‘చేయి’ విరిచిన టీఆర్ ఎస్

0

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): తెలంగాణలో ఎమ్మెల్యే కోటాలోని ఎమ్మెల్సీ ఎన్నికలకు ఒక్క రోజు ముందు కాంగ్రెస్‌ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. సోమవారం కాంగ్రెస్‌ పార్టీ నేతలు భేటీ అయ్యారు. వీరు ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నారు. ఐదు ఎమ్మెల్సీలు ఖాళీ అవుతున్నాయి. వీటికి ఎన్నికలు జరుగుతున్నాయి. టీఆర్‌ఎస్‌, మజ్లిస్‌ పార్టీ నుంచి ఐదుగురు, కాంగ్రెస్‌ పార్టీ నుంచి గూడూరు నారాయణ రెడ్డి ఒకరు పోటీలో నిలిచారు. మంగళవారం నాడు ఎమ్మెల్యే కోటాలో జరగాల్సిన ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి. ఎన్నికలకు ఒక్కరోజు ముందు కాంగ్రెస్‌ బహిష్కరించాలని నిర్ణయం తీసుకుంది. బహిష్కరిస్తూ కీలక నిర్ణయం ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవాలంటే ఒక్కొక్కరికి 21 మంది ఎమ్మెల్యేలు మొదటి ప్రాధాన్యతగా ఓటు వేయాల్సి ఉంటుంది. ఐదు ఖాళీల కోసం ఆరుగురు పోటీలో నిలిచారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన లెక్కల ప్రకారం చూస్తే కాంగ్రెస్‌ పార్టీ కచ్చితంగా ఓ సీటును గెలుచుకోవాలి. కానీ ఇటీవల జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికలను బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది.

నలుగురు ఎమ్మెల్యేలు తెరాసవైపు

గత అసెంబ్లీ ఎన్నికల్లో 19 మంది కాంగ్రెస్‌ నుంచి, ఇద్దరు టీడీపీ నుంచి గెలిచారు. తెరాస 88 సీట్లలో గెలవగా, ఇద్దరు స్వతంత్రులు ఆ పార్టీలో చేరారు. దీంతో ఆ పార్టీ బలం 90కి చేరింది. అయితే, ఇటీవల పలువురు నేతలు వరుసగా తెరాస తీర్థం పుచ్చుకుంటున్నారు. ఒక టీడీపీ ఎమ్మెల్యే (సండ్ర వెంకట వీరయ్య), నలుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు తెరాసలో చేరుతున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్‌ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు, రేగా కాంతారావు, చిరుమర్తి లింగయ్య, హరిప్రియా నాయక్‌లు కాంగ్రెస్‌లోకి వచ్చారు… వస్తున్నారు. దీంతో కాంగ్రెస్‌ బలం 19 నుంచి 15కు చేరింది. సబితా ఇంద్రా రెడ్డి వంటి వారు కూడా తెరాస వైపు చూస్తున్నారు. ఇక టీడీపీ నుంచి గెలిచిన ఇద్దరిలో ఒకరు తెరాసలో చేరగా, మరొకరు కాంగ్రెస్‌ అభ్యర్థికి ఓటు వేస్తారా అనేది అనుమానమే. ఇలా పార్టీకి చెందిన నలుగురితో పాటు మరికొందరు హ్యాండ్‌ ఇచ్చేందుకు సిద్ధమవడంతో కాంగ్రెస్‌ ఈ నిర్ణయం తీసుకుంది.

17 సీట్లలో పాగా వేద్దాం ..

