Featuredక్రైమ్ న్యూస్

వెబ్‌ కిలేడీలు

– అభ్యర్థులే టార్గెట్‌

– అమాయకులకు వల

– పెట్టుబడి రూ. 2వేలు

– ఆమ్దాని రూ. కోటి

– రహస్యం బయటపెడితే సూసైడ్‌ నోట్‌

‘తాటిని తన్నే వాడుంటే… వాడి తల తన్నేవాడు’ ఉన్నట్లు… రాజకీయ నాయకులు అంటేనే ముదురుగాళ్ళు. ఎన్నో చేసి… చూసి… ఖద్దరు వేసిన వాళ్ళకే టోపి పెట్టి… కన్నం వేసే వెబ్‌ బృందాలు బయలుదేరాయి. వాటికి అందమైన పేరే ‘వెబ్‌ ఛానల్‌’. ఆదాబ్‌ హైదరాబాద్‌ అందిస్తున్న పరిశోధన కథనం.

(రమ్యాచౌదరి, ఆదాబ్‌ హైదరాబాద్‌)

పెట్టుబడి రెండు వేలు..: శాటిలైట్‌ ఛానల్‌ పెట్టాలంటే కోట్లు కావాలి. ఎన్నో నిబంధనలు. దాని స్థానంలో వెబ్‌ ఛానల్‌ పేరుతో ఊరూ.. పేరూ లేని అనామకులు సోషల్‌ గ్రూపులలో ఆకర్షించి… లక్షలాది రూపాయలు వెనుకేసుకునే పథకాలకు కొందరు తెరలేపారు. దీనికి సంబంధించి సమాజంలో పరువుగల వారిని ఆకర్శించి వల వేస్తారు. అన్ని అనుమతులు ఉన్నాయని ఢంకా బజాయించి మరీ నమ్మకంగా చెపుతారు. అందుకు కావల్సింది సంబంధిత మున్సిపల్‌ లేదా కార్పోరేషన్‌ లో వ్యాపార అనుమతి. ఇందుకు వేయి నుంచి పదిహేను వందలు చెల్లించి సాధారణ వ్యాపార అనుమతి పొందుతారు.

ఇలా చిటికేసి.. అలా వలేసి..: జర్నలిజం విూద ఆసక్తి ఉన్న యువతను టార్గెట్‌ చేసుకొని సామాజిక మాధ్యమాలలో ఈ రిక్రూట్‌ మెంట్లు ఉంటాయి. శాటిలైట్‌ ఛానళ్ళ వారికి జిల్లాలోని ప్రధాన కేంద్రాలలో మాత్రమే విలేఖరులు ఉంటారు. అయితే ఈ వెబ్‌ ఛానళ్ళ వారు మండల కేంద్రంలో కూడా అపాయింట్‌ మెంట్‌, ఐడీ కార్డులు ఇస్తారు. ఇందుకోసం కనీసం పదిహేను వేలు వసూలు చేస్తున్నారు. ఇలా అనధికార వెబ్‌ ఛానళ్ళలో పనిచేసి జీతాలకోసం వందలాది మంది ఉన్నారు. జీతాలు రావలసిన వారిలో అరుణ్‌ 24,000, జోత్స్న 12,000, మమత 8,000, రావు 28,000, మనోజ్‌ కు 14,000లు ఉన్నారు.

అ ‘జ్ఞానం’తో… ‘ఆకర్ష’ణ: ఇందులో పనిచేసే వారికి ఏమాత్రం పాత్రికేయ వృత్తిలో అనుభవం ఉండదు. అయినా సామాజిక మాధ్యమాలలో ఇతరుల వార్తలు, విశ్లేషణలు సంగ్రహించి… తామే రాసినట్లు భ్రమలు కల్పిస్తారు. ఈ అజ్ఞానులను… ప్రధానంగా మహిళలను ఎంపికచేసుకొని సామాజిక మాధ్యమాలలో ప్రకటనలు గుప్పిస్తారు. అందుకు ఆకర్శితులైన యువతను లక్ష్యంగా చేసుకొని వసూళ్ళకు తెరదీస్తారు. స్థానిక పార్టీ అభ్యర్థుల వద్దకు వీరిని పంపి బేరసారాలు సాగిస్తారు. వీరితో ‘ఎందుకొచ్చిన తంటా’ అనుకుంటూ ‘ప్యాకేజీ’ మాట్లాడుకొని మౌనంగా ఉంటున్నారు.

