Featuredస్టేట్ న్యూస్

తెల్లోడి కంటే మనమే టాప్‌…

దోచుకోవడం.. దాచుకోవడంలో రికార్డు…

విదేశాల్లో మగ్గుతున్న లక్షల కోట్లు…

ఇప్పటికి యధేచ్చగా తరులుతున్న నల్లధనం…

నియంత్రణలో విఫలమవుతున్న ప్రభుత్వం…

దోచుకోవాలి.. అడ్డు అదుపు లేకుండా, మనసుకు మనశ్శాంతి కలుగకుండా ఎంత అవకాశం ఉంటే అంత దోచుకోవాలి… దోచుకున్నదీ ఎవరి కంట కనబడకుండా దాచుకోవాలి.. వీలైతే ఇతర దేశాలకు యధేచ్చగా తరలించాలి.. ఎందుకంటే మనదేశంలో అక్రమంగా దోచుకున్నవారికి శిక్షలు వేసే కఠిన చట్టాలు లేవు.. ఇతర దేశాలకు కోట్ల రూపాయలు తరలిస్తున్న పట్టించుకునే పటిష్టమైన యంత్రాంగం లేదు.. అప్పులు అడిగినప్పుడు బ్యాంకర్లు ముందు, వెనకా చూడకుండా కోట్లాది రూపాయలు ఇస్తారు.. తీరా తీసుకున్నోడు ముంచేసి ఇతర దేశాలకు చెక్కేస్తుంటే మన ప్రభుత్వ యంత్రాంగం గుడ్లప్పగిస్తూ చూస్తూ ఉంటుంది.. ఎవ్వరికి పట్టింపు ఉండదు.. బ్యాంకులు ఆ సొమ్ము తమది కాదనుకుంటున్నాయి… ప్రభుత్వ యంత్రాంగం తమ స్వంత డబ్బు కాదంటూ నిర్లక్ష్యం వహిస్తోంది.. అందుకే మనదేశంలో రోజురోజుకు అవినీతిపరులు పెరుగుతూ, జనాలను పీడిస్తూ, కోట్లాది రూపాయలను వెనకేస్తూనే ఉన్నారు.. మనదేశం నుంచి ఇప్పటికి కోట్ల రూపాయలు ఏలాంటి భయం లేకుండా సరిహద్దులు దాటిపోతూనే ఉన్నాయి… అడిగేవారు లేరు.. పట్టించుకునే వారు అంతకన్నా లేరు.. ఎవరిష్టం వారిది.. ఎంతైనా దోచుకోవచ్చు… మనదేశం సంపదను ఎక్కడికైనా తరలించవచ్చు.. అదుపు చేయాల్సిన ప్రభుత్వాలు స్పందించలేనప్పుడు దొడ్డిదారి దొంగలకు అడ్డే ఉండదని విషయం తెలిసిపోతుంది. మన పక్కవాడికి మనకు తెలిసినవాడికి వెయ్యి రూపాయలను అప్పు ఇస్తే చొక్కా పట్టి మరీ నిలదీసి అడిగి తీసుకుంటాం… కాని మన సొమ్మును, మన దేశ సంపదను విదేశాలకు తరలిస్తుంటే ఏ ఒక్కరూ స్పందించరు.. ఒకప్పుడు మన దేశానికి వచ్చిన బ్రిటిషోడు, అదే తెల్లోడు మనల్ని నిలువుగా దోచుకున్నారని ఎప్పుడో జరిగిన విషయంపై ఇప్పటికి సమయం వచ్చినప్పుడు గుండెలు బాదుకుంటున్నాం. కాని మన కళ్లెదుట మనల్ని ఏమి మిగల్చకుండా దోచుకుంటూ కోట్లాది సొమ్మును విదేశాలకు పంపుతున్న మన నల్లదొరల విషయాలపై మాత్రం చడీ చప్పుడు కూడా చెయ్యలేకపోతున్నాం.. విదేశాల్లో మూలుగుతున్న మన సొమ్ముతో కోట్ల రూపాయలతో నిర్మించిన కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు మరో పందొమ్మిది ప్రాజెక్టులు నిర్మించవచ్చని చెపుతున్నారు.. అంటే మనం రోజు మనకు తెలియకుండానే ఎంత దోపిడికి గురువుతున్నామో దీన్ని బట్టి అర్థమవుతూనే ఉంది…

హైదరాబాద్‌ ఆదాబ్‌ హైదరాబాద్‌..

