అనధికార.. భారతరత్నాలు

  0

  అనంచిన్ని వెంకటేశ్వరరావు

  ఆదాబ్‌ హైదరాబాద్‌

  వీరు కోటీశ్వరులు కాదు. రాజకీయ ప్రముఖులు కాదు. సెలబ్రిటీలు కాదు. గన్ను పట్టిన విప్లవ కారులు కాదు. భారీ కుటుంబ నేపథ్యం కలిగిన ఉద్దండులూ కాదు. సామాన్యులలో ఉంటే అసమాన్యులు. కేవలం మానవత్వం ఉన్న మహ నీయ మహారాజులు. మనుషుల్లో మనవీయకో ణం ఉన్న మహాత్ములు. వీరు చేస్తున్న యజ్ఞం ఒక్క జిల్లాకి, రాష్ట్రానికి, దేశానికే కాదు యావత్తు ప్రపంచానికి ఆదర్శం. అనుసరణీయం.

  దోర్నాల జయ ప్రకాష్‌ భారత్‌:

  ఇతను ఒక కామన్‌ మాన్‌. దేశా ప్రజలకు ఏదో ఒకటి చేయాలని, తనదైన పంతంతో సేవ చేయాలని ఏకంగా ‘కామన్‌ మెన్‌ ఫోరం’ స్థాపించాడు. ఆర్థిక స్వాతంత్య్ర సమరయోదుడు దేశ సంపద ఫలాలను ప్రతి ఒక్కరికి చెందాలని ‘ఆర్థిక స్వాతంత్య్ర ఉద్యమం’ కొనసాగిస్తున్నారు. ఒంటిచెత్తో సముద్రాన్ని ఈదటం మొదలెట్టాడు. దేశం విూదపడి దోచుకుంటున్న దొంగల బతుకులను వెంటాడి.. వేటాడి ఆధారాలతో బయటపెడుతున్నారు. హైదరాబాదులో పదుల సంఖ్యలో ఉన్న టాయిలెట్లను వందల సంఖ్యకు పెంచెలా ప్రభుత్వంపై వత్తిడి తెచ్చారు. పెట్రోల్‌ బంకులలో నిర్మించిన టాయిలెట్స్‌ ఈయన చలువే. గల్లీ నుంచి ఢీల్లీ దాకా ఏక బిగువున ఉవ్వెత్తున ఉద్యమం చేసి.. పట్టబట్టి ఈ కార్యక్రమ విజయం సాధించారు. దేశ రాజకీయ విషయాలపై మంచి పట్టున్న యువకుడు.

  అన్నం ఫౌండేషన్‌:

  ఖమ్మంజిల్లాలో ఆయన సుపరిచితులు. మానసిక వైకల్యం కలిగిన వారికి బంధువు.అనాథ శవాలకు ఆత్మీయుడు. అంత్యక్రియలకు నోచుకోని శవాలకు, అయిన వారు సైతం తాకడానికి తటపటాయించే సమయంలో ఓ థదేవుడిలా వచ్చి అన్ని కార్యక్రమాలు అయ్యేటంత వరకు ఉండే మహా మనీషి ఆయనే అన్నం శ్రీనివాస్‌. అన్న ఫౌండేషన్‌ పేరుతో సేవా కార్యక్రమాలు అందిస్తున్నారు.

  ‘స్కై’ సంజీవరావు:

  అందరూ ఆకాశం హద్దుగా చెలరేగిపోతారని చెపుతారు కదా. ఈయన కూడా అంతే.. కానీ చిన్న తేడా… అదీ ఆయన రాజధాని నగరంలో స్థాపించిన ‘స్కై ఫౌండేషన్‌’ ద్వారా మాత్రమే అభాగ్యులకు సేవలు చేయడానికి చెలరేగిపోతారు. రోడ్ల పక్కన ఉన్న అనాధలకు, మతి స్థిమితం లేని వాళ్ళకి, ఆకలితో అలమటిస్తున్న దిక్కు మొక్కు లేని అభాగ్యులకు, నిరుపేదలకు ‘స్కై ఫౌండేషన్‌’ ఆధ్వర్యంలో అన్నదాన ఉద్యమం చేపడతారు. ప్రతినెలా రెండు, నాలుగు ఆదివారాలలో క్రమం తప్పకుండా ఈ అన్నదాన కార్యక్రమాన్ని చేస్తారు. ఇలా ఇప్పటిదాకా సుమారు 150 వరకు కార్యక్రమాలు చేశారు. మూడు, ఐదవ ఆదివారాలలో పాత బట్టలు సేకరించి, బట్టలు లేని వాళ్ళని వెతికి వాళ్లకి అవి పంచుతారు. ప్రతినెలా ఒకరోజు ఎదో ఒక్క జిల్లాలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలకు మెడికల్‌ కిట్స్‌ పంపిణి చేస్తారు.

  ఆత్మ బంధువు ‘సాహిత్య ప్రకాశ్‌’:

  ఆయన కవి, రచయిత, కళాకారుడు, వ్యాఖ్యాతగా ఉన్నా.. ‘మానవ సంబంధాల వారధి’ అంటే సరిగ్గా సరిపోతుంది. సాహిత్య ప్రకాశ్‌ అనే కొత్తకోట లక్ష్మణ దాసు గారి గురుప్రకాశ్‌ స్వస్థలం కర్నూల్‌ జిల్లా డోన్‌ తాలూకా కొత్తకోట.

  ఆయన సతీమణి సాహిత్య పేరు తన పేరుతో కలుపుకున్నట్లే ఈయన ఎవరిని పలకరించినా.. అక్కా… బావ అంటూ వేలాదిమందికి సామాజిక మాధ్యమాలలో రోజూ పలకరింపులు. ఎంతో ఉన్నతమైన మనస్తత్వం, ఓర్పు ఉంటే కానీ ఇది సాధ్యపడదు. మానవ సంబంధాలు ఆర్ధిక సంబంధాలైన నేటి కాలంలో.. అసూయ, ద్వేషాలతో రగిలే వారికి ఈ సాహిత్య ప్రకాశ్‌ ఓ ‘డైనమైట్‌ యాంటీబాటిక్‌ మెడిసిన్‌’ లాంటి వారు. ఇలాంటి వ్యక్తులు సమాజంలో చాలా అరుదు.

  మల్లాది పవన్‌:

  వరంగల్‌ కు చెందిన పవన్‌ దేశ ఆర్ధిక విషయాలపై మంచి అవగాహన ఉన్న యువకుడు. పార్టీల మ్యానిఫెస్టో ఎలా ఉండాలి. ఎలా ఉంటే బాగుంటుంది. దేశంలో రైతుకు, మహిళలకు ఎలాంటి సంక్షేమ పథకాలు ఏర్పాటు చేస్తే బాగుంటుందనే విషయాలపై మంచి పట్టున్న వ్యక్తి. రాష్ట్ర ఆర్థిక విషయాలపై లోతైన అధ్యాయం జరిపి, విశ్లేషించి సరళీకృతంగా ప్రజలకు అందిస్తున్న యువకుడు. మంచి భవిష్యత్తు ఉన్న యువ నాయకుడు. ప్రస్తుత తరుణంలో దేశ ఆర్థిక వ్యవస్థకు ఇలాంటి యువత అవసరం.

  ముగింపు:

  వీరు ఎవరూ ఇంత వరకు ఆధికారిక అవార్డుల కోసం ఆ,యా కార్యక్రమాలు చేయడం లేదు. వారు అవి ఆశించి చేయడం లేదు. కానీ భరతమాత గర్వించదగ్గ ముద్దుబిడ్డలు వీరు. అందుకే ‘ఆదాబ్‌ హైదరాబాద్‌’ వీరిని అనధికారిక.. ‘భారతరత్నా’లు వీరికి గుర్తింపు ఇస్తూ… మేరా భారత్‌ మహాన్‌. జైహింద్‌.

  (70 ఏళ్ళ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ కథనం డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ కు అంకితం)

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here