తెలంగాణ భవన్‌ లో సోమవారం జరిగిన అవగాహన సదస్సులో ఎమ్మెల్యేలతో సీఎం కేసీఆర్‌ మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకోవడంపై ఎమ్మెల్యేలకు మాక్‌ పోలింగ్‌ కార్యక్రమాన్ని చేపట్టారు. మంగళవారం ఉదయం 8:30 గంటల కల్లా ఎమ్మెల్యేలు తెలంగాణ భవన్‌ కు చేరుకోవాలి సీఎం తెలిపారు. రేపు మరోసారి మాక్‌ పోలింగ్‌ను నిర్వహించనున్నారు. అనంతరం తెలంగాణ భవన్‌ నుంచి ప్రత్యేక బస్సులో అసెంబ్లీకి ఎమ్మెల్యేలు వెళ్లనున్నారు. ఎంఐఎంతో కలిపి 17 ఎంపీ స్థానాలు గెలవాల్సిందేనని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. మరో రెండు రోజుల్లో ఎంపీ అభ్యర్థులను ప్రకటిస్తాం. ఎంపీలను గెలిపించే బాధ్యత ఎమ్మెల్యేలదేనని సీఎం స్పష్టం చేశారు. మాక్‌ పోలింగ్‌ అనంతరం తెలంగాణ భవన్‌ గేట్‌ వద్ద జరుగుతున్న నిర్మాణ పనులను కేసీఆర్‌ పరిశీలించారు. ఈ నెల 17న కరీంనగర్‌లో కేసీఆర్‌ ఎన్నికల ప్రచార సభ జరగనుంది. 19న నిజామాబాద్‌లో కేసీఆర్‌ బహిరంగ సభ ఉంటుంది. ఈ సభను సుమారు 2 లక్షల మందితో ఏర్పాటు చేశారు. మరో నెలరోజుల్లో లోక్‌ సభ ఎన్నికలు ఉన్నాయని, పార్టీ ప్రతినిధులను గెలిపించాల్సిన బాధ్యత మీపై ఉన్నదని ఈ సందర్భంగా చెప్పారు. రాష్ట్రంలో 16 ఎంపీ టీఆర్‌ఎస్‌, 1 ఎంఐఎం సాధిస్తే .. కేంద్రంలో కీ రోల్‌ పోషించొచ్చని తెలిపారు. నిధులు, ప్రాజెక్టులకు జాతీయహోదా తదితర ఇబ్బందులు ఉండవన్నారు. ఇందుకోసం ఎమ్మెల్యేలంతా అభిప్రాయ బేధాలు వీడి, పార్టీ అభ్యర్థి గెలుపుకోసం కష్టపడి పనిచేయాలని సూచించారు కేసీఆర్‌.

కాంగ్రెస్‌ లేని మండలి కేసీఆర్‌ టార్గెట్‌

అసెంబ్లీలో కాంగ్రెస్‌ పార్టీ ప్రాతినిథ్యం లేకుండా కేసీఆర్‌ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఎమ్మెల్యేలను ఆకర్షిస్తున్నారు. ఇక మండలిలోను ఆ పార్టీకి ఏ ప్రాతనిథ్యం ఉండవద్దని భావిస్తున్నారు. గతంలో కాంగ్రెస్‌ ఎమ్మెల్సీలు మూకుమ్మడిగా తెరాసలో చేరారు. ఆ తర్వాత పొంగులేటి సుధాకర్‌ రెడ్డి, షబ్బీర్‌ అలీలు మాత్రమే మిగిలారు. వారిద్దరి పదవీకాలం ముగిసింది. అందుకే ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పుడు తమ బలంతో ఒక్క సీటు అయినా గెలుచుకుందామనుకుంటే, తెరాస ఆపరేషన్‌ ఆకర్ష్‌ ద్వారా దెబ్బకొట్టింది.

