Featuredస్టేట్ న్యూస్

సమస్యల యూనివర్శిటీలు…

చదువులు చెప్పే ప్రొపెసర్లు లేరు…

సమస్యలపై స్పందిచే యంత్రాంగం లేదు..

నిధులు లేవు.. నియామకాలు లేవు…

యూనివర్శిటీలో చదవంటేనే వేరు.. అక్కడ ఏర్పడ్డ లక్ష్యాలు.. ప్రతి విద్యార్ధి కనే కలలు సాధించుకునే వరకు చివరికంటా పోరాడుతూనే ఉంటారు.. ఎందుకంటే అక్కడ బోధనలో నాణ్యత ఉంటుంది. విద్యార్థుల్లో సాధించాలనే కసి ఉంటుంది. ఎప్పటిప్పుడు ఆధునిక సౌకర్యాలతో కొత్తగా కొంగొత్తగా రూపుదిద్దుకునే యూనివర్శిటీలు తెలంగాణలో కళావిహీనంగా మారిపోతున్నాయి. వాటి అభివృద్దిని, నియామకాలను పట్టించుకునే వారే కరువయ్యారు. విద్యలో నాణ్యత కరువవుతున్నా, సదుపాయాల్లో సమస్యలెదురవుతున్నాయని విద్యార్థులు చెప్పి చెప్పి విసుగుచెందుతున్నారే కాని సమస్యలపై స్పందించే పాలకులు మాత్రం నోరే విప్పడం లేదు. అందరికి నాణ్యమైన విద్యను అందిస్తామని చెపుతున్నా ప్రభుత్వం యూనివర్శిటీలపై ఎందుకు చిన్నచూపు చూస్తుందో మాత్రం అర్థం కావడం లేదు. పెద్ద పెద్ద చదువులు చదివిన వారే ఉపాధికోసం ఉద్యమాలు చేస్తున్నారు. రాబోయే తరానికి ఉపాధి కల్పించడం మా వల్ల కాదనుకుంటున్నారో, ఏమో తెలియదు కాని తెలంగాణలో ఉన్న యూనివర్శిటీలన్నీ సమస్యలతో స్వాగతం పలుకుతున్నాయి. యూనివర్శిటీలలో పదిహేను సంవత్సరాల కింద జరిపిన నియామకాలే ఇప్పటికి కొనసాగుతున్నాయి. పదవి విరమణతో ఖాళీ అవుతున్న, ప్రమోషన్లతో వెళ్లిపోతున్న పోస్టులన్నీ ఇప్పటికీ అలాగే ఖాళీగా ఉంటున్నాయి కాని ఉన్నత చదువులు చదివి ఉపాధి కోసం ఎదురుచూస్తున్న యువతకు అవకాశం ఇద్దామనే ఆలోచన మన పాలకులకు రాకపోవడం ఆశ్చర్యంగానే ఉంది..

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌) :

