ఈనాటి ఇంటర్‌ బంధం ఏనాటిదో

0
  • ఎందుకీ దోబుచులాట
  • పిల్లల ప్రాణాలతో చెలగాటం
  • గ్లోబరిన్‌ తో గలీజు ఏల..?
  • కొనసాగుతున్న ఆందోళనలు
  • పట్టించుకోని ప్రభుత్వం
  • రి వాల్యుఏషన్‌ ఉచితం : హైకోర్టు

(అనంచిన్ని వెంకటేశ్వరరావు, న్యూఢిల్లీ, ఆదాబ్‌ హైదరాబాద్‌)

ఆయన ప్రస్తుతానికి యువరాజు… రాష్ట్రానికి చిన్నదొర. అన్నీ అనుకుంటున్నట్లు జరిగితే భవిష్యత్‌ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి. మంచి భవిష్యత్తు ఉన్న యువ నాయకుడు. ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌, సామాజిక మాధ్యమాల ద్వారా అందరికీ దగ్గర కావాలని తపించే గులాబీ యువ నేత.. అలాంటి నేత స్వార్థంతో ఉంటారా.. ? లేక నిస్వార్థంగా ముందుకు సాగుతారా…? అడ్డదారిలో అడ్డగోలుగా టెండర్లు, అనుకున్న కంపెనీకి 55 లక్షల కాంట్రాక్టు, అనుభవంలేకున్నా పరీక్షల బాధ్యత, గత ఏడాది రూ.3 కోట్ల అదనపు భారం, అవసరం లేకపోయినా కాల్‌ సెంటర్‌, ఇంటర్నెట్‌ సేవలకు రూ.80లక్షలు.. ఇలా.. అలా పెనవేసుకుంటూ… అర్హత లేని గ్లోబరిన్‌ సంస్థ విఎస్‌ఎన్‌ రాజుతో కేటీఆర్‌ స్నేహబంధం కారణం అనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన.. జరుగుతున్న ఇంటర్మీడియట్‌ వ్యవహారం అన్ని కుంభకోణాలలో లాగానే డీఫ్‌ ప్రిజ్‌ లో నిక్షిప్తం కానున్నదా..? లేక తన స్నేహితుడి కోసం ఇంటర్‌ బోర్డును తాకట్టు పెడతారా..? ఈ సున్నితమైన సమస్య విషయంలో కాబోయే ముఖ్యమంత్రి ఇలా ఉంటే ముఖ్యమంత్రి అయిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో కాలం నిర్ణయిస్తోంది. ఇదిలా ఉండగా హైకోర్టు రివ్యాల్యుషన్‌ ఉచితంగా చేయాలంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ విచారణ చేపట్టగా… సదరు కంపెనీ సిఇఓ దొడ్డిదారిన హాజరయ్యారు. ఏది ఏమైనా… ప్రభుత్వానికి మాత్రం చీమకుట్టినట్లు లేదనే విమర్షలు వెల్లువెత్తుతున్నాయి. ఎంతైనా చనిపోయిన పిల్లలు వారింటి వారు కాదు కదా.. అని బాధిత కుటుంబాలు వాపోతున్నాయి.

అసలేం జరిగింది:

రాష్ట్ర ఇంటర్మీడియట్‌ బోర్డులో అవినీతి రాజ్యమేలుతోంది. అక్రమార్జనే ధ్యేయంగా కొందరు అధికారులు బరితెగిస్తున్నారు. అవసరం లేకపోయినా కొత్త పనులు చేపడుతూ ‘సొమ్ము’ చేసుకుంటున్నారు. ప్రకటించిన పరీక్షల సమాచారాన్ని మళ్లీ ప్రాసెసింగ్‌ చేయడం.. వివాదం చెలరేగితే చేతు లెత్తేయడం.. పని నేర్చుకునేందుకు ఓ కంపెనీకి లక్షలు ముట్టజెప్పడం.. అనవసరంగా ఏసీలు, కుర్చీలు కొనడం.. టెండర్లు లేకుండా పనులు అప్పగించడం.. ఇలా అందినకాడికి అడ్డంగా దోచుకున్నారు. ‘అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు’గా విద్యార్థుల సొత్తును ప్రైవేటు కంపెనీలకు దోచిపెట్టారు. అవినీతి దందాతో ఇంటర్‌ బోర్డు, కమిషనరేట్‌ ను అధోగతిపాలు చేశారు. పని నేర్చుకోవడానికి ఓ కంపెనీకి ఇంటర్‌ బోర్డు అధికారులు ఏకంగా రూ.55 లక్షలు అప్పగించడం గమనార్హం. గత ఏడాది ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షల ఫలితాలను ఏప్రిల్‌ 13న విడుదల చేశారు. దాంతో వార్షిక పరీక్షల తంతు ముగిసింది. కానీ, బోర్డు అధికారులు మళ్లీ ఫలితాల ప్రాసెసింగ్ను మొదలుపెట్టారు. ఎందుకో తెలుసా? ఓ కంపెనీ ఫలితాల ప్రాసెసింగ్‌ ఎలా చేయాలో తెలుసుకునేందుకు ఏకంగా రూ.55 లక్షలు ఇవ్వడం గమనార్హం. ఫలితాల ప్రాసెసింగ్ను చాలా కాలం నుంచి మేగ్నటిక్‌ సంస్థ నిర్వహిస్తోంది. ఇప్పుడు కొత్తగా ఈ పనిని గ్లోబరీనా కంపెనీకి ఇచ్చారు. ఈ ఏడాది ఫలితాలు సక్రమంగా విడుదల చేసేందుకు గత ఏడాది ఏడాది ఫలితాలను మళ్లీ ప్రాసెసింగ్‌ చేయాలని కంపెనీ భావించింది. ఇందుకయ్యే ఖర్చు ఇవ్వాలని అధికారులను సంప్రదించగా.. ఎలాంటి టెండరు లేకుండానే రూ.55 లక్షలు ధారాదత్తం చేసేశారు. అబ్బో.. పని నేర్చుకునేందుకే ఇంత ఇవ్వడం దొరలకే చెల్లింది.

అనుభవం లేదు.. టెండరూ లేదు: ఇంటర్‌ బోర్డు, కమిషనరేట్‌ లో ఆన్లైన్‌ సేవలు, పరీక్షల నిర్వహణ, ఫలితాల వెల్లడి ప్రక్రియను మేగ్నటిక్‌ కంపెనీని కాదని.. గ్లోబరీనాకు దీన్ని అప్పగించారు. అనుభవం లేని గ్లోబరీనాకు పరీక్షల నిర్వహణ పని అప్పగించడం, విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడటం చకాచకా జరిగిపోయాయి. మరోవైపు టెండర్లు పిలవకుండా ఏకపక్షంగా గ్లోబరీనాకు పనులు అప్పగించారు. గతంలో మేగ్నటిక్‌ కంపెనీతో మూడేళ్లకు గాను రూ.1.56 కోట్లకు ఒప్పందం కుదుర్చుకుంటే ఇప్పుడు గ్లోబరీనాతో అదే మూడేళ్లకు రూ.4.35 కోట్లకు ఒప్పందం కుదుర్చుకున్నారు. అంటే ఇంటర్‌ బోర్డుపై సుమారు రూ.2.79 కోట్ల భారం పడింది. అనుభవం లేని కంపెనీకి పరీక్షల నిర్వహణ, ఫలితాల వెల్లడి బాధ్యత అప్పగిస్తే భవిష్యత్లో అనేక ఇబ్బందులు ఎదురవుతాయని ఉద్యోగులు ఆందోళన నిజమైంది. జేఎన్టీయూ – కాకినాడ ఇదే గ్లోబరీనా కంపెనీతో జవాబు పత్రాల మూల్యాంకనానికి ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భారీగా అవినీతి జరిగింది. దీనిపై గవర్నర్‌ నరసింహన్‌ విచారణకు ఆదేశించారు. ఇందుకోసం ప్రత్యేకంగా కమిటీ కూడా ఏర్పాటు చేశారు. అలాంటి కంపెనీకి బోర్డు బాధ్యతలు ఎంచక్కా అప్పగించింది. గ్లోబరీనా కంపెనీకి పరీక్షల నిర్వహణ, ప్రాసెసింగ్లో అనుభవం లేకపోవడంతో ఆ కంపెనీ అడ్డదారులు తొక్కుతున్నట్లు తెలిసింది. వారికి ఇచ్చిన టెండర్‌ ను థర్డ్పార్టీకి ఇచ్చి పని చేయించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ విధంగా పరీక్షల వ్యవహారాలను థర్డ్పార్టీకి ఇవ్వడమంటే నిబంధనలను ఉల్లంఘించడమే. మేగ్నటిక్‌ కంపెనీతోనే థర్డ్పార్టీ పని చేయించాలని నిర్ణయించినట్లు సమాచారం. తద్వారా ఒక్క పైసా ఖర్చు కాకుండా రూ.55 లక్షలు నొక్కేయాలనే ప్లాన్‌ సక్సస్‌.