రేపు మరోసారి ఎమ్మెల్యేలకు మాక్‌ పోలింగ్‌

ప్రగతిభవన్‌ నుంచి అసెంబ్లీకి బస్సుల్లో ఎమ్మెల్యేలు

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో గులాబీ గుబాళింపు ఖాయమవుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికకు నామినేషన్‌ వేసిన కాంగ్రెస్‌ .. బరిలో ఉండమని స్పష్టంచేయడంతో 5 ఐదుస్థానాల్లో టీఆర్‌ఎస్‌, ఎంఐఎం విజయం నల్లేరుమీద నడకే అవనుంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలు ఎలాంటి తప్పు చేయొద్దని సోమవారం తెలంగాణ భవన్‌ లో నిపుణులతో అవగాహన సదస్సు నిర్వహించారు. ఆ తర్వాత మాక్‌ పోలింగ్‌ చేపట్టారు. సీఎం కేసీఆర్‌ ఎమ్మెల్యేలంతా ఓటు వేశారు. కాసేపటి క్రితమే తెలంగాణ భవన్‌ లో ఎమ్మెల్యేల మాక్‌ పోలింగ్‌ ప్రక్రియ ముగిసింది. మాక్‌ పోలింగ్‌ లో తడబాడుతారని, అలాగే కచ్చితంగా ఓటువేయాలనే ఉద్దేశంతో రేపు మరోసారి మాక్‌ పోలింగ్‌ నిర్వహించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. ఉదయం 8.30 గంటలకు కల్లా ప్రగతిభవన్‌ చేరుకోవాలని ఎమ్మెల్యేలకు సీఎం స్పష్టంచేశారు. అక్కడ మరోసారి మాక్‌ పోలింగ్‌ నిర్వహిస్తారు. తర్వాత అక్కడినుంచి బస్సుల్లో నేరుగా అసెంబ్లీ తీసుకెళతారు. అక్కడ ఓటు హక్కు వినియోగించుకుంటారని టీఆర్‌ఎస్‌ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

కేసీఆర్‌ వికార చర్యలు: ఉత్తం

టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి మాట్లాడుతూ.. తమకు ఉన్న బలం ప్రకారం తాము ఓ సీటును గెలుచుకోవాలని, కానీ తెలంగాణ ప్రజలు సిగ్గుపడేలా కేసీఆర్‌ వికత, వికార చర్యలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. టీడీపీ, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టారన్నారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం దారుణం అన్నారు. ప్రజాస్వామ్య ఉనికికి ప్రమాదం తెచ్చేలా కేసీఆర్‌ తీరు ఉందన్నారు. పార్టీ ఫిరాయింపులపై దేశవ్యాప్తంగా చర్చ జరగాలన్నారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ఈ నెల 12వ తేదీన జరగనున్నాయి. తెలంగాణలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అయితే టీఆర్‌ఎస్‌ నాలుగు, ఎంఐఎం ఒక్క స్థానంలో పోటీ చేస్తున్నాయి. ఎంఐఎం తమ పార్టీకి మిత్రపక్షంగా ఉన్నందున ఆ పార్టీకి టీఆర్‌ఎస్‌ మద్దతును ప్రకటించింది. అయితే తమకు బలం ఉందని కాంగ్రెస్‌ పార్టీ కూడ గూడురు నారాయణరెడ్డిని బరిలోకి దింపింది. గత ఏడాది డిసెంబర్‌ మాసంలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ, టీడీపీ, సీపీఐ, తెలంగాణ జనసమితి కలిసి పోటీ చేశాయి. కాంగ్రెస్‌ పార్టీకి 19 , టీడీపీకి రెండు అసెంబ్లీ సీట్లు దక్కాయి. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ఆ పార్టీకి హ్యాండిచ్చారు.ఆత్రం సక్కు, రేగా కాంతారావు,చిరుమర్తి లింగయ్య, హరిప్రియానాయక్‌లు టీఆర్‌ఎస్‌లో చేరుతామని ప్రకటించారు. టీడీపీకి చెందిన సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కూడ టీఆర్‌ఎస్‌లో చేరుతామని స్పష్టం చేశారు. దీంతో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి గెలుపుకు అవసరమైన ఓట్లు లేకుండాపోయాయి. దరిమిలా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరించాలని కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయం తీసుకొంది. ఈ విషయాన్ని తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి సోమవారం నాడు ప్రకటించారు.పార్టీ ఫిరాయింపులను కేసీఆర్‌ ప్రోత్సహిస్తున్నారని ఆయన ఆరోపించారు. తెరాస వ్యవహారశైలిపై అన్ని పార్టీలకు లేఖ రాస్తామని మల్లు భట్టి విక్రమార్క అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here