Featuredజాతీయ వార్తలు

పౌరసత్వ బిల్లును వ్యతిరేకిస్తాం

  • ఇది భారత్‌ విధానాలకు వ్యతిరేకం
  • ఆర్థిక పరిస్థితిపై ప్రధాని బింకాలు
  • వయనాడ్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ

తిరువనంతపురం

కేంద్ర కేబినెట్‌ ఆమోదించిన పౌరసత్వ సవరణ బిల్లును పార్లమెంట్‌లో వ్యతిరేకిస్తామని కాంగ్రెస్‌ అగ్రనేత, వయనాడ్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ అన్నారు. పొరుగు దేశాలైన పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, అఫ్ఘానిస్థాన్‌లో అణచివేతకు గురై భారత్‌లో ఆశ్రయం కోరుతున్న వారి కోసం తీసుకొచ్చిన ‘పౌరసత్వ సవరణ బిల్లు’కు ఆమోదం తెలిపిన కేంద్ర కేబినెట్‌ మరో రెండు రోజుల్లో పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్న విషయం తెలిసిందే. ముస్లిమేతరులకు మాత్రమే పౌరసత్వం కల్పించేందుకు తీసుకొచ్చిన ఈ సవరణ బిల్లును రాహుల్‌ గాంధీ తీవ్రంగా తప్పుబట్టారు. కేంద్ర కేబినెట్‌ ఆమోదం పొందిన మరుసటి రోజునే రాహుల్‌ గాంధీ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. కేరళలోని కొలికోడ్‌లో యునైటెడ్‌ డెమోక్రటిక్‌ ఫ్రంట్‌ (యూడీఎఫ్‌) నేతృత్వంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న రాహుల్‌ గాంధీ భాజపాపై విమర్శనాస్త్రాలు సంధించారు. ‘ఈ దేశంలో ఎవరిపైనా ఎలాంటి వివక్ష చూపించినా కాంగ్రెస్‌ పార్టీ చూస్తూ ఊరుకోదు. అందులోనూ భారతీయులపై వివక్ష చూపిస్తే సహించేది లేదు. అలా వివక్ష చూపించే వారికి వ్యతిరేకంగా పోరాటం చేస్తాం. ఇది మా సిద్దాంతం. భారత్‌ ప్రతిఒక్కరికి చెందినదని మేం విశ్వసిస్తున్నాం. ఈ దేశంలోని అన్ని వర్గాలు, మతాలు, సంస్కృతులు భారత్‌లో అంతర్భాగమే’ అని రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు. ఈ బిల్లుకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపిన అనంతరం పలు రాజకీయ పార్టీల నేతల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఇది పూర్తిగా మతతత్వ చర్యగా మరికొందరు అభివర్ణిస్తున్నారు. మరోవైపు తనపై నమోదైన పలు కేసుల గురించి మీడియా అడిగిన ప్రశ్నలకు రాహుల్‌ గాంధీ స్పందించారు. తనపై 15 నుంచి 16 కేసులు నమోదు చేశారని.. ప్రతి కేసు తనకొక పతకం లాంటిదని అన్నారు. అలాంటి వాటికి భయపడి వెనకడుగు వేసేదిలేదని స్పష్టం చేశారు. ప్రతి కేసును ఎదుర్కొంటానని తెలిపారు. ఇకపోతే దేశ ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగోలేదని కేంద్ర ఆర్థిక వ్యవస్థపై రాహుల్‌ గాంధీ విరుచుకుపడ్డారు. దేశ పరిస్థితి ఇంత ఘోరంగా ఉంటే, బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా మోడీ,షా తమ సొంత భ్రమల్లో బతుకుతున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా తన సొంత నియోజకవర్గమైన వయనాడ్‌లో రాహుల్‌ పర్యటిస్తున్నారు. దేశంలో ఎలాంటి ఆర్థిక సంక్షోభం లేదన్న బీజేపీ ప్రచారంపై ఆయన భగ్గుమన్నారు. తమ సొంత భ్రమల్లో మోడీ,షా బతుకుతున్నారు. వారికి బయటి ప్రపంచంతో ఏమాత్రం సంబంధం లేదు. వారు తమ సొంత ఊహల్లో బతుకుతున్నారు. అందుకే దేశం ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లో ఉందని ఆరోపించారు. ప్రజల బాగోగులను, సమస్యలను ప్రధాని సావధానంగా వింటే దేశంలో ఎలాంటి సమస్యా తలెత్తదని, వారు భ్రమల్లో బతుకుతూ, దేశ ప్రజల్నీ అలాగే బతకమని చెబుతున్నారని రాహుల్‌ మండిపడ్డారు.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close