సిరియా నుంచి అమెరికా దళాల ఉపసంహరణ

0

ట్రంప్‌ ఆశ్చర్యకర నిర్ణయం

న్యూఢిల్లీ (ఆదాబ్‌ హైదరాబాద్‌): అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ తన నిర్ణయంతో అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తుతూ సిరియా నుంచి తమ దేశ సైనిక దళాలు ఉపసంహరణ కోసం ఆదేశాలు ఇచ్చారు. పెంటగాన్‌ ఈ నిర్ణయాన్ని వెల్లడించింది. వైట్‌హౌజ్‌ దీన్ని ధృవీకరించింది. ఇస్లామిక్‌ ఉగ్రవాదులు ఓడిపోయారని, సిరియాలో ఉన్న రెండు వేల సైనికులు వెనక్కి రావాలని ట్రంప్‌ తన ఆదేశాల్లో స్పష్టంగా పేర్కొన్నారు. అయితే ట్రంప్‌ నిర్ణయంపై కొందరు రిపబ్లికన్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయిదేళ్ల క్రితం ఐసిఎస్‌ అత్యంత శక్తివంతంగా, ప్రమాదకరంగా ఉండేదని, అమెరికా దళాలు ఆ దుష్టశక్తిని నాశనం చేశాయని వైట్‌హౌజ్‌ ప్రెస్‌ సెక్రటరీ సారా శాండర్స్‌ ఒక ప్రకటనలో తెలిపారు. దీనికి సంబంధించి ట్రంప్‌ ఓ ట్వీట్‌ కూడా చేశారు. ట్రంప్‌ తీసుకున్న నిర్ణయాన్ని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ స్వాగతించారు. ట్రంప్‌ సరైన నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. సిరియా నుంచి దళాలను వెనక్కి రప్పించడంలో ఆశ్చర్యం లేదని ట్రంప్‌ మరో ట్వీట్‌ చేశారు. గత కొన్నేళ్లుగా ఇదే చెబుతున్నట్లు ఆయన తెలిపారు. రష్యా, ఇరాన్‌, సిరియా దేశాలను ఐఎస్‌ఐఎస్‌ శత్రువులుగా భావిస్తున్నదని, మనం వాళ్ల పనిని చేస్తున్నామని, ఇక ఇంటికి రావాల్సిన సమయం ఆసన్నమైందని, తిరిగి అమెరికాను పునర్‌ నిర్మించాలని ట్రంప్‌ అన్నారు. మిడిల్‌ ఈస్ట్‌ దేశాలకు అమెరికా ఓ పోలీసులా పనిచేయాలా అని ఆయన ప్రశ్నించారు. కోట్లాది డాలర్లను ఖర్చు చేసి ఇతరులను కాపాడే సమయంలో విలువైన ప్రాణాలను కోల్పోతున్నామని, మనం ఎన్ని చేసినా, మన పనిని గుర్తించలేనివారున్నారని, అలాంటప్పుడు ఇంకా అక్కడే ఎందుకు ఉండాలని, తక్షణమే వెనక్కి రావడం ఉత్తమం అని ట్రంప్‌ తన ట్వీట్‌లో తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here