతే ప్రాతిపదికగా ప్రజలు తీర్పు ఇచ్చారన్నారు. విలువలతో కూడిన రాజకీయాలను పునరుద్ధరించేందుకు సీఎం కృషి చేస్తున్నారని, పార్టీ మేనిఫెస్టో తమకు పవిత్ర గ్రంథమని సీఎం జగన్‌ చెప్పారని బుగ్గన తెలిపారు. మా ప్రభుత్వానికి మేనిఫెస్టోనే ప్రధాన నియమావళిగా ఉంటుందని బుగ్గన స్పష్టం చేశారు.

బడ్జెట్‌లో కేటాయింపులు..

విద్యుత్‌ రంగానికి రూ. 6861.03 కోట్లు, వైద్య రంగానికి రూ. 11,399 కోట్లు, గృహ నిర్మాణానికి రూ. 3,617కోట్లు, రెవెన్యూ శాఖకు రూ. 9496.93 కోట్లు, ప్రణాళిక విభాగానికి రూ. 1439.55 కోట్లు, 

పీఎస్‌ ఆర్టీసీకి రూ. 1000 కోట్లు, పంచాయతీరాజ్‌, గ్రావిూణాభివృద్ధికి రూ. 31,654.75 కోట్లు, కడప స్టీల్‌ ప్లాంట్‌కు రూ. 250 కోట్లు, ఏపీఐఐసీకి రూ. 360 కోట్లు, రాజధానిలో మౌలిక సదుపాయాలకు రూ. 500 కోట్లు, ముఖ్యమంత్రి అభివృద్ధి నిధికి రూ. 500 కోట్లు, ముఖ్యమంత్రికి సమస్యలు చెప్పుకునే కాల్‌ సెంటర్‌కు రూ. 73.33 కోట్లు, విశాఖ-చెన్నై ఇండస్టియ్రల్‌ కారిడార్‌ నిర్మాణానికి రూ. 200 కోట్లు, రాష్ట్రంలో కొత్త రైల్వే నిర్మాణాల్లో రాష్ట్ర వాటా రూ. 185 కోట్లు, అమరావతి-అనంతపురం జాతీయ రహదారికి రూ. 100 కోట్లు, మంగళగిరిని మోడల్‌ పట్టణంగా అభివృద్ధి చేసేందుకు రూ. 50 కోట్లు, కడప యాన్యూటీ ప్రాజెక్టులకు రూ. 120 కోట్లు, స్మార్ట్‌సిటీస్‌ నిర్మాణం కోసం రూ. 150 , అటవీ, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ రూ. 446.77 కోట్లు, పౌరసరఫరాల శాఖకు రూ. 4429.43 కోట్లు, మున్సిపల్‌ అడ్మినిస్టేష్రన్‌, పట్టణాభివృద్ధికి రూ. 6587 కోట్లు, ఆర్థిక రంగానికి రూ.46,858 కోట్లు కేటాయింపులు చేశారు.

వ్యవసాయ రంగానికి పెద్దపీట..

