గులాబీ గూటికి ‘వంటేరు’!

0

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చని మరోసారి రుజువుకాబోతోంది.. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కేసీఆర్‌, తెరాస పై కాంగ్రెస్‌ నేత వంటేరు ప్రతాప్‌ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఒకానొక సమయంలో కేసీఆర్‌ను ఓడించేది నేనే అంటూ, కేసీఆర్‌ అంతు చూస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాంటి వ్యక్తి శుక్రవారం టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరనున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమక్షంలో ఆయన గులాబీ తీర్ధం పుచ్చుకోనున్నారు. ఇప్పటికే హరీస్‌రావు చర్చలు జరిపినట్లు సమాచారం. ఒంటేరుకు నామినేటెడ్‌ పదవినిసైతం ఇచ్చేందుకు కేసీఆర్‌ సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. 2014, 2018 ఎన్నికల్లో కేసీఆర్‌ పై గజ్వేల్‌ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2009, 2014 లో టీడీపీ తరుపున, 2018 లో కాంగ్రేస్‌ అభ్యర్థిగా గజ్వేల్‌ నుంచి వంటేరు ప్రతాప్‌ రెడ్డి పోటీ చేశారు. అయితే ఇటీవల జరిగిన ఎన్నికల ముందు ఒంటేరు టీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లో చేరారు. అప్పడి నుండి టీఆర్‌ఎస్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఎన్నికల సమయంలో ఒంటేరు ఇంటిపై పోలీసులు సోదాలుసైతం నిర్వహించారు. ఈ సోదాల సమయంలో ఆయన ఆత్మహత్య చేసుకుంటానంటూ హల్‌ చేశారని, కేసీఆర్‌ నన్ను చంపేందుకు కుట్ర చేస్తుందని ఆరోపించారు. ఎన్నికల టీఆర్‌ఎస్‌ గెలిచిన తరువాత కూడా కేసీఆర్‌ ప్రభుత్వం విమర్శలు గుప్పించారు. టీఆర్‌ఎస్‌ పార్టీతో ఎలక్షన్‌ కమిషన్‌ కుమ్మక్కు అయ్యిందన్న అనుమానం వ్యక్తమవుతుందని ఇటీవలే ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈవీఎంల టాంపరింగ్‌ కు పాల్పడుతున్నారని అనుమానం వ్యక్తం చేశారు. అవసరమైతే ఈ అంశంపై హైకోర్టుకు కూడా వెళ్తానన్నారు. టీఆర్‌ఎస్‌ తో ఎలక్షన్‌ కమిషన్‌ కుమ్మక్కు అయినట్లు తమకు అనుమానం ఉందని ఆరోపించారు. తెలంగాణ ప్రజల అపోహలను ఈసీ తొలగించాలని డిమాండ్‌ చేశారు. అలాంటి వ్యక్తి మళ్లీ టీఆర్‌ఎస్‌లో చేరుతుండటంతో కాంగ్రెస్‌ శ్రేణులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఇదిలా ఉంటే సత్తుపల్లి ఎమ్మెల్యే, టీడీపీ నేత సండ్ర వెంకటవీరయ్య కూడా టీఆర్‌ఎస్‌లో చేరే అవకాశాలుఉన్నట్లు తెలుస్తోంది. గురువారం అసెంబ్లీ సమావేశాలకు సండ్ర హాజరు కాలేదు. గత కొంతకాలం నుంచి సండ్రను టీడీపీలో చేరాలని టీఆర్‌ఎస్‌ నేతలు సూచిస్తున్నట్లు సమాచారం. ఖమ్మం టీఆర్‌ఎస్‌ నేత తుమ్మల నాగేశ్వరరావు సండ్రను టీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఇప్పుడు చేరితేనే అవకాశం ఉంటుందని, తరువాత చేరే అవకాశం ఉండదని సండ్రకు టీఆర్‌ఎస్‌ తేల్చిచెప్పినట్లు సమాచారం. దీంతో సండ్ర వెంకటవీరయ్య రెండుమూడు రోజుల్లో టీఆర్‌ఎస్లో చేరుతారని విస్తృత ప్రచారం జరుగుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here