రెండు అగ్ర రాజ్యాల వాణిజ్య పోరు..

0

పారిస్‌: అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ప్రమాదంలో పడేస్తున్నదని అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్‌) చీఫ్‌ క్రిస్టిన్‌ లగార్డే ఆందోళన వ్యక్తం చేశారు. రెండు అగ్ర రాజ్యాల వాణిజ్య పోరు.. ప్రపంచ దేశాల వ్యాపార, ఆర్థిక ప్రయోజనాలను దెబ్బ తీస్తున్నదని, అమెరికా-చైనా మధ్య ఉద్రిక్తతలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ముమ్మాటికి ముప్పే అని లగార్డే స్పష్టం చేశారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఆ ఇరు దేశాలు (అమెరికా, చైనా) నడుమ చోటు చేసుకుంటున్న పుకార్లు, ట్వీట్లనుబట్టి చూస్తే వాణిజ్య విభేదాలు పరిష్కారమవుతాయన్న నమ్మకం కనిపించడం లేదని వ్యాఖ్యానించారు. అమెరికాలోకి దిగుమతి అవుతున్న చైనా ఉత్పత్తుల్లో 200 బిలియన్‌ డాలర్ల విలువైన వాటిపై ఇప్పటికే 10 శాతం సుంకం విధిస్తున్నామని, శుక్రవారం నుంచి దీన్ని 25 శాతానికి పెంచుతామని ట్విట్టర్‌లో అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వ్యాఖ్యానించారు. అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం.. ప్రపంచ వ ద్ధిరేటును కబళిస్తున్నదని ఫ్రాన్స్‌ ఆర్థిక శాఖ మంత్రి బ్రూనో లీ మైర్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ రెండు అగ్ర దేశాల మధ్య ఉద్రిక్తకర వాతావరణం ప్రభావం.. సహజంగానే అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థపై పడుతుందన్నారు. ఇరు దేశాల నడుమ నడుస్తున్న సంప్రదింపులను చాలా నిశితంగా గమనిస్తున్నామని బ్రూనో లీ మైర్‌ తెలిపారు. ఆయా దేశాల ప్రయోజనాలను తామూ గౌరవిస్తాం. అయితే ఈ విభేదాలు ప్రపంచ వ ద్ధిరేటును బలి తీసుకుంటున్నాయని అన్నారు. సుంకాల పెంపు ఏ రకంగానూ మంచిది కాదని, దానివల్ల అనర్థాలేనని హితవు పలికారు. అమెరికా-చైనా సుంకాల పోరు.. ఆ దేశాల ఆర్థిక వ్యవస్థల్నేగాక యూరోజోన్‌, యూరప్‌, ఆసియా దేశాల జీడీపీని దెబ్బ తీస్తుందని చెప్పారు. తమ ఉత్పత్తులపై దిగుమతి సుంకాలను పెంచనున్నట్లు ట్రంప్‌ హెచ్చరికలు చేసిన నేపథ్యంలో అమెరికాకు రాయబారిని పంపాలని నిర్ణయించింది. మంగళవారం దీన్ని చైనా ధ్రువీకరించింది. అత్యున్నత వాణిజ్య రాయబారి లీ హీ.. అమెరికాకు సంప్రదింపుల నిమిత్తం వెళ్తున్నారు. ఈ వారం అక్కడి ప్రభుత్వ వర్గాలతో చర్చలు జరుపుతారని సుంకాల పెంపుపై మాట్లాడుతారని ఓ ప్రకటనలో చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. గురు, శుక్రవారాల్లో 11వ దఫా ఉన్నతస్థాయి సంప్రదింపులు జరుగుతాయని పేర్కొన్నది. నిజానికి బుధవారమే ఈ సంప్రదింపుల ప్రక్రియ మొదలు కావాల్సి ఉన్నా వాషింగ్టన్‌కు లీ వెళ్తారా? లేదా? అన్న దైలమాలో ఒకరోజు ఆలస్యమైంది. కాగా, చైనా గతంలో ఇచ్చిన హామీలను విస్మరించడం వల్లే ట్రంప్‌ తాజా నిర్ణయానికి వచ్చారని అమెరికా వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఇరు దేశాలు 360 బిలియన్‌ డాలర్ల విలువైన వస్తు ఉత్పత్తులపై సుంకాలను వేసుకుంటున్నాయి. చైనాతో అమెరికా వాణిజ్య లోటు ప్రమాదకర స్థాయిలో ఉందంటున్న ట్రంప్‌.. ప్రతీకార సుంకాలకు తెరతీసిన సంగతి విదితమే. చైనాతోపాటు, పలు దేశాల నుంచి అమెరికాకు వచ్చే వివిధ రకాల ఉత్పత్తులపై పన్నులను ట్రంప్‌ సర్కారు విధిస్తున్నది. అధికంగా వస్తున్న చైనా ఉత్పత్తులపై ఈ తీవ్రత ఎక్కువగా ఉంటున్నది. ఇది ఇరు దేశాల మధ్య పరస్పర సుంకాలకు దారితీసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here