ఒకరు ‘ఢీ’ మరొకరు ఎన్‌ ‘ఢీ’…: ఛానల్‌ లోగో, ఐడీ కార్డుల జారీ పేరుతో వసూళ్ళు చేసే సంస్కృతి ఆనవాయితీగా మారింది. వీరు మొబైల్‌ ఫోనులలో వచ్చిన సాంకేతిక పరిజ్ఞానంతో చిన్న గదిని స్టూడియో రూపంలో అలంకరిస్తారు. శాటిలైట్‌ ఛానళ్ళను మించిన ఏర్పాట్లు చేస్తారు. ఆ ఛానళ్ళలోనూ అంత అట్టహాసంగా ప్రసారం చేయరు. కానీ వీరు మాత్రం ఐటెంను అద్భుతంగా చిత్రీకరించి బయటకు వదులుతారు. డబ్బు ఇస్తే పోజిటీవ్‌ వార్త లేకుంటే నెగెటివ్‌ పబ్లిసిటీ. ఇందులోనూ పోటీనే. వసూళ్ళలోనూ ఎక్కడా తగ్గరు. ఒకరు ‘ఢీ’ అంటే మరొకరు ఎన్‌ ‘ఢీ’ అంటూ దూసుకెళుతున్నారు. తీరా వారి గురించి ఆరా తీస్తే… గుర్తింపు లేని విషయాలు వెలుగుచూశాయి. ఈ సంస్థలలో జర్నలిజంపై అవగాహన లేని మహిళలు పెత్తనం చేయడం గమనార్హం.

ముచ్చటగా మూడొందలు మాత్రమే..: మూడు వందలు చెల్లిస్తే అనుకున్న ‘లోగో’ తో వార్తల స్క్రోలింగ్‌ పరిమితంగా ప్రసారం అయ్యే లింక్‌ ఏర్పాటు చేస్తారు. దీనికి వారు చేసే ఛార్జీ కేవలం మూడు వందలే కావడం గమనార్హం. ఇది గంటలు, రోజులు, నెలలు, సంవత్సరాల ఆధారితంగా చార్జీల వసూలు ఉంటుంది. అందుకు సంబంధించిన ‘ఆప్‌’లు కూడా తక్కువ ధరకు అందుబాటులో ఉన్నాయి.

నగర శివారులే అడ్డా..: హైదరాబాద్‌ నగరం నుంచి ఎలాంటి ప్రకటన చేసినా అది నిజమనే అభిప్రాయం నెలకొంది. దీంతో విూడియా వ్యాపారం లాభసాటిగా భావించిన వారు ప్రస్థుతం శాటిలైట్‌ పేర్లకు దగ్గరగా ఉండే విధంగా పాపులర్‌ శాటిలైట్‌ టివీ ఛానల్‌ కు అతి దగ్గరగా ఉండే విధంగా… పక్కన ఎదో ఒక సంఖ్య లేదా పదం చేరుస్తారు. ఇలాంటి వెబ్‌ ఛానళ్ళకు నగర శివారు ప్రాంతాలకు అడ్డాగా ఉన్నాయి. ఇంకొందరు ఓ డబుల్‌ బెడ్‌ రూములను అద్దెకు తీసుకొని కోట్లొది రూపాయల వ్యాపారం గుట్టుగా సాగిస్తున్నారు. ఈ వెబ్‌ ఛానళ్ళకు ఎలాంటి గుర్తింపు లేకపోవడంతో నిర్వాహకులు బాగానే దండుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

ఇదీ విషయం: అసలు వెబ్‌ ఛానల్‌ నిర్వాహణకై రెండు నుంచి మూడు లక్షల ఖరీదుతో అత్యంత నాణ్యమైన ప్రసారాలు స్థానికంగా ఏడాదిపాటు నిరంతరం అదించవచ్చు. అయితే అవగాహన లేని ఆర్థిక స్థితిమంతులను ఈ ఉచ్చులోకి లాగి లక్షలు దండుకోవడం కొందరు వృత్తిగా మార్చుకొన్నారు

అనుమతులు లేకుంటే నేరమే..: కేబుల్‌ చట్టంలోని నిబంధనల మేరకు అనుమతి పత్రాలు లేకుండా ఎవరు ఏవిధంగా అప్‌ లోడ్‌ చేసినా నేరమే. కాబట్టి నిజాయితీగా ఈ వెబ్‌ వ్యాపారానికి వచ్చే వారు అనుమతులు పొందాల్సి ఉంటుంది. అందుకు సంబంధించిన అనుమతులను బహిరంగంగా ప్రదర్శించాల్బి ఉంటుంది.