మన ఇండియాలో ఎంతైనా దోచుకోవచ్చు… దోచుకొని నేరం రుజువయ్యేలోపు దేశం విడిచి పారిపోతే చాలు అతనిని పట్టుకొచ్చి శిక్ష వేద్దామనే ఆలోచన ఇప్పటికి మనలను పరిపాలించిన ఏ నాయకులకు లేదు.. ఇక్కడ దేశ సంపదకు గండికొట్టి విదేశాల్లో ఆనందంగా, ఎంజాయ్‌ చేస్తూ బతికేవాళ్లు వందలాది మంది ఉన్నారు.. వారికి శిక్షలుండవు.. మన దేశంలో కఠినమైనా చట్టాలుండవు.. మనదేశంలో ఉంటూ మనల్ని దోచుకొని విదేశాలకు పంపేసిన నల్లధనం లెక్కలకు సంబంధించిన కొన్ని నిజాలు చూస్తే మన భారతీయులు షాక్‌ కావాల్సిందే.. గడిచిన ముప్పై సంవత్సరాలలో అంటే (1980..2010) మధ్యకాలంలో భారతీయులు విదేశాల్లో దాచిన నల్లధనం లెక్కలు ఇప్పుడు పూర్తిగా బయటికి వచ్చాయి. తక్కువగా అనుకుంటే విదేశాలకు వెళ్లిన బ్లాక్‌ మనీ రూ. 15లక్షల కోట్లు ఉంటుందని అనుకున్నాం. కాని మరీ ఎక్కువగా అనుకుంటే రూ. 34లక్షల కోట్లు వరకు ఉంటుందన్న విషయం తాజాగా బయటకు వచ్చింది. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ పాలసీ అండ్‌ ఫైనాన్స్‌, నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అప్లైడ్‌ ఎకనామిక్‌ రీసెర్స్‌, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పైనాన్స్‌, నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అప్లైడ్‌ ఎకనామిక్‌ రీసెర్స్‌, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పైనాన్స్‌ మేనేజ్‌మెంట్‌ నిర్వహించిన మూడు వేర్వేరు అధ్యయనాలకు సంబంధించిన అంశాలతో పాటు, ఆర్థిక వ్యవహారాల స్థాయి సంఘం వివరాలతో తాజా నివేదికను సైతం సిద్దం చేశారు. అయితే ఇప్పుడు వెల్లడించాల్సిన అంచనాలన్నీ కూడా ఊహాల ఆధారంగా చేపట్టినవే తప్పించి శాస్త్రీయమైన విశ్లేషణ లేకపోవడం గమనార్హం. అంచనాలన్నీ పలు సర్దుబాట్లను పరిగణలోకి తీసుకొని చేపట్టినవే తప్పించి మరింకేమి లేవని తెలుస్తోంది. పార్లమెంటరీ స్థాయి సంఘం పేర్కోన్న అంచనాల ప్రకారం వేల కోట్ల రూపాయల సొమ్ము అక్కడి బ్యాంకుల్లో మూలుగుతూ ఉందని తెలుస్తోంది…

నల్లధనం రాదు.. అవినీతిపరులకు శిక్షలు పడవు..

మనదేశంలో ఎంత దోచుకుంటే అంత గొప్ప పెద్ద మనిషిగా చెలామణిలో ఉండొచ్చు.. ఎన్నికేసులు నమోదైతే అంత పెద్ద నాయకుడిగా రాజకీయాల్లోకి రావచ్చు.. సరియైన శిక్షలు ఉండవు, కఠినమైన నిబంధనలు ఉండవు. విదేశాల్లో మూలుగుతున్న నల్లధనం గరిష్టంగా ముప్పై నాలుగు వేల కోట్లుగా ప్రస్తావించారు. ఈ మొత్తంతో తెలంగాణలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులాంటివి పందొమ్మిది ప్రాజెక్టులు, ఆంధ్రప్రదేశ్‌లో నిర్మిస్తున్న పోలవరం లాంటి ప్రాజెక్టులు ముప్పై వరకూ నిర్మించవచ్చని చెపుతున్నారు. అంతేకాకుండా దేశం వెలుపల ఉన్న నల్లధనం భారత వార్షిక బడ్జెట్‌తో సమానంగా ఉంటుందని ఆర్థికవేత్తలు అంటున్నారు. ఇక నల్లధానానికి సంబంధించి ఎక్కువగా ఉండే వ్యాపారాల విషయంలో రియల్‌ ఎస్టేట్‌ గనులు, ఔషదాలు, పాన్‌ మసాలా, గుట్కా, పొగాకు, బంగారం, కమోడిటీస్‌, సినిమాలు, విద్యరంగాలు ఉన్నట్లుగా పలు అధ్యయనాలు స్పష్టం చేశాయి. మరి వీటి నియంత్రణ ఏమిటన్న దానిపై ఇతిమిద్దంగా ఏమి లేదనే పరిస్థితి కనబడుతోంది. మరింత భారీ మొత్తం నల్లధనంగా బయటదేశాల్లో ఉన్న నేపథ్యంలో ఈ నల్లధనాన్ని జనరేట్‌ కాకుండా మోడీ ప్రభుత్వం ఏలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలని దేశ ప్రజలు కోరుతున్నారు. అదే సమయంలో విదేశాల్లో మూలుగుతున్న నల్లధనంతో అంతో, కొంతో ఐనా భారతదేశానికి రప్పించి తిరిగి తీసుకొచ్చే అవకాశం ఉందా లేదా అనేది ఇప్పుడు అధికారంలో ఉన్న మోడీని ప్రశ్నిస్తున్న ప్రధాన ప్రశ్న. నల్లధనం విషయంలో రెండవసారి అధికారంలోకి వచ్చిన బిజెపి ప్రభుత్వం ఏలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాల్సిందే…

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close