చదువులు చట్టబండలవుతున్నాయి.. ఇష్టముంటే చదువు, కష్టముంటే మానెయ్యి అన్న రీతిలో తెలంగాణ యూనివర్శిటీలు వ్యవస్థ కొనసాగుతోంది. గొప్ప గొప్ప చదువు చదవాలని, నాణ్యమైన విద్యను అందుకోవాలని కోరుకునే ప్రతి యూనివర్శిటి ఆలోచనను, ఆశయాలను మధ్యలోనే తుంచివేస్తున్నారు. బంగారు తెలంగాణలో ఉన్నత చదువులు చదివిన నిరుద్యోగులు ఉపాధి లేక లక్షలాది మంది ఎదురుచూస్తున్నారు. మరోపక్క యూనివర్శిటీలకు వస్తున్న కొత్తతరానికి సరియైన సదుపాయాలు, వసతులు కల్పించక మధ్యలోనే తొక్కిపెడుతున్నారు. నైపుణ్యమైన విద్యకు, పరిశోధనలకు చిరునామాలుగా ఉన్న తెలంగాణ యూనివర్సిటీలు నిత్యం సమస్యల సుడిగుండంలో చిక్కుకున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని యూనివర్సిటీల్లో కనీస మౌలిక సదుపాయాలు లేక కునారిల్లిపోతున్నాయి. బోధనా సిబ్బంది కొరత, మౌలిక సౌకర్యాల లేమి యూనివర్సిటీలను ఇప్పుడు ప్రధానంగా వేధిస్తున్న సమస్య.. తెలంగాణ వర్సిటీలు భవిష్యత్తులో మరిన్ని ఇక్కట్లు ఎదుర్కొనే పరిస్థితి రాబోతోంది. తెలంగాణలో మొత్తం 16 యూనివర్సిటీలున్నాయి. అందులో 6 యూనివర్సిటీలు కన్వెన్షనల్‌ యూనివర్శిటీలు కాగా మిగతావి టెక్నికల్‌, ప్రొపెషనల్‌ వర్సిటీలు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని యూనివర్సిటీల్లో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులతో సతమతమవుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 2012 లో జరిగిన నియామకాలే చిట్టచివరివి. ఆ తరువాత ఇప్పటివరకు ఏ ఒక్క యూనివర్శిటీలోనూ ఉద్యోగ నియామకాలు జరగనే లేదు. బోధనా సిబ్బంది నియామకాలు లేకపోవడంతో విద్యా ప్రమాణాలు పూర్తిగా పడిపోతున్నాయి. కనీసం పరిశోధనలకు అవకాశమే లేకుండా పోయింది.

బోధన సిబ్బంది లేక ఉస్మానియాలో ఇబ్బందులు..

తెలంగాణలో ఉస్మానియా విశ్వవిద్యాలయం అత్యంత ప్రతిష్ఠాత్మకమైనదీ. వందేళ్లు పూర్తిచేసుకున్న ఉస్మానియా యూనివర్సిటీలోనే దాదాపు 75శాతం వరకు బోధన సిబ్బంది కొరతను ఎదుర్కొంటోంది. దీనికి పరిష్కారంగా కాంట్రాక్టు అధ్యాపకులతో వర్సిటీని నడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉస్మానియాలో మొత్తం 12వందల మంది ఫ్యాకల్టీ అవసరం ఉండగా కేవలం 2వందల లోపు మాత్రమే రెగ్యులర్‌ బోధన సిబ్బంది ఉన్నారు. దీంతో విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక హాస్టల్‌ వసతులు కూడా అంతంతే. నిజాం కాలంలో నిర్మించిన భవనాల్లోనే హాస్టళ్లు నిర్వహిస్తున్నారు. ఆ భవనాలన్నీ శిథిలావస్థకు చేరాయి. హాస్టల్‌ నిర్వహణను మెరుగుపరిచేందుకు ఇటీవల ఓ కమిటీని ఏర్పాటు చేసింది. మెస్‌ నిర్వహణను ఔట్‌ సోర్సింగ్‌ కు అప్పగించాలనే నిర్ణయానికి వచ్చింది. వందలాది మంది విద్యార్థినీ, విద్యార్థులు ఉంటే ఉస్మానియా యూనివర్శిటీ హస్టళ్లు సమస్యలకు నిలయాలుగా మారాయని విద్యార్థులు తరచుగా ఆందోళనలు చేస్తూనే ఉంటారు. అప్పటికప్పుడు అధికారులు సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చి మళ్లీ యధా రాజా, తథా ప్రజాగానే పరిపాలన సాగించడం ఇక్కడ ఆనవాయితీగా మారిపోయింది. రాష్ట్ర రాజధానిలో ఉన్న అత్యంత పురాతన యూనివర్శిటీ పరిస్థితే ఇలాగే ఉంటే జిల్లాలో నూతనంగా ఏర్పడిన యూనివర్శిటీల సమస్యలు చెప్పలేకుండా ఉన్నాయి. అక్కడ ఎవరికి చెప్పినా, విద్యార్థులు నెత్తి నోరు మొత్తుకున్నా అటు వైపు కనికరించే వారే లేకుండా పోయారు.

