ప్రైవేట్‌ విద్యాసంస్థలకు.. అండగా నిలబడతాం

0

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): అధికారంలోకి రాగానే ప్రభుత్వ విద్యాసంస్థలను బలోపేతం చేస్తూనే.. ప్రైవేట్‌ విద్యాసంస్థలకు అండగా నిలుస్తామని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఫీజు రీయింబర్స్‌ మెంట్‌ చెల్లిస్తామని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి అన్నారు. బుధవారం హైదరాబాద్‌ జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఘనత కారణంగానే తెలంగాణాలో ఎన్నో ప్రైవేటు విద్యాసంస్థలు మూతపడ్డాయని విమర్శించారు. తెలంగాణ సాధన, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ ఏర్పాటు, కేసీఆర్‌ సీఎం అవ్వటంలో ప్రైవేటు విద్యాసంస్థల పాత్ర ఉందని తెలిపారు. కానీ ప్రభుత్వ ఏర్పాటు ముందు ఒకలా ఏర్పాటు తర్వాత మరోలా అందరినీ దూరం పెట్టారని విమర్శించారు. చిన్నచిన్న విద్యాసంస్థలను కార్పొరేట్‌ విద్యాసంస్థలకు అడ్డుకట్ట వేసి ఆదుకోవాల్సిందని వ్యాఖ్యానించారు. ప్రైవేటు విద్యాసంస్థలకు అండగా నిలబడాల్సింది పోయి అవమానపరిచి నిర్వీర్యం చేసేలా వ్యవహరించారని అన్నారు. కోళ్ల ఫారాలలో విద్యాసంస్థలు నడుపుతారా అని కేసీఆర్‌ శాసనసభలో నిరాధార ఆరోపణలు చేశారని చెప్పారు. పోలీసుల సోదాలతో వేధించారని పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు తెలంగాణకు అన్యాయం చేశాయని కేసీఆర్‌ అనడం సిగ్గుచేటన్నారు. గత ప్రభుత్వాల పాలన తీరుతోనే నేడు తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రంగా నిలిచిందని గుర్తుంచుకోవాలని సూచించారు. ప్రజలంతా టీఆర్‌ఎస్‌ నాలుగేళ్ల పాలనలపై విసుగుతో ఉన్నారని, మహాకూటమికి మద్దతుగా నిలుస్తున్నారని, బడిసెంబర్‌12న అధికారం చేపట్టేది కూటమి ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. అధికారంలోకి రాగానే ప్రైవేటు విద్యాసంస్థలకు అండగా నిలబడతామని హావిూ ఇస్తున్నామని, ఏ ఏడాది కాఏడాది ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వచ్చేలా చేస్తామని చెప్పారు. ఎలాంటి ఆంక్షలు లేకుండా అర్హులందరికీ నూటికి నూరు శాతం రీయింబర్స్‌మెంట్‌ చెల్లిస్తామని చెప్పారు. ప్రభుత్వ గుర్తింపు విద్యాసంస్థల టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ సిబ్బందికి ప్రమాద బీమా, గృహ వసతి కల్పిస్తామని తెలిపారు. ప్రైవేటు విద్యాసంస్థల విద్యుత్‌ ఛార్జీలు డొమెస్టిక్‌ కింద మార్చుతామని తెలిపారు. బడ్జెట్‌ వీళ్ల అబ్బ సొమ్ముగా జేబుల నుంచి తీసి ఇస్తున్నట్లు దుర్మార్గంగా వ్యవహరించారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాబోయే కూటమి ప్రభుత్వంలో విశ్వ విద్యాలయాలను పెద్ద ఎత్తున నిధులతో బలోపేతం చేసి గ్లోబల్‌ యూనివర్సిటీలుగా తీర్చి దిద్దుతామని హావిూ ఇచ్చారు. ప్రభుత్వ స్కూళ్లను బలోపేతం చేసేలా 100 రోజుల్లో 20వేల పోస్టులతో మెగా డీఎస్సీ నిర్వహిస్తామని ఉత్తమ్‌ తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో బీసీ సంఘం నాయకులు ఆర్‌. కృష్ణయ్య, టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు రమణ, సీపీఐ రాష్ట్ర అధ్యక్షుడు చాడ వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here