17 స్థానాల్లో మేమే గెలుస్తాం..

0

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): రానున్న లోకసభ ఎన్నికల్లో తాము పదిహేడు స్థానాల్లో విజయం సాధిస్తామని మజ్లిస్‌ పార్టీ అధినేత, హైదరాబాద్‌ పార్లమెంటు సభ్యులు అసదుద్దీన్‌ ఓవైసీ సోమవారం నాడు ట్వీట్‌ చేశారు. తెలంగాణలో తెరాస, మజ్లిస్‌ పార్టీ కూటమిగా ఏర్పడకపోయినప్పటికీ స్నేహపూర్వకంగా ఉంటున్నాయి. ఒకరిపై మరొకరు పోటీ చేసుకోవడం లేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లోను మజ్లిస్‌ తెరాసకు మద్దతు పలికింది. తెరాస కూడా పాతబస్తీలో అలాగే వ్యవహరించింది.

17 స్థానాల్లో మేమే గెలుస్తాం : ఈ నేపథ్యంలో రానున్న లోకసభ ఎన్నికల్లో తాము (తెరాస, మజ్లిస్‌) అన్ని స్థానాల్లో గెలుస్తామని అసదుద్దీన్‌ ధీమా వ్యక్తం చేశారు. లోకసభ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు మళ్లీ కేసీఆర్‌ను దీవిస్తార న్నారు. 17కు 17 సీట్లు తామే గెలుస్తామన్నారు. ఇది కచ్చితంగా జరుగుతుందని చెప్పారు. ఈ మేరకు సీ ఓటరు సర్వేను టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తన ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. దానిని అసదుద్దీన్‌ రీట్వీట్‌ చేశారు. సీ ఓటరు సర్వే ప్రకారం.. తెరాసకు 16 సీట్లు, మజ్లిస్‌కు ఒక సీటు రానుంది. తెరాస విజయం సమాజంలో ప్రతి వర్గానికి విజయసంకేతంగా నిలుస్తుందని చెప్పారు. ఈ గెలుపుతో నిజమైన ఫెడరల్‌ సామ్రాజ్యాన్ని స్ధాపిస్తామన్నారు.

ఎన్నికల కమిషన్‌ విడుదల చేసిన ఏడు ఫేజ్‌లపై తణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. రంజాన్‌ మాసంలో ఎన్నికలు ఏమిటని ప్రశ్నించింది. దీనిపై అసదుద్దీన్‌ ఘాటుగా స్పందించారు. రంజాన్‌ మాసంలో ఎన్నికలు జరిపితే తప్పేమిటని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో రంజాన్‌ మాసం ఉన్నందున షెడ్యూల్‌ మరో మారు పరిశీలించాలన్న వాదనను ఆయన కొట్టి పారేశారు. కొంతమంది దీనిపై అనవసర వాదన చేస్తున్నారన్నారు.

ఎంతో పవిత్రమైన మాసం : ముస్లీంలను సరిగ్గా అర్థం చేసుకోలేక వారు (తణమూల్‌ కాంగ్రెస్‌) అలా మాట్లాడుతున్నారని, లేదంటే అలాంటి వ్యాఖ్యలు చేయరని అసదుద్దీన్‌ అన్నారు. మన దేశంలో ఎన్నికలు సుదీర్ఘ ప్రక్రియ అని, కొన్ని విషయాల కోసం వాటిని వాయిదా వేయమని అడగడం సరికాదన్నారు. రంజాన్‌ మాసం అయినంత మాత్రాన పోలింగ్‌ శాతంలో ఎలాంటి మార్పు ఉండదని చెప్పారు. రంజాన్‌ మాసం ముస్లీంలకు ఎంతో పవిత్రమైనదని, ఈ సమయంలో ముస్లీంలు ఉపవాస దీక్షలో ఉంటారని, అందరూ ఓటు వేసేందుకు తరలి వస్తారని, ఈ ఎన్నికల్లో ప్రజలు దుష్టశక్తులను ఓడిస్తారని చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here