Featuredస్టేట్ న్యూస్

పార్టీ జెండాలతో రేపటి తరం…

మండుటెండలో చిన్నారుల అవస్థలు..

కెటిఆర్‌ స్వాగతానికి పాఠశాల విద్యార్థులు..

కరీంనగర్‌ సంఘటనపై మేధావుల మండిపాటు…

ఎదగాల్సిన భావిభారత భవితవ్యానికి జెండాలు ఇస్తున్నారు… తరగతి గదుల్లో చదవాల్సిన విద్యార్థులను నడిబజారులో పార్టీ కార్యక్రమాలకు జేజేలు కొట్టిస్తున్నారు.. తెలంగాణ ప్రభుత్వంలో ఎంత చదివిన ఉద్యోగం రాదనుకుంటున్నారో ఏమో తెలియదు కాని పాఠశాల విద్యార్థులను పార్టీ ప్రచారానికి వాడుకుంటున్నారు.. ఎండి మండినా, గొంతు ఎండినా, కాళ్లు కాలినా అధినాయకుడి ఆరంగేట్రం చేస్తున్నాడు కాబట్టి జేజేలు కొట్టాల్సిందే.. జెండాలు పట్టాల్సిందే అంటున్నారు తెరాస నాయకులు.. పెన్నులు పట్టి రేపటి సమాజం కోసం వెలుగుదివ్వెలుగా మారాల్సిన విద్యార్థులను పార్టీ కార్యక్రమాలకు ఎందుకు వాడుతున్నారో, ఎవరు వాడమని చెప్పారో తెలియదు కాని జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే అధికారం ఉంది కాబట్టి ఏమైనా చేస్తామంటూ పాఠశాల విద్యారులను తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.. రాష్ట్రమంతా మా గాలి వీస్తుందీ, ముసలి, ముతకా, చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా అందరూ మా పార్టీ వారేనంటూ గొప్పలు చెప్పిన పార్టీ అధినాయకత్వానికి కార్యకర్తలు కరువయ్యారా… లేక విద్యార్థులే కాబట్టి ఎంతసేపైనా జెండాలు పట్టుకొని వారికి తాగించడానికి, తినిపించడానికి రూపాయి ఖర్చుకాదనుకొని వాడుకుంటున్నారో తెలియదు కాని కరీంనగర్‌లో జరిగిన సంఘటన విభిన్న ప్రజానీకం నుంచి అనేక ఆరోపణలు ఎదుర్కోంటుంది. దీనికి పార్టీ పనిమీద వచ్చిన నాయకుడేం సమాధానం చెపుతాడో, అధినాయకుడో ఏలాంటి చర్యలు తీసుకుంటారో చూడాల్సిందే…