ఇంటర్నెట్కు రూ.80 లక్షలు..: ఇంటర్బోర్డు, కమిషనరేట్లో నిరంతర విద్యుత్తు, ఇంటర్నెట్‌ సరఫరాకు అధికారులు ఏకంగా రూ.80లక్షలకు టెండరు అప్పగించడం గమనార్హం. రోజంతా నెట్‌ ఉపయోగించినా నెలకు రూ.5వేలకు మించి చార్జీ కాదు. అలాంటిది ఏకంగా రూ.80 లక్షలకు టెండర్‌ ఇవ్వడంపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది.

హెల్ప్లైన్‌ ఉండగానే..: అక్రమంగా డబ్బు ఎలా సంపాదించాలా..? అని యోచించిన అధికారులకు కాల్సెంటర్‌ ఏర్పాటు చేయాలని తట్టింది. అంతే.. విద్యార్థులకు సమాచారం అందించాలనే సాకుతో దీని ఏర్పాటుకు టెండర్లు కూడా పిలిచారు. ఏకంగా రూ.15 లక్షలకు టెండర్లు పూర్తి చేయడం గమనార్హం. వాస్తవానికి అక్కడ ఇప్పటికే హెల్ప్‌ లైన్‌ ఉంది. అయినా అధికారులు కాల్‌ సెంటర్‌ ఏర్పాటు చేయడం గమనార్హం. దీన్ని 24 గంటల పాటు కొనసాగించాలని నిబంధనల్లో ఉంది.అర్ధరాత్రి ఫోన్‌ చేయాల్సినంత సందేహాలు ఇంటర్‌ విద్యార్థులకు ఏముంటాయో అధికారులకే తెలియాలి. ఈ కాల్సెంటర్కు రోజూ కనీసం 10 మంది కూడా కాల్‌ చేయడం లేదని తెలిసింది. వాస్తవానికి విద్యార్థులకు అందాల్సిన మెజారిటీ సేవలను బోర్డు ఆన్లైన్లోనే అందిస్తోంది. మరోవైపు కాల్‌ సెంటర్‌ టెండర్లు పూర్తయినప్పటికీ అగ్రిమెంట్‌ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. అలాంటి కాల్‌ సెంటర్ను విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్‌ ఆచార్య ప్రారంభించడం గమనార్హం.

ఆ ఒక్కడు.. అతనికి ముగ్గురు: ఇంటర్బోర్డులో అవినీతి టెండర్లు, ఇతర కార్యక్రమాల వెనక కమిషనరేట్కు చెందిన ఓ అధికారి చక్రం తిప్పారు. ఐటీ సేవల వినియోగంలో సిద్ధహస్తుడైన ఆ అధికారి ఈ గోల్మాల్‌ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశారు. బోర్డు ఉన్నతాధికారికి కుడిభుజంగా పేరుగాంచారు. దీంతో ఇటు బోర్డు, అటు కమిషనరేట్లో ఆయన చెప్పిందే వేదం. అయితే అతను పూర్తిస్థాయి కమిషనరేట్‌ ఉద్యోగి కాకపోవడం మరో ట్విస్ట్‌. గతంలో ఆయన జీహెచ్‌ఎంసీ, వాటర్‌ వర్క్స్లో విధులు నిర్వర్తించారు. అక్కడ పెద్దఎత్తున అవినీతి ఆరోపణలు రావడంతో డిప్యుటేషన్పై అక్కడి నుంచి పంపించారు. మళ్లీ సాంకేతిక విద్యాశాఖకు వెళ్లకుండా పైరవీలు చేసి ఇంటర్‌ కమిషనరేట్లో తిష్ఠ వేయడం గమనార్హం.