బడ్జెట్‌లో వ్యవసాయానికి రూ.28, 866.23కోట్లు కేటాయించారు. వాటిలో ధరల స్థిరీకరణ నిధికి రూ.3000కోట్లు. ప్రకృతి విపత్తుల నివారణ నిధికి రూ.2002కోట్లు.. వైఎస్సార్‌ రైతు భరోసా పథకానికి రూ.8,550కోట్లు.. రైతులకు ఉచిత విద్యుత్‌కు రూ.4,525కోట్లు కేటాయించారు. సాగునీటి ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేస్తామని.. అన్ని కాంట్రాక్టుల విషయంలో పారదర్శకంగా ఉంటామన్నారు. ఉత్తరాంధ్రలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్నారు మంత్రి బుగ్గన తెలిపారు. విత్తన సరఫరాకు రూ.200కోట్లు, గిడ్డంగులకు రూ.200కోట్లు , వైఎస్సార్‌ అగ్రి టెస్టింగ్‌ ల్యాబ్స్‌కు రూ.109.28కోట్లు, వ్యవసాయ యాంత్రీకరణ కోసం రూ.100కోట్లు, వైఎస్‌ఆర్‌ వడ్డీలేని రుణాలు రూ.100కోట్లు, రైతు ఆత్మహత్యల పరిహారం కోసం రూ.100కోట్లు, డెయిరీ సహకార సంస్థ రూ.100కోట్లు, ప్రశుగ్రాసం రూ.100కోట్లు, గోడౌన్ల నిర్మాణం రూ.37.53కోట్లు, మత్స్యకారుల సంక్షేమం రూ.410కోట్లు, ఆక్వా రైతులకు విద్యుత్‌ సబ్సిడీ రూ.475కోట్లు, వైస్సార్‌ - పీఎం ఫసల్‌ బీమా యోజన రూ.1163కోట్లు కేటాయించినట్లు తెలిపారు. వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ.20,677 కోట్లు, సాగునీరు, వరద నివారణకు రూ.13,139 కోట్లు, వైఎస్సార్‌ రైతు భరోసాకు రూ.8,750 కోట్లు కేటాయించారు. రైతు భరోసా పథకంతో 15 లక్షల మంది కౌలు రైతులకు కూడా మేలు జరుగుతుందని ఆర్థికమంత్రి తెలిపారు. పంటల విూద కౌలు రైతులు రుణాలు పొందేందుకు అవకాశం కల్పిస్తామని అన్నారు. అదేవిధంగా మత్స్యకారులకు వేట నిషేధ సమయంలో ఇచ్చేందుకు రూ. 100 కోట్లు కేటాయించారు. రెట్టీలు, హార్బర్ల అభివృద్ధికి రూ. 100 కోట్లు, మత్స్యకారుల బోట్లకు సబ్సిడీ ఇచ్చేందుకు రూ. 100 కోట్లు, మత్స్యసంపద అభివృద్ధికి రూ. 60 కోట్లు, ఎస్సీ మత్స్యకారుల సంక్షేమానికి రూ. 50 కోట్లును బడ్జెట్‌ కేటాయిస్తున్న మంత్రి బుగ్గన వెల్లడించారు. 

2021 జూన్‌ నాటికి పోలవరం పూర్తి..

ఏపీ ప్రజల జీవనాడి పోలవరం ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆర్థిక మంత్రి బుగ్గన తెలిపారు. 2021 జూన్‌ నాటికి ప్రాజెక్టును పూర్తి చేస్తామని, అందుకోసం తగిన బ్జడెట్‌ను ప్రభుత్వం కేటాయిస్తుందన్నారు. వీటితో పాటు సాగునీటి అవసరాలను తీర్చే పలు ప్రాజెక్టులను సైతం సత్వరమే పూర్తి చేస్తామని వెల్లడించారు. మొత్తంగా సాగునీటి ప్రాజెక్టుల కోసం రూ.13,139.13 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. వైఎస్‌ 'హరితాంధప్రదేశ్‌' కలను సాకారం చేస్తామని ఈ సందర్భంగా వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టును 2021 జూన్‌ నాటికి పూర్తి చేస్తామని, అందుకు తగిన బ్జడెట్‌ కేటాయిస్తామన్నారు. ప్రాజెక్టు ప్రభావిత కుటుంబాలకు పునః పరిష్కారం, పునరావాసం పూర్తి చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటామని బుగ్గన తెలిపారు. పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు సొరంగం-1ని ఏడాదిలో పూర్తి చేస్తాం. దీనివల్ల 1.19 లక్షల ఎకరాలకు నీటిని అందిస్తాం. మరో రెండేళ్లలో సొరంగం-2, రెండో దశను పూర్తి చేస్తామన్నారు. అవుకు సొరంగాన్ని పూర్తి చేస్తామని, సంవత్సరంలో గాలేరు నగరి సుజల స్రవంతి ప్రాజెక్టు ఒకటో దశను పూర్తి చేస్తామన్నారు. గండికోట రిజర్వాయరులో నీటి నిల్వ, కడప జిల్లాలోని ఆయకట్టుదారులకు నీటి సరఫరాకు చర్యలు తీసుకుంటామని, కర్నూలు, అనంతపురం జిల్లాల్లోని 1.98 లక్షల ఎకరాలకు సాగునీటిని కల్పించేందుకు హంద్రీనీవా సుజల స్రవంతి ఒకటో దశను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని బుగ్గన తెలిపారు. అనంతపురం, చిత్తూరు జిల్లాల్లోని ప్రస్తుతమున్న 

