నమ్మకంలేని …సర్వేలు

0

హాలో.. నేను ఫలానా డిపార్ట్‌మెంట్‌ నుంచి ఫోన్‌ చేస్తున్నాను. మొన్న జరిగిన ఎన్నికల్లో ఎవరికి ఓటేశారు.. ఎవరూ గెలుస్తారని అనుకుంటున్నారు.. మీరు ఖచ్చితంగా ఓటు ఆ పార్టీకే వేశారా అంటూ అభ్యర్థులను పోన్లతో మాట్లాడుతూ వివరాలు సేకరిస్తున్నారు… ఇదంతా చేస్తున్నదీ నిజంగా అధికారులు కాదు, కస్టమర్‌కేర్‌ వాళ్లు అంతకన్నా కాదు. ఎన్నికల్లో పోటీచేసి బరిలో నిలిచినా అభ్యర్థుల సన్నిహితులు.. గతంలో చేసిన పలు పార్టీల సర్వేలన్నీ తారుమారాయయ్యాయని పక్కా గెలుస్తారని చెప్పినా వారంతా ఓడిపోవడంతో ఇప్పుడు ఎవ్వరికి ఏ సర్వేపై నమ్మకం లేకుండా పోయింది.. అందుకే తన సన్నిహితులు, కుటుంబసభ్యులతో నేరుగా అభ్యర్థులే రంగంలోకి దిగారు. ఏ నాయకుడు ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేసాడో, దానికి సంబంధించిన వివరాలన్నీ తెచ్చుకొని గ్రామాల వారీగా ఫోన్‌ చేస్తూ ఆరాలు తీస్తున్నారు. మీకు నచ్చిన నాయకుడెవ్వరూ, ఏ పార్టీకి ఓటేశారు. ఎవరు గెలుస్తారనుకుంటున్నారు వంటి పలు ప్రశ్నలు సంధిస్తూ ఓటర్ల దగ్గరి నుంచి సమాచారాన్ని సేకరిస్తున్నారు.. ఒకటికి, రెండు సార్లు అన్నిరకాలుగా పర్సనల్‌ సర్వే చేపించినా కూడా ఇంకా గెలుస్తామా, లేదా అనే భయంతోనే సగం చచ్చిపోతున్నామంటున్నారు బరిలో ఉన్న అభ్యర్థులు…

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): నాయకులకు రోజురోజుకు ఫలితాల టెన్షన్‌ పెరిగిపోతూ ఉంది. ఎంతమంది ఎన్ని రకాలుగా సర్వేలు చేసి బహిర్గతపరిచినా బరిలో ఉన్న అభ్యర్థులకు మాత్రం నమ్మకం కుదరడం లేదు. గతంలో జరిగిన సర్వేల ఫలితాలు దాదాపుగా చాలా తారుమారుగానే మారిపోయాయి. ఎవరికి ఎవరూ ఓటేశారో తెలియకుండానే కొన్ని సర్వేలను బట్టి ఫలితాను రాకముందే మేము గెలుస్తామంటూ విజయ సంకేతాలు చూపించినా పార్టీలు, అభ్యర్థులు ఎవరూ ఊహించిన విధంగా బక్కాబోర్లాపడ్డారు. అందుకే ఎవరో చేసిన సర్వేలను ఇప్పుడున్న పార్టీలు, నాయకులు నమ్మడం లేదని తెలుస్తోంది. ఏ అభ్యర్థి ఏ నియోజకవర్గంలో పోటీ చేశారో దానికి సంబంధించిన వివరాలు గ్రామాల వారీగా తెప్పించుకుంటున్నారు. నేరుగా వెళ్లి సర్వే చేస్తే సమస్యలు ఏర్పడుతాయని ఫోన్‌ నెంబర్లు స్వీకరించి వాటితో కస్టమర్‌ సెంటర్‌ నుంచి చేసినట్టు కొందరు, ఏదో ప్రభుత్వ శాఖ నుంచి చేసినట్లు మరికొందరు ఓటర్ల నుంచి వివరాలు సేకరించే పనిలో పడ్డారు. మేము ఫలానా డిపార్ట్‌మెంట్‌ నుంచి ఫోన్‌ చేస్తున్నామని చెపుతూ మొత్తం వివరాలన్నీ తెలుసుకునే పనిలో బిజిబిజీగా మారిపోయారు. మీరు మొన్న జరిగిన ఎన్నికల్లో ఎవరికి ఓటు వేశారు, ఏ పార్టీ గెలుస్తుందని అనుకుంటున్నారు వంటి అనేక ఆంశాలపై