వర్మ, అస్థానా పిల్లుల్లాగా కొట్టుకున్నారు!

0

★ అనూహ్య పరిణామాల వల్లే సెలవుపై పంపాలని నిర్ణయించారు
★ కోర్టుకు తెలియజేసిన ఏజీ వేణుగోపాల్‌

(న్యూఢిల్లీ, ఆదాబ్ హైదరాబాద్)
కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ)పై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని నిలబెట్టేందుకే సీబీఐ డైరెక్టర్‌ ఆలోక్‌ వర్మను సెలవుపై పంపించాల్సి వచ్చిందని కేంద్ర ప్రభుత్వం తరఫున హాజరైన అటార్నీ జనరల్‌ కె.కె.వేణుగోపాల్‌ సర్వోన్నత న్యాయస్థానానికి తెలియజేశారు. తనను సెలవుపై పంపించడాన్ని వ్యతిరేకిస్తూ వర్మ సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. సీబీఐ డైరెక్టర్‌ అధికారాల తొలగింపునకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి ఉన్న అధికారాల విషయంలో బుధవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయ్‌, న్యాయమూర్తులు జస్టిస్‌ ఎస్‌.కె.కౌల్‌, జస్టిస్‌ కె.ఎం.జోసెఫ్‌లతో కూడిన ధర్మాసనం ఎదుట వాదనలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలోనే వర్మను ఎందుకు పంపించారనే దానిపై అటార్నీ జనరల్‌ వివరణ ఇచ్చారు.

‘సీబీఐకి చెందిన ఇద్దరు ఉన్నతాధికారుల మధ్య నెలకొన్న వర్గపోరు కారణంగా చోటుచేసుకున్న అనూహ్య పరిణామాల వల్ల ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. దీని వల్ల సీబీఐ ప్రతిష్ట దెబ్బతినే అవకాశం ఉంది. ప్రజల్లో నమ్మకాన్ని కోల్పోయే ప్రమాదం వచ్చింది. అందువల్ల ప్రజల నమ్మకాన్ని పొందేందుకు ప్రభుత్వం అత్యవసరంగా వాళ్లను సెలవులపై పంపాలనే నిర్ణయం తీసుకుంది. పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనదేనని తేలింది’.

‘ఆలోక్‌ వర్మ, రాకేశ్‌ అస్థానాల మధ్య నెలకొన్న వర్గపోరు తీవ్ర స్థాయికి చేరి బహిరంగ చర్చకు దారి తీసింది. ఉన్నత పదవుల్లో ఉన్న ఇద్దరు వ్యక్తులు బహిరంగంగా పిల్లుల మాదిరిగా కొట్టుకుంటూ సీబీఐని అవహేళన చేశారు. అది చూసి ప్రజలంతా ఆశ్చర్యపోయారు. ఆలోక్‌ వర్మకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదని.. కేవలం ఆయన అధికారాలను మాత్రమే తొలగించడం జరిగింది’ అని ఏజీ వేణుగోపాల్‌ న్యాయస్థానానికి తెలియజేశారు. సీబీఐ ఉన్నతాధికారులకు మధ్య జరిగిన అంతర్గతపోరును వర్మ బహిర్గతం చేశారనే దానికి సంబంధించిన ఏవైనా సాక్ష్యాలు ఉన్నాయా? అని సుప్రీంకోర్టు ఏజీని ప్రశ్నించింది. అందుకు ఆయన పలు వార్తాపత్రికల్లో వర్మ గురించి వచ్చిన క్లిప్లింగ్స్‌ను కోర్టుకు అందజేశారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here