Featuredస్టేట్ న్యూస్

ఏకమవుతున్న విపక్షాలు

సెక్రటేరియేట్‌ కూల్చివేతపై రౌండ్‌ టేబుల్‌ సమావేశం

తెలంగాణ సచివాలయం తరలింపుపై ప్రతిపక్షాలు పోరాటం ఉద్ధృతం చేశాయి. హైదరాబాద్‌లో పార్క్‌హయత్‌ ¬టల్‌లో అఖిలపక్షం ఆధ్వర్యంలో నేతలు రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. సచివాలయం కూల్చివేత, కొత్తశాసన సభ నిర్మాణంపై చర్చించారు. తెలంగాణ రాష్ట్రానికి కొత్త అసెంబ్లీ, కొత్త సెక్రటేరియేట్‌ అవసరం లేదన్నారు టీపీసీసీ చీఫ్‌, నల్గొండ ఎంపీ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి. కొత్త అసెంబ్లీ, సెక్రటేరియేట్‌లు నిర్మించాలన్న అనే అంశంపై ప్రజాస్వామిక తెలంగాణ పేరుతో ఏర్పాటు చేసిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో ఆయన మాట్లాడుతూ… రాష్ట్ర అసెంబ్లీ భవనం చరిత్రాత్మకమైనదన్నారు. ఇప్పుడున్న అసెంబ్లీలో రెండు రాష్ట్రాల సభలు నడిచాయని గుర్తు చేశారు. ”గతంలో మెట్రో విషయంలో అసెంబ్లీని ముట్టుకోవద్దని కేసీఆర్‌ అన్నారు. కానీ, ప్రస్తుతం వాస్తు బాగోలేకపోవడం వల్లే కూల్చివేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పుడున్న అసెంబ్లీలో విశాలమైన గదులు, ప్రాంగణాలు ఉన్నాయి” అని ఉత్తమ్‌ అన్నారు. నూతన సచివాలయం, శాసనసభల నిర్మాణం రాష్ట్ర ప్రజలకు అవసరం లేదని స్పష్టం చేశారు.తాను అసెంబ్లీలో ఐదుసార్లు ఎమ్మెల్యేగా అడుగుపెట్టానని గుర్తుచేశారు. ఇప్పుడున్న సేక్రటేరియేట్‌, అసెంబ్లీ భవనాలు కొన్ని దశాబ్ధాల పాటు కొనసాగే సామర్ధ్యం ఉందని ఉత్తమ్‌ అభిప్రాయపడ్డారు. కేసీఆర్‌ ముఖ్యమంత్రి కాకముందు అసెంబ్లీ కోసం మెట్రోనే వ్యతిరేకించారని ఆయన గుర్తుచేశారు. వారసత్వ కట్టడాలను కాపాడుకోవాలని.. కొత్త సెక్రటేరియేట్‌, కొత్త అసెంబ్లీ భవన నిర్మాణాలను కాంగ్రెస్‌ వ్యతిరేకిస్తోందన్నారు. దీని వల్ల అమూల్యమైన ప్రజాధనం వృథా అవుతుందని ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిక్షాలు, ప్రజల అభిప్రాయం తీసుకోవాలని, ప్రజలతో కలిసి ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ఉత్తమ్‌ పిలుపునిచ్చారు. బీజేపీ నేత ఎమ్మెల్సీ రామచంద్రరావు మాట్లాడుతూ… సెక్రటేరియేట్‌ కూల్చివేత నిర్ణయాన్ని ప్రజలతో పాటు టీఆర్‌ఎస్‌ నేతలు సైతం ఖండించాలని తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీలోని పలు భవనాలను చూస్తే.. అక్కడ గొడ్లు కూడా ఉండవని అటువంటి భవనాలను కేసీఆర్‌ తిరిగి కట్టించాలని రామచంద్రరావు డిమాండ్‌ చేశారు. ఏదో ఆర్ధికపరమైన లబ్ధి ఉంది కాబట్టే కేసీఆర్‌ ఈ నిర్ణయం తీసుకున్నారని ఆయన ఆరోపించారు. టీడీపీ నేత రావుల చంద్రశేఖర్‌ రెడ్డి మాట్లాడుతూ… ఎర్రమంజిల్‌లో కొత్త అసెంబ్లీ ఎందుకు కట్టాలో కారణం ఎవరు చెప్పడం లేదని ఆయన ఎద్దేవా చేశారు. ప్రస్తుత అసెంబ్లీ భవనంలో అందరికీ సరిపోయేంత ఖాళీ ఉందన్నారు. ఉద్యమ ఆకాంక్షను, తెలంగాణ ప్రాధాన్యాలను కేసీఆర్‌ ఎప్పుడో పక్కనపెట్టారని రావుల మండిపడ్డారు. కల్వకుంట్ల కుటుంబం అధికారంలో ఉండాలంటే.. సెక్రటేరియేట్‌ కూల్చాలని ఎవరో చెప్పిన మాటలను కేసీఆర్‌ నమ్మడం విడ్డూరంగా ఉందన్నారు మాజీ ఎంపీ వివేక్‌. ఉమ్మడి రాష్ట్రంలో 294 మంది ఎమ్మెల్యేలకు, కౌన్సిల్‌కు పనికొచ్చిన అసెంబ్లీ భవనం.. ఇప్పుడు ఎందుకు పనికి రాకుండా పోయిందని ఆయన ప్రశ్నించారు. అనాలోచిత నిర్ణయాలతో కేసీఆర్‌.. మహ్మద్‌ బిన్‌ తుగ్లక్‌లా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు.