చెరువులను నింపేందుకు ఒక నిర్ణీత కాలావధి విధానంలో రెండో దశను పూర్తి చేస్తామని, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలోని సాగునీటి సౌకర్యాలను కల్పించడానికి వంశధార ప్రాజెక్టు, సర్దార్‌ గౌతు లచ్చన్న తోటపల్లి ప్రాజెక్టు పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. సాగునీటి ప్రాజెక్టుల పూర్తి చేయడంతో పాటు చెరువులు, సరస్సుల పునరుద్ధరణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని బుగ్గన తెలిపారు.

సంక్షేమ రంగానికి వెన్నుదన్ను..

రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో సంక్షేమ రంగానికి పెద్దపీట వేసింది. సంక్షేమ రంగానికి రూ. 14,142 కోట్లు కేటాయిస్తూ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన ప్రకటించారు. వృద్ధులు, వితంతువుల పెన్షన్‌కు రూ. 12,801 కోట్లు, ఆశా వర్కర్లకు రూ. 455.85 కోట్లు, వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకానికి రూ. 1740 కోట్లు, డ్వాక్రా మహిళల వడ్డీ లేని రుణాలకు రూ. 1140 కోట్లు, పట్టణ స్వయం సహాయక సంఘాలకు వడ్డీలేని రుణాలకు రూ. 648 కోట్లు, వైఎస్సార్‌ గృహ వసతి పథకానికి రూ. ఐదువేల కోట్లు, దళితుల అభివృద్ధికి రూ. 15వేల కోట్లు, గిరిజనుల అభివృద్ధికి రూ. 4988 కోట్లు, వెనుకబడిన వర్గాల (బీసీ) అభివృద్ధికి రూ. 1561 కోట్లు, దివ్యాంగుల పెన్షన్లకు రూ. 2133.62 కోట్లు, ఒంటరి మహిళల పెన్షన్లకు రూ. 300 కోట్లు, మైనారిటీల అభివృద్ధికి రూ. 952 కోట్లు, అగ్రిగోల్డ్‌ బాధితులకు రూ. 1,150 కోట్లు, కాపు సంక్షేమానికి రూ. 2వేల కోట్లు, ఆటో డ్రైవర్ల సంక్షేమానికి రూ. 400 కోట్లు, నాయి బ్రాహ్మణులు, రజకులు, టైలర్ల సంక్షేమానికి రూ. 300 కోట్లు, చేనేత కార్మికుల సంక్షేమానికి రూ. 200 కోట్లు, కార్మిక సంస్థల అభివృద్ధికి రూ. 234 కోట్లు, బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్‌కు రూ. 100 కోట్లు, న్యాయవాదుల సంక్షేమ ట్రస్ట్‌కు రూ. 100 కోట్లు, కొత్తగా ప్రాక్టీస్‌ పెట్టుకునే లాయర్ల సంక్షేమానికి రూ. 10 కోట్లు కేటాయిస్తున్నట్లు ఆర్థిక శాఖ మంత్రి తెలిపారు. 

వైద్యారోగ్యశాఖకు రూ.1500కోట్లు ..