హైదరాబాద్‌ ఆదాబ్‌ హైదరాబాద్‌…

పాఠశాల విద్యార్థులకు ఇప్పటికే పరీక్షల సమయం.. నిత్యం పుస్తకాలతో కుస్తీపడుతున్న విద్యార్థులను పార్టీ నాయకుడు వస్తున్నాడని ప్రచారానికి తీసుకుపోయిన సంఘటన బుధవారం కరీంనగర్‌లో జరిగింది. తెరాస పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కెటిఆర్‌ కరీంనగర్‌ పార్టీ సమావేశానికి హజరవుతున్నారని సమాచారం. రెండవసారి ఆఖండమైన విజయం సాధించిన తెరాస పార్టీలో కార్యకర్తలకు, నాయకులకు కొదువే లేదంటారు. ఎక్కడికి వెళ్లినా జనప్రవాహంలా వచ్చే కార్యకర్తలు, అభిమానులు కెటిఆర్‌ సమావేశానికి హజరుకాలేదో, ఎవరు రాలేదో తెలియదు కాని అధినాయకుడు వస్తున్నాడు రోడ్లన్నీ బోసి పోతున్నాయని భావించి దగ్గరలో ఉన్న ప్రవేట్‌ పాఠశాల విద్యార్థులను తీసుకొచ్చారు. ఆ పాఠశాల విద్యార్థులకు జెండాలు, కెటిఆర్‌ చిత్రంతో కూడిన ప్లకార్డులు అందించి మండుటెండలో నిలబెట్టడం జరిగింది. నాయకుడు రాక ఆలస్యమైనా విద్యార్థులను మాత్రం అక్కడినుంచి కదలకుండా చూస్తూ వారిని ఇబ్బంది పెట్టినట్లు సమాచారం. పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులను పార్టీ కార్యక్రమాలకు వాడుకోవడం మంచి పద్దతి కాదని విద్యార్థులకు ఎండలో ఏమైనా జరుగుతే దానికి ఎవరూ బాధ్యత వహిస్తారని విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు సంఘాలు మండిపడుతున్నాయి. అధికార పార్టీ ప్రైవేట్‌ కార్యక్రమాలకు ప్రాథమిక పాఠశాల స్థాయి విద్యార్థినీలను ఎండలో నిలబెట్టి, టిఆర్‌ఎస్‌ జెండాలను మోయించి, రోడ్లపై ఆ పార్టీ నాయకులకు స్వాగతం పలికించడం ఆప్రజాస్వామికమని వారు మండిపడుతున్నారు. పన్నెండు సంవత్సరాలలోపు వయస్సుగల బాలికలకు నడిరోడ్డుపై నిలబడి, మండుటెండలో జెండాలో మోయించినందుకు అధికారపార్టీ నాయకులు ఏమని సమాధానం చెపుతారని వారు అంటున్నారు. బాల కార్మిక నిర్మూలన చట్టం, బాలల హక్కుల రక్షణ చట్టాల ప్రకారం అధికారులపై, పాఠశాల యజమాన్యంపై, సంబంధిత నాయకులపై కఠిన చర్యలు తీసుకోవాలంటున్నారు. ఒక నాయకుడు ఒక ప్రాంతానికో, ఒక గ్రామానికో వస్తున్నాడంటే హడావుడీ అంతా ఇంతా ఉండదు.. నాయకుడి మెప్పుకోసం నానా తిప్పలు పడుతారు.. అవసరం ఉన్న ప్రతి అవకాశాన్ని వాడుకుంటారు.. ఆయన దృష్టిలో పడుతేచాలు ముందు ముందు భవిష్యత్తులో పార్టీలో మంచిపేరుతో పాటు పదవులు వస్తాయని కూడా ఆశపడుతారు. అందుకోసం ఒక్కోసారి ఎంతకైనా తెగిస్తారు. కార్యకర్తలు, కిందిస్థాయి నాయకులు ఏంచేశారో, ఏం చేస్తున్నారో అధినాయకత్వానికి అస్సలు అవసరమే ఉండదు. వెళ్లిన కార్యక్రమం విజయవంతమయిందా, లేదా అన్నది ఒక్కటే చూస్తారు. జనాలు ప్రేమతో వచ్చారా, అభిమానంతో వచ్చారా, డబ్బులిస్తే వచ్చారా అనేది మాత్రం ఎవ్వరు పట్టించుకోరు. రోజురోజు జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తుంటే జనాల్లో కూడా చాలా మార్పు వస్తుంది. పొట్టకూటి కోసం వారు చిన్నచిన్న పనులు చేసుకునేవారిని కూలి డబ్బులు ఇస్తామని చెప్పి వారికి అలవాటు చేస్తున్నారు. అదే అలవాటు మీటింగ్‌లకు వెళ్తే డబ్బులు వస్తాయనే ఆలోచనలే ఉన్నారు. పార్టీ నాయకులు కూడా అలా తయారు చేశారు. ఇప్పుడు విద్యార్థులను కూడా ఆ రొంపిలోకి లాగి వారి జీవితాలతో ఆడుకొవద్దని పలువురు మండిపడుతున్నారు.

విద్యార్థులచే జెండాలు మోయించిన వారిపై చర్యలు తీసుకోవాలి…

బావిభారత విద్యార్థులచే పార్టీ జెండాలు మోయించి, వారిని మండుటెండలో ఇబ్బందులకు గురిచేసిన నాయకులు, అధికారులపై కఠినచర్యలు తీసుకోవాలని యూత్‌ ఫర్‌ యాంటీ కరప్షన్‌ సంస్థ కార్యదర్శులు కొన్నె దేవేందర్‌, బత్తిని రాజేష్‌, వరికుప్పల గంగాధర్‌, జి. హరిప్రకాష్‌ కోరారు. జిల్లాలో, మండలాల్లో ప్రతి కార్యక్రమానికి విద్యార్థులను వాడుకోవడం మామూలు ఐపోయిందని రెండు రకాలుగా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు పాలవుతున్నారన్నారు. పుస్తకాలతో నిత్యం ఒత్తిడికి గురవుతున్న విద్యార్థులను చిన్న వయస్సులోనే పార్టీ జెండాలు ఇచ్చి అధికారిక కార్యక్రమాలకు వాడుకోవడం సరియైన చర్య కాదన్నారు. దేశం మరింత అభివృద్దిలో పథంలో నడవడానికి ప్రధానం కారణం విద్యార్థులేనని, అలాంటి విద్యార్థులను మంచివైపు పయనించేలా చర్యలు తీసుకోవాలి కాని ఆభం, శుభం తెలియని వయసులో పార్టీ కార్యక్రమాలకు తీసుకెళ్లడంపై సీరియస్‌గా దృష్టి సారించాలన్నారు. ఇందుకు సంబంధించిన విషయాలపై పాఠశాల విద్యాకమిషనర్‌, జిల్లా కలెక్టర్‌ పూర్తి విచారణ జరిపి నిందుతులపై కఠినచర్యలు తీసుకోవాలన్నారు. రాజకీయపార్టీ కార్యక్రమాలలో విద్యార్థులు పాల్గనకుండా కఠినమైన నిబంధనలు రూపొందించాలన్నారు. తమ సంస్థ తరపున సంబంధింత అధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు. ఇలాంటి సంఘటనలు మరల పునరావృతం కాకుండా ప్రభుత్వం. అధికారులు కఠినంగా వ్యవహరించాలన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close