Featuredస్టేట్ న్యూస్

భాగ్యనగరంలో నీటి కష్టాలు..!

మరో చెన్నైగా మహానగరం

  • హైదరాబాద్‌లో తీవ్ర నీటి సమస్య
  • ఎండిపోతున్న జంట జలాశయాలు
  • రిజర్వాయర్‌లోకి చేరని నీరు

హైదరాబాద్‌ మహానగరం మరో చెన్నైగా మారనుందా? రాబోయే నెలరోజుల్లో మనం కూడా మంచినీటి కోసం వీధిపోరాటాలకు దిగాల్సిందేనా? నగరానికి మంచినీరు అందిస్తున్న జంట జలాశయాలు ఎండిపోతున్నాయి. వచ్చే 30రోజుల్లో భాగ్యనగరం గొంతెండనుందని సాక్షాత్తూ అధికారులే చెపుతున్నారు. వర్షాకాలం ప్రారంభమై నెలన్నర గడచినా వరుణుడు కరుణించలేదు. దక్షిణాదిలో కనీస వర్షపాతం కూడా నమోదు కాలేదు. జంటనగరాలకు నీరందించే రిజర్వాయిర్లలో నీటి మట్టం అడుగంటింది. ప్రస్తుతం జంట జలాశయాల్లో నీరు ఆగష్టు చివరికి అయిపోతాయి. గత జూలైతో పోలిస్తే ఈ జూలైలో అన్ని రిజర్వాయర్లలో నీరు 12 అడుగుల మేర అడుగంటాయి. నైరుతి రుతుపవనాలు తెలంగాణలో ప్రవేశించి నెల రోజులు అవుతోంది. ఇప్పటి వరకూ అడపాదడపా జల్లులు కురిశాయి కానీ.. భారీ వర్షం మాత్రం కురవలేదు. జూన్‌, జూలై (13వ తేదీ వరకు) రాష్ట్రంలో లోటు వర్షపాతం నమోదైంది. వర్షాలు లేని ప్రభావం హైదరాబాద్‌ నగరంపై పడుతోంది. వర్షాలు లేకపోవడంతో.. జలాశయాల్లో నీటిమట్టం కనిష్ట స్థాయిలకు పడిపోతోంది. గత ఏడాది జూలైతో పోలిస్తే.. ప్రస్తుతం రిజర్వాయర్లలో నీటి మట్టం 12 అడుగులు తక్కువగా ఉంది. దీంతో నగరం తీవ్ర నీట ఎద్దడి ముప్పును ఎదుర్కోనుంది. నాగార్జున సాగర్‌, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుల్లో వరదనీటి జాడే లేదు. జంట జలాశయాలు ఉస్మాన్‌ సాగర్‌, హిమాయత్‌ సాగర్‌లలో నీటిమట్టం అడుగంటింది. సాధారణంగా ఈ సమయానికి ఐదు నుంచి పది అడుగుల వరకు రిజర్వాయర్లలో నీటిమట్టాలు పెరగాలి. కానీ ఈ ఏడాది ఒక్క అడుగు మేర కూడా పెరగలేదని జలమండలి అధికారులు చెబుతున్నారు. జలమండలి నిత్యం 166 మిలియన్‌ గ్యాలన్ల నీటిని సరఫరా చేస్తోంది. వర్షాలు ఇలాగే ముఖం చాటేస్తే.. ప్రస్తుతం జలాశయాల్లో ఉన్న నీరు ఆగష్టు చివరి వరకు మాత్రమే సరిపోతుంది. మరో 48 రోజుల తర్వాత నగరం నీటి ఎద్దడిని ఎదుర్కోవాల్సి వస్తుంది. మన పరిస్థితి కూడా చెన్నైలాగే తయారవుతుంది. ప్రస్తుత నీటి సంక్షోభంపై కేంద్రం కూడా ఆందోళన వ్యక్తం చేస్తోంది. గత ఏడాది జూలై 11తో పోలిస్తే.. ఎల్లంపల్లిలో నీటిమట్టం ప్రస్తుతం 9 విూటర్లు తక్కువగా ఉంది. నాగార్జున సాగర్‌లో గత ఏడాది జూలై 11న నీటిమట్టం 511 విూటర్లు ఉండగా.. ప్రస్తుతం 507 విూటర్లు మాత్రమే ఉంది. నగరానికి మంజీరా, సింగూరు జలాలు ప్రధానం. కానీ మంజీరా రిజర్వాయర్‌ పరిస్థితి దయనీయంగా ఉంది. సింగూరులోనూ జలాలు అట్టడుగుకి వెళ్లాయి. వచ్చే రెండు మూడు వారాల్లో భారీ వర్షాలు కురవకపోవకపోతే.. నగరానికి తీవ్ర నీటి సంక్షోభం తప్పదని వాటర్‌ బోర్డు అధికారులు భావిస్తున్నారు.

రిజర్వాయర్లలోకి చేరని నీరు : తెలంగాణలో వర్షాకాలం ఆరంభమైనప్పటికీ.. సరైన వర్షాలు లేకపోవడంతో నాగార్జున సాగర్‌, శ్రీపాద యల్లంపల్లి, ఉస్మాన్‌ సాగర్‌, హిమయత్‌సాగర్‌ రిజర్వాయర్లలోకి నీరు చేరలేదు. మామూలుగా ఈ సమయానికి ఉన్న స్థానాల కంటే 5 నుంచి 10అడుగుల నీళ్లు ఉండాలని.. కానీ ఈ ఏడాది కనీసం ఒక్క అడుగు కూడా పెరగలేదు. ఇక ప్రతి రోజు హైదరాబాద్‌కు19కోట్ల 90లక్షల గ్యాలన్ల నీటిని సరఫరా చేస్తుండగా.. రిజర్వాయర్లలో ఉన్న నీరు ఆగష్టు చివరి వరకు వస్తాయి. వీటితో పాటు మంజిరా, సింగూర్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మంజీరా నది బీడుగా మారిపోయేందుకు సిద్ధంగా ఉంది.

ఎండిపోతున్న జంట జలాశయాలు : ఉస్మాన్‌ సాగర్‌, హిమాయత్‌ సాగర్‌ లో నీరు లేదు. సాధారణంగా జూలై నాటికి రిజర్వాయర్లలో నీటి నిల్వలు పెరిగేవి. 5 నుంచి 10 అడుగుల నీరు వచ్చేది. ఈసారి మాత్రం పరిస్థితి దారుణం. కనీసం 1 అడుగు నీరు కూడా రాకపోవడంతో పరిస్థితి మరింత దారుణంగా మారింది. తాగు నీటి గండం పొంచి ఉందన్న వార్త నగవాసులకు చెమట్లు పట్టిస్తోంది. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో నీటి సమస్యతో నరకం చూస్తున్నారు. ముందు ముందు పరిస్థితి మరింత దారుణంగా మారనుందన్న వార్తలు వారికి నిద్రలేకుండా చేస్తున్నాయి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close