శాటిలైట్‌ యజమాని దిగ్భ్రాంతి : ఇటీవలే దక్షిణ భారతదేశంలో శాటిలైట్‌ అనుమతులు తీసుకున్న ఓ ఛానల్‌ యజమాని వాసుదేవరావు తెలంగాణ ఎన్నికల సందర్భంగా జరుగుతున్న వెబ్‌ ఛానళ్ళ వసూళ్లపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారికి ఎలాంటి అక్రిడేషన్లు ఉండవని ఎవరూ నమ్మిపోవద్దని, ఎలాంటి అనుమానాలు ఉన్నా జిల్లా సమాచార అధికారిని సంప్రందించి నిజాలను తెలుసుకోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

మాలాంటి వారికి ఇబ్బంది: సీనియర్‌ జర్నలిస్టుల ఆవేదన

వెబ్‌ ఛానళ్ళ ముసుగులో జరుగుతున్న వ్యాపారం వలన నిజమైన వారికి ఆన్యాయం జరుగుతోందని సీనియర్‌ జర్నలిస్టులు జనార్థన్‌, మానుకొండ కిరణ్‌, స్వామి, శ్రీనివాస్‌, ఫణి, వెంకట్‌లు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిని అరికట్టాల్సిన అవసరం ఉందని వారు అభిప్రాయపడ్డారు.

ఫిర్యాదు చేస్తే చర్యలు: వెబ్‌ ఛానళ్ళ పేరుతో వేధింపులకు పాల్పడితే సంబంధిత పోలీస్టేషన్‌ కు వెళ్ళి పిర్యాదు చేయవచ్చని ఐజి నాగిరెడ్డి స్పష్టం చేశారు. పోలీసులు కూడా వెంటనే విచారణ చేసి బాధితులకు న్యాయం చేస్తారని తెలిపారు.

నిఘా ఉంది..: కొన్ని వెబ్‌, టీవీ కేబుల్‌ ఛానళ్ల విషయంలో ఫిర్యాదులు అందుతున్న మాట వాస్తవమే అని.. వారిపై కఠినంగా వ్యవహరిస్తామంటూ గత ఏడాది ఫిబ్రవరిలోనే సౌత్జోన్‌ డీసీపీ సత్యనారాయణ ప్రకటించారు. అయితే వచ్చిన ఫిర్యాదులపై కేసులు నమోదు చేసి, అందులో పాత్రదారులపై చర్యలు తీసుకున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా వెబ్‌ ఛానళ్ళ నిర్వహణ పేరుతో అక్రమాలు చేస్తే సంబంధిత పోలీస్టేషన్‌లో పిర్యాదు చేస్తే తప్పక చర్యలు తీసుకుంటామని సైబర్‌ క్రైం పోలీసులు స్పష్టం చేశారు.

వెబ్‌ ఛానల్‌ కై 80లక్షలు..?

తన వారసుడిని విదేశాలకు పంపడానికి కూడబెట్టుకున్న ఓ వ్యక్తి నుంచి ఓ నిర్వాహకురాలు ఎన్‌ ‘ఢీ’ పేరుతో ఏకంగా 80 లక్షలు గుంజిందని పోలీసులకు పిర్యాదు అందింది. ఆమె చాలా తెలివిగా ఏదైనా కేసు అయితే తాను ఎక్కడా ఇరుక్కోకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిసింది. అధికారికంగా ఏ డాక్యుమెంటులో ఆమె పేరు లేకపోవడం విశేషం. ఇదీ కాకుండా మండల స్థాయిలో విలేకరులకు ఉద్యోగ అవకాశం పేరుతో ఐడీ కార్డు జారీ కోసం ఏకంగా పదిహేను వేలు వసూలు చేసిన సంఘటనలు ఆధారాలతో ఆదాబ్‌ దృష్టికి వచ్చాయి. పనిచేసిన ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించలేదని తెలిసింది. దీనిపై పిర్యాదు చేద్దామని బాధితులు పోలీస్టేషన్‌ కు వెళితే… నిర్వాహకురాలు ‘తాను ఆత్మహత్య’ చేసుకుంటానని, సుసైడ్‌ నోట్‌ లో విూ పేరూ రాస్తానని చెప్పడం జరిగింది. దీంతో బాధితులు బిక్కమెఖం వేసుకొని తిరిగొచ్చారు. ఈ మహిళపై స్థానికంగా ఇలాంటి ఆరోపణలు ఉన్నాయని తెలిసింది. సంబందిత వెబ్‌ యజమాని దిక్కతోచక మౌనంగా చూస్తున్నారు. ఈ మహిళ తనకు డిజిపి తెలుసునని చెప్పి అందరినీ బెదరకొడుతుందని తెలిసింది. ఈమెకు పోలీసుశాఖలో ఎవరూ తెలియదని ఓ బాధితుడు చెప్పడం కొసమెరుపు.

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close