అన్ని యూనివర్శిటీలు అంతే సంగతులు…

వరంగల్‌లోని కాకతీయ యూనివర్శిటీ పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా లేదు. ఏళ్లుగా బోధనా సిబ్బంది నియామకం లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. మెస్‌ల నిర్వహణ ఇప్పటికే ఔట్‌ సోర్సింగ్‌కు ఇవ్వడంతో పాటు నిర్వహణ బాధ్యతలు కూడా ప్రైవేటీకరించారు. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక పి.హెచ్‌.డీ అడ్మిషన్లలో అవతవకలపై అనేక విమర్శలు వస్తున్నాయి. ప్రవేశపరీక్షలోనే లోపాలు బయటపడ్డాయని విద్యార్థులు విమర్శిస్తున్నారు. తెలంగాణ యూనివర్సిటీ, పాలమూరు, శాతవాహన, మహాత్మగాంధీ వర్సిటీలు కేవలం పేరుకు మాత్రమే యూనివర్సిటీలనే విమర్శలు ఆరంభం నుంచీ ఉన్నాయి. యూనివర్సిటీలు స్థాపించి ఏళ్లు గడుస్తున్నా మౌలిక సౌకర్యాలు లేకపోవడం, బోధన సిబ్బంది నియామకం లేకపోవడంతో అవి కేవలం పీజీ సెంటర్లుగా మాత్రమే మిగిలాయనే విమర్శలున్నాయి. కాంట్రాక్టు అధ్యాపకులతో నెట్టుకురావడంతో నాణ్యతా ప్రమాణాలు దెబ్బతింటాయంటున్నారు విద్యార్థులు. క్యాంపస్‌లు లేకుండా చిన్నపాటి సొంతభవనాల్లో యూనివర్సిటీలు ఏర్పాటు చేయడం కూడా విద్యార్థులకు రుచించడం లేదు. వీటితోపాటు సాంకేతిక, వఅత్తి విద్యను అందించే యూనివర్సిటీలు 10ఉన్నాయి. అందులో హైదరాబాద్‌లోని జే.ఎన్‌.టి.యూ, ఫైన్‌ ఆర్ట్స్‌ యూనివర్సిటీ, అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ, తెలుగు విశ్వవిద్యాలయం, వ్యవసాయ విశ్వవిద్యాలయం, ట్రిపుల్‌ ఐటి, కాళోజీ హెల్త్‌ యూనివర్సిటీ, వెటర్నరి, హార్టీ కల్చర్‌, నల్సర్‌ విశ్వవిద్యాలయాలున్నాయి. ఈ విశ్వవిద్యాలయాల్లో కూడా పలు రకాల సమస్యలతోనే సతమతమవుతున్నాయి. ప్రభుత్వం ఈ మధ్యే ప్రవేశపెట్టిన ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌లో సైతం యూనివర్సిటీలను పట్టించుకోలేదంటున్నారు విద్యార్థి సంఘాల నేతలు. విద్యారంగాన్ని బలోపేతం చేయాల్సిన ప్రభుత్వమే నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.. వీలైనంత త్వరలో బోధన సిబ్బంది నియామకంతో పాటు మౌలిక సౌకర్యాలను కల్పిస్తే విద్యార్థులకు మేలు జరిగే అవకాశం ఉంటుందంటున్న వాదనలు వినిపిస్తున్నాయి. కాని ప్రభుత్వం యూనివర్శిటీల అభివృద్దికి ఏలాంటి చర్యలు తీసుకోవడానికి ముందడుగు వేస్తుందో, లేదో చూడాల్సిందే…

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close