భారీ మెజార్టీతో గెలుస్తాం

0
  • మోడీ పై దేశ ప్రజల్లో నమ్మకం ఉంది
  • జైశ్రీరామ్‌ అంటే మమతా ఉలిక్కిపడుతుంది
  • మా ర్యాలీలు అడ్డుకోవచ్చు.. మా విజయాన్ని అడ్డుకోలేవు
  • బెంగాల్‌ సీఎంపై మండిపడ్డ బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా

న్యూఢిల్లీ (ఆదాబ్‌ హైదరాబాద్‌): ఈనెల 23న వెలువడే లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో పూర్తిస్థాయి మెజార్టీ భాజపా సాధిస్తుందని, మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని భారతీయ జనతా పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం ఓ జాతీయ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ… ‘గత ఎన్నికల్లో సాధించిన మెజార్టీ కంటే ఈ సారి అధిక మెజార్టీ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై దేశ ప్రజలకు నమ్మకం ఉందని, ఆయన మళ్లీ అధికారంలోకి రావాలని ప్రచారం చేశామన్నారు. ఆయన అనేక అభివృద్ధి పనులు చేశారని, దేశాన్ని సురక్షితంగా ఉంచుతామనే భరోసా ఇచ్చారన్నారు. ఆర్థిక వ్యవస్థను బలపర్చారని, ప్రజలు దేశంలో మార్పులను చూశారని అమిత్‌షా తెలిపారు. దేశ భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని ప్రజలు కోరుకుంటున్నారని, మోడీ పాలనలోనే సర్జికల్‌ స్ట్రైక్స్‌, ఎయిర్‌ స్ట్రైక్స్‌ జరిగాయని వ్యాఖ్యానించారు. జైష్‌ ఎ మహ్మద్‌ ఉగ్రవాది మసూద్‌ అజార్‌ను ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించడం నరేంద్ర మోడీ సాధించిన అతి పెద్ద దౌత్య విజయమని అమిత్‌షా తెలిపారు. కుల రాజకీయాలు చేస్తున్న రాజకీయ పార్టీలు ప్రజాదరణను కోల్పోతున్నాయని, ఉత్తర్‌ప్రదేశ్‌లో బీఎస్పీ, ఎస్పీ అప్పట్లో ఇటువంటి రాజకీయాలే చేశాయన్నారు. భాజపా తరఫున సమర్థవంతమైన నాయకుడు ఉన్నారని, ప్రతిపక్షాల్లో ఇటువంటి నాయకుడు లేరన్నారు. జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్‌ 370, 35ఏలను రద్దు చేయడానికి భాజపా పూర్తిగా కట్టుబడి ఉందని, ఈ సారి పశ్చిమ బెంగాల్‌లోనూ మేము అధిక సీట్లు సాధిస్తామని అమిత్‌ షా తెలిపారు.

జైశ్రీరామ్‌ అంటే మమతా ఉలిక్కిపడుతుంది.. ‘జై శ్రీరామ్‌’ అంటే మమతా బెనర్జీ ఉలిక్కిపడుతుందని, ఆ నినాదంతో మమతాకు సమస్య ఉన్నట్టు కనిపిస్తోందని బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా అన్నారు. పశ్చిమబెంగాల్‌లోని ఘటల్‌లో మంగళవారం ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ మమతా బెనర్జీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గత మూడు రోజులుగా ఎవరైనా ‘జై శ్రీరామ్‌’ అంటే మమతా బెనర్జీ ఉలిక్కిపడుతుండటం, అదేదో సమస్యగా ఆమె చూస్తుండటం తాను గమనించానని అన్నారు. జైశ్రీరామ్‌ అని ఇక్కడ (ఇండియాలో) కాకపోతే, పాకిస్థాన్‌లో అంటామా అని మమతను తాను ప్రశ్నించదలచుకున్నానని అన్నారు. జైశ్రీరామ్‌ అనకుండా తమను ఎవరూ ఆపలేరని అమిత్‌షా సవాలు చేశారు. మమత కాన్వాయ్‌ వెళ్తుండగా ‘జైశ్రీరామ్‌’ నినాదాలు చేసిన ముగ్గురు వ్యక్తులను ఇటీవల అరెస్టు చేశారన్న వార్తల నేపథ్యంలో అమిత్‌షా తాజా వ్యాఖ్యలు చేశారు. పశ్చిమబెంగాల్‌ ఎన్నికల్లో తమ పార్టీ 23కు పైగా లోక్‌సభ స్థానాలకు గెలుచుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ‘మమతా దీదీ… మీరు మా ర్యాలీలు అడ్డుకునే ప్రయత్నాలు చేయొచ్చు, అబద్ధాలు ప్రచారం చేయెచ్చు, ఏదైనా చేయొచ్చు, కానీ మే 23న బీజేపీ 23కు పైగా సీట్లు గెలుచుకోకుండా మాత్రం అడ్డుకోలేరని అమిత్‌షా అన్నారు. మోడీని తాను ప్రధానిగా పరిగణించడం లేదని మమత చెబుతున్నారని, రాజ్యాంగం ప్రకారం ప్రజలే ప్రధానిని ఎన్నుకుంటున్నారన్న విషయం ఆమెకు తెలియకపోవడం విడ్డూరమని అమిత్‌షా ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలనంతటిని ఏకంచేసి బీజేపీని ఓడించాలనే దీదీ ప్రయత్నాలు ఎన్నటికి నెరవేరవని అన్నారు. దేశం మొత్తం మోడీనే మళ్లీ ప్రధాని కావాలని కోరుకుంటుందని, నీ రాష్ట్రంలో మార్యాలీలు.. మా సభలు ఆపినంత మాత్రాన మీకు విజయం దక్కదన్నారు. ఐదేళ్ల పాలనలో దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామని అన్నారు. ప్రజలంతా మళ్లీ బీజేపీనే అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారని, కోల్‌కొత్తాలోనూ లోక్‌సభలో మా సత్తా ఏంటో దీదీకి రుచిచూపిస్తామని అమిత్‌షా అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here