ఓటర్ల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. అన్ని పార్టీలో ఇదే దారిన ఎంచుకుని ఓటర్ల నుంచి సమాచారాన్ని రాబట్టే పని అనడం కంటే ఓటర్లను తెగ విసిగిస్తున్నారని చెప్పవచ్చు. అంత పర్సనల్‌గా సర్వే చేపించినా కూడా నాయకులకు అనుమానాలు మాత్రం పోవడం లేదని తెలుస్తోంది. ఒక లోక్‌సభ నియోజకవర్గం నుంచి పదిమంది బరిలో ఉంటే అందులో దాదాపుగా ఐదారుగురు వారి సొంత సర్వేపైననే ఆధారపడి ఆశలు పెంచుకుంటున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలోని సికింద్రాబాద్‌, మల్కాజ్‌గిరి లోక్‌సభ స్థానం నుంచి హేమాహేమీలు బరిలో దిగారు. ప్రచారంలో ఎవరి అంచనాలకు అందకుండా ప్రతి ఒక్కరూ ప్రజల్లోకి దూసుకుపోయారు. సికింద్రాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి బిజెపి నుంచి కిషన్‌రెడ్డి, టిఆర్‌ఎస్‌ నుంచి తలసాని శ్రీనివాస్‌ యాదర్‌ కుమారుడు కిరణ్‌యాదవ్‌, కాంగ్రెస్‌ నుంచి అంజనీకుమార్‌ యాదవ్‌ ముగ్గురు హేమాహేమీలు మంచి పట్టున్న నాయకులే. వీరందరికి నియోజకవర్గంపై మంచి పట్టుంది. అందరికి గెలుపైననే ఆశలున్నాయి. ఐనా గెలుస్తామా, లేదా అనే టెన్షన్‌ తట్టుకోలేక నగరంలోని చాలా ప్రాంతాలో పర్సనల్‌గా పోన్లతో సర్వేలు చేపించుకుంటున్నారు. మల్కాజ్‌గిరి స్థానం నుంచి కూడా కాంగ్రెస్‌, టిఆర్‌ఎస్‌, బిజెపి అభ్యర్థులు బలంగా ఉన్నా ఎవరికి తోచిన విధంగా వారు, వారు అనుచరులతో ఓటరు మనసులో ఉన్నా ఆలోచనను తెలుసుకునే పనిలో బిజీగా మారిపోయారు. గతంలో ఎన్నడూ లేని రీతిలో ఈ సారి తెలుగు వాళ్లకు పోలింగ్‌కు, ఫలితాలకు మధ్య చాలా గ్యాప్‌ వచ్చింది. ఇది వరకూ కూడా ఎన్నికల ప్రక్రియ ఇలా నెలల పాటే సాగేది. కాని అప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్‌ ఆఖరి దశల్లో జరిగేది. దీంతో పోలింగ్‌కు ఫలితాలకు మధ్యన పెద్ద సమయం ఉండేది కాదు. అతి తక్కువ సమయంలోనే ఫలితాలు వచ్చేసేవి. ఐతే ఈ సారి మాత్రం ఏకంగా నెలన్నర గ్యాప్‌ రావడంతో ఎవరికి ఏం చేయాలో తోచడం లేదు. ఇప్పటికి పదిరోజులే గడిచిపోయాయి. ఇంకా నెలకు పైగా ఫలితాల కోసం వేచి చూడాల్సిన సమయం ఉంది. రాజకీయాల మీద ఆసక్తి ఉన్నవారే ఈ విషయాల విషయంలో తెగ టెన్షన్‌ పడుతున్నారు. ఎవరు గెలుస్తారనే విషయాలపై ఎవరికి తోచిన విధంగా వారే సమాచారం సేకరిస్తున్నారు. ఇక ఎన్నికల్లో పోటీ చేసిన వారి పరిస్థితి మాత్రం ఏమిటో చెప్పనక్కర్లేకుండా ఉంది. అత్యంత భారీగా డబ్బులు ఖర్చుపెట్టి గెలుస్తామనే నమ్మకంతో ఈ ఎన్నికల బరిలోకి దిగినవారు చాలామంది ఉన్నారు. వారికి ఇప్పుడు నిద్ర కూడా పట్టడం లేదని తెలుస్తోంది. ఎన్నికల్లో గెలవకుంటే డబ్బుతో పాటు పరువు కూడా పోతుందని టెన్షన్‌ పడుతున్నట్లు తెలుస్తోంది.