వ్యక్తిగత లాభం, విలాసవంతమైన జీవితం కోసం..మూఢనమ్మకాలతో ఉన్నవాటిని కూల్చి కొత్త భవనాలను కడుతున్నారని కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. అసెంబ్లీ, సచివాలయం 30 నుంచి 35 ఏళ్ల క్రితమే నిర్మించిన కట్టడాలేనని చెప్పారు. ఏం చేసినా చెల్లుతుందనే ధీమాతో ఈ ప్రభుత్వం వ్యవహరిస్తోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ విమర్శించారు. వాస్తు దోషం ఉంటే సరిదిద్దుకోవాలి కానీ..కట్టడాలను కూల్చుతారా అని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం తమ ఇష్టానుసారం చేస్తామంటే వదిలిపెట్టే ప్రసక్తేలేదని తెజస అధ్యక్షుడు కోదండరాం అన్నారు. ప్రజాభీష్టం ప్రకారం పాలన సాగించాలన్నారు. సీఎం కేసీఆర్‌కు భవనాలపై ఉన్న దృష్టి.. ప్రజల అవసరాలను తీర్చడంలో లేదని ఆయన ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్‌ తుగ్లక్‌లా వ్యవహరిస్తున్నారని మాజీ ఎంపీ వివేక్‌ విమర్శించారు. 

ఈ రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో నేతలు పలు తీర్మానాలు చేశారు.

  1. సెక్రటేరియేట్‌ భవనాలను, ఎర్రమంజిల్‌ భవనాలు కూల్చరాదు.
  2. సెక్రటేరియేట్‌, అసెంబ్లీలను ఇప్పుడున్న భవనాలలోనే కొనసాగించాలని, కూల్చివేతలు, కొత్త భవనాల నిర్మాణాలకు నిధులను దుర్వినియోగం చేయరాదని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.
  3. చారిత్రక వారసత్వ కట్టడాల విధ్వంపాన్ని అడ్డుకోవాలి. వందల ఏళ్ల చరిత్ర ఉన్న హైదరాబాద్‌ ఉనికిని కాపాడాలి.
  4. పై డిమాండ్ల సాధనకు గవర్నర్‌ ను కలిసి మెమోరాండం ఇవ్వాలని, జిల్లాల్లో ఆల్‌ పార్టీ రౌండ్‌ టేబుల్‌ సమావేశాలను జరపాలని సభ నిర్ణయించింది. అందుకు ప్రజాస్వామిక తెలంగాణ చొరవ తీసుకోవాలని సభ కోరుతున్నది. ప్రత్యక్ష కార్యాచరణకు వెనుకాడమని అఖిల పక్షం ప్రకటిస్తున్నది.
  5. అత్యున్నత న్యాయ స్థానం ఈ విషయంలో జోక్యం చేసుకోవాలి.
  6. కొత్త నిర్మాణాలు, భవనాల పేరుతో ప్రభుత్వం చేస్తున్న ఖర్చులపై శ్వేతపత్రం విడుదల చేయాలి. ప్రజలకు జవాబుదారీగా ఉండేలా ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలి.
Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close