కార్పొరేట్‌ ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వ ఆస్పత్రులను తీర్చిదిద్దేందుకు రూ.1500 కోట్లు కేటాయిస్తున్నట్లు మంత్రి బుగ్గన చెప్పారు. రూ.66 కోట్లతో ప్రాథమిక వ్యయంతో పాడేరు/అరకు ప్రాంతాల్లో గిరిజన వైద్య కళాశాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోందని తెలిపారు. పల్నాడులో సేవలకోసం గురజాల వద్ద ఒకటి, ఉత్తరాంధ్రలో సేవల కోసం విజయనగరంలో వైద్య కళాశాలలను నెలకొల్పాలని యోచిస్తున్నామని, ఇందుకోసం రూ.66 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో కిడ్నీ పరిశోధన కేంద్రం, సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటు కోసం రూ.50 కోట్ల వ్యయం చేయనున్నట్లు తెలిపారు. వెయ్యికి 74గా ఉన్న ప్రసూతి మరణాల రేటును 55కు తగ్గించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. శిశు మరణాలను 32 నుంచి 22కి తగ్గించాలని యోచిస్తున్నామని తెలిపారు.

ఆరోగ్యశ్రీకి ఊపిరి..

ఆరోగ్యశ్రీ ఆ పేరు వింటేనే పేదవాడి మొహంపై చిరునవ్వు కనిపిస్తుంది. వారికి ఆరోగ్య భద్రత కల్పించి, కార్పొరేట్‌ వైద్యాన్ని వారికి చేరువ చేసిన ఆరోగ్యశ్రీ పథకం గురించి ఎంత చెప్పినా తక్కువే. వైఎస్‌ ప్రజల గుండెల్లో నిలిచిపోవడానికి ఈ పథకం ప్రధాన కారణం కూడా. ఈ స్కీమ్‌ వైఎస్‌ని తిరుగులేని నేతగా ఆదరణని తెచ్చిపెట్టింది. అయితే వైఎస్‌ఆర్‌ మరణాంతరం ఈ పథకం సరిగా అమలు కాలేదన్న విమర్శలు ఉన్నాయి. వై.ఎస్‌. రాజశేఖర్‌ రెడ్డి తనయుడు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆరోగ్యశ్రీ పథకానికి మళ్లీ జీవం పోస్తున్నారు. ఏపీ బ్జడెట్‌లో ఆరోగ్యశ్రీకి సంబంధించి పలు కీలక ప్రకటనలు చేశారు ఆర్థిక మత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌. ఈ సందర్భంగా ఆయన రామాయణంలోని ఓ ఘట్టాన్ని గుర్తు చేశారు. 

ఇంద్రజిత్‌ అస్త్రానికి కుప్పకూలిన లక్ష్మణుడిని మూర్ఛ నుంచి లేపేందుకు హనుమంతుడు సంజీవని పర్వతం తెచ్చినట్లు దివంగత నేత వైఎస్‌ఆర్‌ ఏపీ ప్రజల కోసం ఆరోగ్యశ్రీ తెచ్చారని అన్నారు. వార్షిక ఆదాయం రూ.5 లక్షలలోపు ఉన్న అన్ని కుటుంబాలకు ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తామని ఆయన తెలిపారు. అంటే నెలకు రూ.40,000 ఆదాయం ఉన్న మధ్యతరగతి ప్రజలకు కూడా ఇది వర్తిస్తుంది. దీంతో మరో 5 లక్షల మందికి ఆరోగ్యశ్రీ ప్రయోజనాలు అందుబాటులోకి రానున్నాయి. బ్జడెట్‌లో దీనికోసం రూ.1,740 కోట్లు కేటాయించారు. వైద్యం ఖర్చు రూ.1,000 దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తామని తెలిపారు. ఎంత పెద్ద వ్యాధి అయినా, ఎంత ఖర్చు అయినా కూడా వెనకాడబోమని పేర్కొన్నారు. అలాగే హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై వంటి నగరాలకు కూడా వెళ్లి చికిత్స చేయించుకోవచ్చునని తెలిపారు. ఇకపోతే రూ.143 కోట్లతో 432 అదనపు 108 అంబులెన్స్‌ కొనుగోలు చేస్తామని తెలిపారు. అలాగే 104 సేవల కోసం రూ.180 కోట్లు కేటాయించారు. దీని ద్వారా 676 అదనపు 104 వాహనాలు కొనుగోలు చేస్తారని, ప్రభుత్వ హాస్పిటల్స్‌కు రూ.1,500 కోట్లు కేటాయింపులు చేసినట్లు ఆర్థికశాఖ మంత్రి తెలిపారు.

