కొన్నిచోట్ల ఉల్లంఘనలు.. నివేదిక కోరతాం

0

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసిందని తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌కుమార్‌ తెలిపారు. సాయంత్రం 5గంటల వరకు 67శాతం పోలింగ్‌ నమో దైందని ఆయన వెల్లడించారు. ఇంకా పలు చోట్ల ఓటింగ్‌ కొనసాగుతున్నందున పోలింగ్‌ శాతంలో మార్పులు చోటుచేసుకొనే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. 2014లో నమోదైన పోలింగ్‌ శాతమే (69.5శాతం) ఈసారీ పునరావ తం కావొచ్చని ఆయన అంచనా వేశారు. మానవ తప్పిదాల వల్లే కొన్నిచోట్ల ఈవీఎం, వీవీప్యాట్‌లలో సమస్యలు తలెత్తాయని స్పష్టంచేశారు. రాష్ట్రంలో 754 బ్యాలెట్‌ యూనిట్లు, 628 కంట్రోల్‌ యూనిట్లు మార్చామన్నారు. 1444 వీవీప్యాట్‌ యంత్రాలను మార్చినట్టు చెప్పారు. మొత్తం 4292 ఫిర్యాదుల్లో 642 పెండింగ్‌లో ఉన్నాయని వివరించారు. ఎన్నికల సందర్భంగా తెలంగాణలో మొత్తం రూ.138 కోట్ల విలువైన సొత్తును, రూ.117.2 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. 2014లో తెలంగాణలో రూ.76 కోట్లు నగదు స్వాధీనం చేసుకున్నట్టు గుర్తుచేశారు. తెలంగాణలో రూ.11.6 కోట్ల విలువచేసే 5.4 లక్షల లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో గల్లంతైన పేర్లపై త్వరలోనే చేపట్టే ఓటర్ల జాబితా సవరణలో ప్రత్యేక ద ష్టి సారిస్తామని స్పష్టంచేశారు. గుత్తా జ్వాల పేరు 2015లో జాబితా నుంచి గల్లంతైందన్నారు. ఆమె పేరు గల్లంతుపై ఆర్వో నుంచి నివేదిక కోరామని తెలిపారు. 2016, 2017, 2018 జాబితాలోనూ వారి పేర్లు లేవన్నారు. ప్రత్యేక సవరణ ప్రక్రియలోనూ పేర్లు నమోదు చేసుకోలేదన్నారు. కాంగ్రెస్‌ నేత మర్రి శశిధర్‌ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదులపై విచారణ జరిపినట్టు చెప్పారు. 2019 సార్వత్రిక ఎన్నికల కోసం కొత్త జాబితాను తయారు చేస్తామని అన్నారు. అర్హులైన వారంతా తమ పేర్లను జాబితాలో చూసుకొని దరఖాస్తు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పోలింగ్‌ బూత్‌ల్లోకి మొబైల్‌ ఫోన్లకు అనుమతి లేదని చెప్పారు. కొన్నిచోట్ల ఉల్లంఘనలు జరిగాయని.. వాటిపై నివేదికను కోరతామని తెలిపారు. ఒకచోట ఈవీఎం ఫొటో తీసుకున్నారని, చర్యలు తీసుకుంటామన్నారు. ఆదిలాబాద్‌ జిల్లాలో అత్యధికంగా 76.5శాతం, వరంగల్‌ గ్రామీణ జిల్లాలో 76శాతం నమోదైందన్నారు. అతి తక్కువగా 50శాతం పోలింగ్‌ నమోదైనట్టు తెలిపారు. అత్యధికంగా నర్సంపేట నియోజకవర్గంలో 84శాతం, ఆలేరులో 83 శాతం నమోదైందని, అత్యల్పంగా యాకుత్‌పురాలో 33శాతం పోలింగ్‌ నమోదైనట్టు వెల్లడించారు. 13 సమస్యాత్మక నియోజకవర్గాల్లో 74శాతం పోలింగ్‌ జరిగిందన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here