ఇక ఏ’మార్చలేం’: ఇంటర్‌ ఫలితాల్లో వెలుగుచూసిన అక్రమాలు ఇప్పట్లో పరిష్కారమయ్యే అవకాశాలు కనిపించడం లేదు. ఇంటర్‌ వార్షిక ఫలి తాల ప్రక్రియ కాంట్రాక్టు పొందిన ఓ ప్రైవేటు కంపెనీ సంస్థ మార్కుల జాబితాల్లో జరిగిన తప్పులను తాము సరిదిద్దలేమని చేతులెత్తేసినట్లు తెలుస్తోంది. ఇంటర్‌ ఫలితాలను ఈ నెల 18న బోర్డు ప్రకటించింది. ఈ ఫలితాలు విడుదలైన కొద్ది క్షణాల్లోనే మార్పుల జాబితాలను బోర్డు వెబ్సైట్లో పెట్టింది. వందలాది మంది విద్యార్థులకు సబ్జెక్టుకు ఎదురుగా వారు సాధించిన మార్కులకు బదులు ఏపీ, ఏఎఫ్‌ అంటూ ఇంటర్బోర్డు కోడ్లను ముద్రించింది. ఈ కోడ్లు ఏంటో తమకు తెలియడం లేదని, వీటిని తాము పరిష్కరించలేమని సదరు కంప్యూటర్‌ సంస్థ యాజ మాన్యం తేల్చి చెప్పినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇంటర్‌ వార్షిక ఫలితాల అక్రమాలకు సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శైలేంద్ర కుమార్‌ జోషి నిర్వహించిన ఉన్నతస్థాయి సమావేశంలో విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్రెడ్డి, ఇంటర్‌ బోర్డు కార్యదర్శి అశోక్‌ తో పాటు కంప్యూటర్‌ సంస్థ యాజమాన్య ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. ఈ సమావేశంలోనూ ఇంటర్‌ బోర్డు కార్యదర్శి అశోక్‌.. ప్రభుత్వాన్ని తప్పుదోవపట్టించే విధంగా సమాచారం అందించారు. కేవలం ముగ్గురు విద్యార్థులకు సంబంధించిన మార్కుల జాబితాలలో తప్పులు దొర్లాయని, ఈ ముగ్గురు విద్యార్థుల ఫలితాలను సవరిస్తున్నామని అశోక్‌ ఈ సందర్భంగా చెప్పినట్లు సమాచారం. అయితే, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జోషీ ప్రత్యేకంగా కంప్యూటర్‌ సంస్థ ప్రతినిధులతో సమావేశం జరిపారని, వారు ఫలితాల్లో జరిగిన అనేక అక్రమాలను వివరించారని సమాచారం. మార్కుల జాబితాలలో సబ్జెక్టు ఎదురుగా ఏపీ అని ప్రచురితమైతే వాటిని తాము వీలైనంత త్వరలోనే పరిష్కరించి విద్యార్థులకు తాజా మార్కుల జాబితాలను అందించే ప్రయత్నం చేస్తామని ఏఎఫ్‌ కోడ్తో వచ్చిన మార్కుల జాబితాలను తాము ఎంతమాత్రం పరిష్కరించలేమని వారు చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. ఏఎఫ్తో వచ్చిన మార్కుల జాబితాలు పరిష్కృతం కావాలంటే కనీసం నెల రోజులకు పైగా సమయం పడుతుందని, అది కూడా పూర్తిగా సమస్య పరిష్కారం కాదు. ఏఎఫ్కోడ్తో వచ్చిన జవాబు పత్రాలను పరిష్కరించాలంటే 30 మంది ఉన్నతాధికారులు 24 గంటల పాటు 40 రోజులు పనిచేయవలసి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ తరహా మార్కుల జాబితా పొందిన విద్యార్థి పరీక్ష రాసిన కేంద్రానికి వెళ్లి జవాబు పత్రం బార్కోడ్ను తెలుసుకోవాల్సి ఉంటుందని, ఈ ప్రక్రియ జరిగాక.. ఆ బార్‌ కోడ్ను తీసుకుని ఆ జవాబు పత్రం మూల్యాంకనానికి ఏ కేంద్రానికి వెళ్లిందో.. అక్కడికి వెళ్లి పరిశీలించవలసి ఉంటుందని.. ఆ తర్వాత జరిగే ప్రక్రియకు మరో 20 రోజులు పడుతుందని భావిస్తున్నారు. జవాబు పత్రాల మూల్యాంకనాన్ని కంప్యూటర్‌ ద్వారా కాకుండా మాన్యువల్గా చేసినందున కొన్ని సందర్భాల్లో బార్కోడ్‌, జవాబు పత్రం కూడా దొరికే అవకాశాలు ఉండవని.. అటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలి? అన్నది ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని కంప్యూటర్‌ సంస్థ ప్రతినిధులు చెప్పినట్లు సమాచారం. ఇంటర్బోర్డులో వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండటంతో గల్లంతైన జవాబు పత్రాలు ఎక్కడున్నాయో కూడా తెలుసుకోలేని పరిస్థితి ఉందని ఇంటర్బోర్డులో చర్చ జరుగుతోంది.