ఫోన్‌ సర్వేలో అన్ని పార్టీలు బిజీబిజీ… తెలంగాణ, ఆంధ్రాలో ఇప్పుడు సర్వేలతోనే నాయకులంతా బిజీబిజీగా మారిపోయారు. ఎవరికి వారే రంగంలోకి దిగి ఎక్కడ ఎంత మెజారిటీ వస్తుందీ. ఎక్కడెంత నష్టం జరుగుతుందీ. నష్టం జరగడానికి గల కారణాలు కూడా ఇప్పుడే తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. గ్రామాలు, మండలాల వారీగా బేరీజు వేసుకొని అంతా అనుకున్నాక ప్రకారం సమాచారం వస్తే కొంచెం ధైర్యంగా ఉంటున్నారని, తేడా కనిపిస్తే మాత్రం టెన్షన్‌ పడుతున్నట్లు సన్నిహితులు చెపుతున్నారు. పోస్ట్‌పోల్‌ సర్వేలుగా వారు పరిస్థితి ఏమిటో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టుగా సమాచారం. ఐతే ఏలాగూ పోలింగ్‌ ముగిసింది. ఇలాంటి తరుణంలో ప్రజలు కూడా స్పందించకపోవచ్చు. ఎవరికి ఓటేశారని ప్రజలను అడిగితే, వారు ఏ సమాధానం ఇవ్వరు ఎందుకంటే పోలింగ్‌ అయిపోయింది. ఎవరు గెలుస్తారో, ఇంకా తెలీదు. ఇలాంటి తరుణంలో తాము ఎవరికి ఓటేసిందీ అవతల వాళ్లకు తెలిసిపోతే అంతే సంగతులు అనే భయం జనాలకు సహజంగానే ఉంటుంది. అందుకు నాయకులు పోన్‌ మార్గాన్ని ఎంచుకున్నారని పోన్ల ద్వారా సమాచారాన్ని సేకరించే ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తోంది. ఎవరికి ఓటేశారో చెప్పాలంటూ ఒకటి, రెండు, మూడు నొక్కమని చెపుతున్నారని సమాచారం. మరికొన్ని నియోజకవర్గాల్లో నేరుగా మాట్లాడుతూ వివరాలు సేకరిస్తున్నారు. జిల్లాల స్థాయిలో నేతలు ఇలాంటి సర్వేలు చేయించుకుంటున్న దాఖాలాలు కనిపిస్తున్నాయి. తెలంగాణ కంటే ఆంధ్రాలో మాత్రం తెలుగుదేశం పార్టీతో పాటు వైకాపా, జనసేన పార్టీ కూడా క్షేత్రస్థాయిలో ఈ సర్వేలను చేయించుకోవడంలో బిజిబిజీగా మారిపోయారని తెలుస్తోంది. వీరు చేయించుకునే సర్వేలు కూడా చివరకు నిజమవుతాయో లేదా అభ్యర్థుల కొంపముంచుతాయో తెలియడం లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here