ఇద్దరు సిఎంలు అవకాశవాదులే

0
  • కేసీఆర్‌ గోడవిూద పిల్లి
  • కేసీఆర్‌, బాబులపై మండిపడ్డ దత్తాత్రేయ

తెలుగు రాష్ట్రాల సీఎంలపై బీజేపీ నేత దత్తాత్రేయ సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ గోడ విూద పిల్లి లాంటోడు.. చంద్రబాబు పచ్చి అవకాశవాదని బీజేపీ ఎంపీ బండారు దత్తాత్రేయ ఎద్దేవా చేశారు. గురువారం ఢిల్లీలో దత్తాత్రేయ విలేకరులతో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం తాగునీటి ప్రాజెక్టుల విషయంలో వాగ్దానాలకే పరిమితం అయిందని విమర్శించారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో కేసీఆర్‌ సర్కార్‌, సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని దుయ్యబట్టారు. రైతులకు సాగు నీరు అందడం లేదు.. కాంట్రాక్టర్లకు లబ్ది చేకూర్చేందుకే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు వ్యయాన్ని 39 వేల కోట్ల నుంచి రూ.52 వేల కోట్లకు పెంచారని ఆరోపించారు. అలాగే ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టును కాళేశ్వరం ప్రాజెక్టుగా పేరు మార్చి ప్రాజెక్టు వ్యయాన్ని రూ.80 వేల కోట్లకి పెంచి, దాదాపు రూ.40 వేల కోట్లు ఖర్చు చేసినా ఒక్క ఎకరానికి కూడా నీరు ఇవ్వలేదని చెప్పారు. ప్రజాధనం దుర్వినియోగం అవుతోందని, రాష్ట్రంలో అవినీతి బాగా పెరిగిపోయిందని వ్యాక్యానించారు. ఇంటర్‌విూడియట్‌ బోర్డు అలసత్వం కారణంగా 23 మంది విద్యార్థులు బలయ్యారని ఆరోపించారు. ముగ్గురు సభ్యుల కమిటీ రిపోర్టు ఇచ్చినా కూడా గ్లోబరినా సంస్థపై ఎందుకు చర్యలు తీసుకోలేదని సూటిగా ప్రశ్నించారు. ఇంటర్‌బోర్డు అవకతవకలపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని బీజేపీ డిమాండ్‌ చేస్తోందన్నారు. మోదీ సర్కార్‌ తిరిగి అధికారం చేజిక్కించుకోవడం ఖాయమన్నారు. ఫెడరల్‌, మహా కూటములు మా దరిదాపుల్లో కూడా లేవు.. లోక్‌సభ ఎన్నికల్లో ఆరు స్థానాల్లో బీజేపీ, టీఆర్‌ఎస్‌కు గట్టిపోటీనిచ్చిందని వెల్లడించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here