పరీక్షలకు గైర్హాజరైనా ఫలితం పాస్‌?!: ఇంటర్‌ వార్షిక పరీక్షలకు గైర్హాజరైన విద్యార్థులకు వచ్చిన మార్కుల జాబితాల్లో వారు ఉత్తీర్ణత పొందినట్లు తెలుస్తోంది. జె.లిఖిత అనే విద్యార్థిని ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం పరీక్షలకు హాజరు కాలేదు. అనారోగ్యంతో ఈ విద్యార్థిని పరీక్షలకు దూరంగా ఉన్నారు. ఇంటర్‌ బోర్డు ప్రకటించిన ఫలితాలలో లిఖిత ఉత్తీర్ణత సాధించిందని 90 శాతంకు పైగా మార్కులొచ్చాయని బోర్డు వెబ్సైట్లో మార్కుల జాబితాను పొందుపర్చారు. ఈ జాబితాను చూసి విద్యార్థిని లిఖిత ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురైంది. బోర్డు కార్యదర్శి అశోక్‌ మాత్రం పరీక్షకు గైర్హాజరైన విద్యార్థినిని లేదా విద్యార్థులను ఎటువంటి పరిస్థితుల్లోనూ ఉత్తీర్ణత సాధించినట్లు ఒక ప్రకటనలో తెలిపారు. మరి లిఖిత పరీక్షలకు గైర్హాజరైన ఎలా ఉత్తీర్ణత సాధించిందో.. ఆ అమ్మాయి మార్కుల జాబితాను ఎలా ప్రకటించారో అశోక్‌ చెప్పాల్సిన అవసరం ఉంది.

బోర్డు చేసిన తప్పులు: ఇంటర్బోర్డు చేసిన తప్పులకు తామెందుకు బలి కావాలని పరీక్షలకు హాజరైన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు నిలదీస్తున్నారు. తప్పుల తడకగా వచ్చిన మార్కుల జాబితాలను చేతపట్టుకుని గత మూడు రోజులుగా వందలాంది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు నాంపల్లిలోని ఇంటర్బోర్డు కార్యాలయానికి వచ్చి ఆందోళనకు దిగారు. తమకు జరిగిన తప్పులను సరిదిద్దాలని.. వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని డిమాండ్‌ చేశారు. మార్కుల జాబితాల్లో లెక్కకు మించి తప్పులు దొర్లినా ఇంటర్బోర్డు కార్యదర్శి అశోక్‌ అసలు తప్పులే జరగలేదని మొండిగా వాదిస్తుండటం దేనికి సంకేతం? అని తల్లిదండ్రులు ప్రశ్నించారు.

2892 మంది మెరిట్‌ విద్యార్థులు ఫెయిల్‌: ెుుత్తం మార్కుల్లో 750 నుంచి 930 మార్కులు వచ్చిన వారు కూడా ఫెయిలయ్యారు. అటువంటి వాటిని కూడా ఇంటర్‌ బోర్డు శని, ఆదివారాల్లో సరిచేసినట్టు సమాచారం. ఎక్కువ మార్కులు వచ్చి కూడా ఫెయిల్‌ అయినట్టు మెమోలు జారీ అయిన వారిలో 2892 మంది ఉన్నారు. 900 ఆపైన మార్కులు వచ్చిన వారిలో 11 మంది ఉండగా.. 850 నుంచి 900 వచ్చిన వారు 125 మంది.. 800 నుంచి 850 వచ్చిన వారు 750 మంది.. 750 నుంచి 800 మార్కులు వచ్చిన వారిలో 2006 మంది ఫెయిల్‌ అయినట్టు ఇంటర్బోర్డు జారీ చేసిన మెమోల్లో స్పష్టమైంది. వీటిని పరిశీలించిన అధికారులు వాటిని సరిచేసి బోర్డు అధికారిక వెబ్సైట్లో సవరణ మెమోలను అప్లోడ్‌ చేసినట్టు తెలిసింది.

