నేడే ప్రమాణ స్వీకారం ?

హైదరాబాద్ (ఆదాబ్ హైదరాబాద్):
అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టీఆర్ఎస్ పార్టీ తక్షణమే ప్రభుత్వం ఏర్పాటు చేసే ఆలోచనలో ఉంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను చకచకా చేస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు బుధవారం ప్రమాణ స్వీకారం చేసే అవకాశముందని అనధికార సమాచారం. తాము విజయం సాధిస్తే డిసెంబర్ 12నే ప్రమాణ స్వీకారం చేస్తానని మూడు నెలల క్రితమే కేసీఆర్ ప్రకటించారు. అయితే బుధవారం ప్రమాణ స్వీకారంపై అధికారిక ప్రకటన రావాల్సివుంది. ఈసాయంత్రం టీఆర్ఎస్ శాసనసభపక్ష సమావేశం నిర్వహించను న్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. శాసనసభపక్ష నాయకుడిగా కేసీఆర్‌ను ఎన్నుకునే అవకాశముంది. మంగళవారం సాయంత్రమే గవర్నర్ నరసింహన్‌ను కేసీఆర్ కలసి, ప్రభుత్వ ఏర్పాటుకు తమకు ఆహ్వానించాలని కోరతారని విూడియాలో ప్రచారం జరుగుతోంది.
మేజిక్ ఫిగర్ దాటిన టీఆర్ఎస్ : తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో కారు జోరు కొనసాగుతుంది. మ్నెదటి రౌండ్ నుంచి ఆఖరి రౌండ్ వరకు టీఆర్ఎస్ పార్టీ ఆధిక్యత కనబరుస్తూనే ఉంది. అయితే ఎవరూ ఊహించనంత రీతిలో టీఆర్ఎస్ పార్టీ భారీ ఆధిక్యత చేజిక్కించుకుంది. టీఆర్ఎస్ 88, కాంగ్రెస్ 19, టీడీపీ 2, బీజేపీ 1, ఎంఐఎం 7, ఇతరులు 2 స్థానాలు గెలుచుకున్నారు. తెలంగాణ జనసమితి, సిపిఐ ఒక్క స్థానం కూడా దక్కించుకోకపోవడం గమనార్హం. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే మెజిక్ ఫిగర్ 60 స్థానాలు కావాలి.