విద్యారంగానికి అగ్రతాంబూలం..

విద్యారంగానికి బడ్జెట్‌లో ప్రభుత్వం పెద్దపీట వేసింది. ఈ మేరకు అసెంబ్లీలో మంత్రి బుగ్గన వివరాలను వెల్లడించారు. విద్యారంగానికి మొత్తం రూ. 32,618 కోట్లు కేటాయింపులు చేశారు. ఉన్నత విద్య రూ. 3021.63 కోట్లు కేటాయించారు. అమ్మఒడి పథకానికి రూ. 6455 కోట్లు, పాఠశాలల మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ. 1500 కోట్లు కేటాయించారు. మధ్యాహ్న భోజన పథకానికి రూ. 1077 కోట్లు, 

పాఠశాలల నిర్వహణ గ్రాంటుకు రూ. 160 కోట్లు కేటాయింపులు చేశారు.

‘అమ్మఒడి’ పథకానికి రూ.6,455.80కోట్లు..

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న అమ్మఒడి పథకానికి ప్రభుత్వం బ్జడెట్లో భారీగా నిధులు కేటాయించింది. 'జగనన్న అమ్మఒడి' పథకంగా పిలవబడే ఈ స్కీమ్‌ నవరత్నాల్లో కీలకమైనది. పిల్లలకు బడికి పంపే ప్రతి అమ్మ బ్యాంక్‌ అకౌంట్లో సంవత్సరానికి రూ.15వేలు వేస్తామని జగన్‌ ఇచ్చిన హావిూ మహిళలను విశేషంగా ఆకట్టుకుంది. డబ్బులు లేక ఓ ఒక్క చిన్నారి చదువుకు దూరం కాకూడదన్న ఆలోచనతోనే 'జగనన్న అమ్మఒడి' పథకాన్ని ప్రవేశపెడుతున్నట్లు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్‌రెడ్డి బ్జడెట్‌ ప్రసంగంలో పేర్కొన్నారు. బిడ్డలను పాఠశాలలకు పంపే ప్రతి తల్లికి ఈ పథకం కింద రూ.15వేలు అకౌంట్లో జమ చేస్తామన్నారు. ఈ పథకాన్ని ముందుగా 1-10 తరగతుల విద్యార్థులకు ప్రవేశపెట్టినా.. ఇంటర్‌ వరకు వర్తింపజేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. దీని ద్వారా 43మంది లక్షల మంది తల్లులకు ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. ఈ స్కీమ్‌కు ముఖ్యమంత్రి జగన్‌ పేరు పెట్టేందుకు ఆయన్ని చాలా ఒప్పించాల్సి వచ్చిందని మంత్రి తెలిపారు. ఎన్నికల్లో వైసీపీ కనీవినీ ఎరుగని విజయాన్ని సాధించడం వెనుక 'అమ్మఒడి' పథకం పాత్ర ఎంతో ఉంది. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందుల వల్ల ఏ ఒక్క చిన్నారి బడికి దూరం కాకూడదన్న ఆశయంతో జగన్‌ ఈ పథకానికి రూపకల్పన చేశారు. ఆయన ఆశయానికి అనుగుణంగా ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్‌రెడ్డి ప్రస్తుతం బ్జడెట్లలో ఈ పథకానికి ఏకంగా రూ.6,455.80కోట్లు కేటాయించారు. 
Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close