శ్రీలంక ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి సహకరిస్తాం

- ప్రధాని నరేంద్ర మోడీ
- మోడీతో భేటీ అయిన శ్రీలంక అధ్యక్షుడు రాజపక్స
- భారత్, శ్రీలంక సంబంధాలు మరింత బలోపేతమవుతాయని వెల్లడి
న్యూఢిల్లీ
శ్రీలంక ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి సహకరిస్తామని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. శుక్రవారం శ్రీలంక అధ్యక్షుడు గొటబయా రాజపక్స ప్రధాని మోడీతో భేటీ అయ్యారు. అనంతరం ఢిల్లీలో ఆ ఇద్దరూ సంయుక్తంగా విలేకరులతో మాట్లాడారు. ప్రజలు మీకు ఇచ్చిన తీర్పు.. దేశాన్ని బలంగా చూడాలనుకుంటున్న కాంక్షను తెలియజేస్తుందని శ్రీలంక అధ్యక్షుడిని ఉద్దేశించి మోడీ అన్నారు. శ్రీలంక బలంగా ఉండడం వల్ల అది భారత్‌కే కాదు, యావత్ హిందూ మహాసముద్ర ప్రాంతానికి మంచిదన్నారు. రెండు దేశాల మధ్య బంధం బలంగా ఉందన్నారు. నైబర్‌హుడ్ ఫస్ట్ అన్న విధానానికి ప్రాముఖ్యత ఇస్తామని మోడీ అన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ ఎప్పూడు పోరాటం చేస్తూనే ఉందని, ఉగ్రవాదంపై పోరు చేస్తున్న శ్రీలంకకు 50 మిలియన్ల డాలర్లు ఇవ్వనున్నట్లు మోడీ చెప్పారు. శ్రీలంక ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు 400 మిలియన్ల డాలర్లు ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. హౌజింగ్ ప్రాజెక్టులో భాగంగా సుమారు 46వేల ఇండ్లను శ్రీలంకలో నిర్మించినట్లు చెప్పారు. తమిళ ప్రజలకు 14వేల ఇండ్లు నిర్మించినట్లు తెలిపారు. అనంతరం శ్రీలంక అధ్యక్షుడు గొటబయా రాజపక్స మాట్లాడుతూ.. శ్రీలంక చెరలో ఉన్న భారతీయ జాలర్లలను అందర్నీ రిలీజ్ చేస్తున్నట్లు తెలిపారు. భారత్, శ్రీలంక మధ్య చిరకాల సంబంధాలు ఉన్నాయని, తన హయాంలో ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలను మరింత ఉన్నత స్థాయికి తీసుకు వెళ్లాలనుకుంటున్నట్టు పేర్కొన్నారు. ఇరుదేశాల ఆర్థికాభివృద్ధి, ప్రజల భద్రతకు కొలంబో, న్యూఢిల్లీ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. శ్రీలంక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇది నా మొదటి విదేశీ పర్యటన అని అన్నారు. భారత ప్రభుత్వానికి, రాష్ట్రపతికి, ప్రధానికి నా కృతజ్ఞతలు అని రాజపక్స అన్నారు. ఎన్నో అంచనాలతో తాను భారత్ పర్యటనకు వచ్చానని, ఒక దేశాధ్యక్షుడిగా తన హయాంలో ఇరుదేశాల మధ్య ఉన్న సంబంధాలను మరింత ఉన్నత స్థాయికి తీసుకువెళ్లాలని కోరుకుంటున్నానని, ఇరుదేశాల మధ్య చిరకాలంగా బలమైన మైత్రీ, సాంస్కృతిక, రాజకీయ సంబంధాలున్నాయని చెప్పారు. రాజపక్సకు రాష్ట్రపతి భవన్ వద్ద రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని మోడీ సాదర స్వాగతం పలికారు. అనంతరం భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్‌ను రాజపక్స కలుసుకున్నారు. ప్రధాని, రాజపక్స మధ్య శుక్రవారం హైదరాబాద్ హౌస్‌లో చర్చలు జరుగనున్నాయి. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం, పరస్పర సహకారంపై ఉభయులూ చర్చించనున్నారు. అనంతరం సంయుక్త ప్రకటన చేస్తారు. శనివారం ఢిల్లీలో జరిగే ఓ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం రాజపక్స తిరిగి శ్రీలంక బయలుదేరి వెళ్తారు.