రీవాల్యుయేషన్కు అంత సమయమా?: హైకోర్టు

హైదరాబాద్‌: తెలంగాణలో ఇంటర్‌ పరీక్ష ఫలితాల వివాదంపై బాలల హక్కుల సంఘం వేసిన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. ఫెయిలైన విద్యార్థులందరి జవాబు పత్రాలను మళ్లీ మూల్యాంకనం చేయాలని ఉన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. దీనికి ఎంత సమయం పడుతుందని అదనపు అడ్వొకేట్‌ జనరల్ని ప్రశ్నించింది. సుమారు 2 నెలలు పడుతుందన్న ఆయన వాదనపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. ఫెయిలైన 3లక్షల మంది విద్యార్థుల జవాబు పత్రాల మూల్యాంకనానికి అంత సమయం ఎందుకని ప్రశ్నించింది. ఈ విషయంలో సాధ్యాసాధ్యాలపై సోమవారం చెబుతామని అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ ఉన్నత న్యాయస్థానానికి తెలిపారు. ఫలితాల్లో గందరగోళంపై విచారణకు ప్రభుత్వం ఆదేశించిందని పేర్కొంటూ జీవోను ఆయన సమర్పించారు. ఏజెన్సీ పనితీరుపై మాత్రమే విచారణకు ఆదేశించారని అభిప్రాయపడిన హైకోర్టు.. మొత్తం వ్యవహారాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించింది. మరోవైపు దీనిపై న్యాయవిచారణకు ఆదేశించాలంటూ పిటిషనర్‌ తరఫు న్యాయవాది దామోదర్‌ రెడ్డి ఉన్నత న్యాయస్థానాన్ని కోరగా.. న్యాయవిచారణతో విద్యార్థులకు ప్రయోజనం ఉండదని వ్యాఖ్యానించింది. దీనిపై సోమవారంలోపు అభిప్రాయాన్ని చెప్పాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.

విచారణ కమిటీ ముందుకు అశోక్కుమార్‌!

(ఆదాబ్‌ హైదరాబాద్‌): తెలంగాణ ఇంటర్మీడియట్‌ ఇంటర్‌ ఫలితాల్లో అవకతవకలపై ఏర్పాటైన త్రిసభ్య కమిటీ తన విచారణను ముమ్మరం చేసింది. ప్రస్తుతం ఇంటర్‌ బోర్డు కార్యాలమంలో త్రిసభ్య కమిటీ విచారణ కొనసాగుతోంది. కమిటీ విచారణకు వచ్చిన సమయంలో హైకోర్టు విచారణ నిమిత్తం ఇంటర్‌ బోర్డు కార్యదర్శి అశోక్కుమార్‌ అక్కడికి వెళ్లిన సంగతి తెలిసిందే. హైకోర్టు విచారణ ముగియడంతో అశోక్కుమార్‌ బోర్డు కార్యాలయానికి చేరుకొని విచారణ కమిటీ ముందు హాజరయ్యారు. ఇంటర్‌ ఫలితాల్లో గందరగోళానికి కారణం ఏమిటి? ఎలాంటి అవకతవకలు జరిగాయో? అవకతవకలు, నిర్లక్ష్యం, అక్రమాలకు బాధ్యులెవరు? అన్న కోణంలో కమిటీ అశోక్కుమార్‌ నుంచి వివరాలు సేకరిస్తున్నట్టు తెలుస్తోంది.

వెనుక గేటు నుంచి విచారణకు గ్లోబరీనా సీఈవో!:

ఇంటర్‌ ఫలితాల్లో అవకతవకలపై త్రిసభ్య కమిటీ విచారణ జరుపుతున్న నేపథ్యంలో.. గ్లోబరీనా సంస్థ సీఈవో రాజు ఇంటర్‌ బోర్డు కార్యాలయానికి వచ్చారు. కార్యాలయం ప్రధాన గేటు నుంచి త్రిసభ్య కమిటీ సభ్యులు లోపలికి వెళ్లగా.. గ్లోబరీనా సీఈవో రాజు మాత్రం వెనుక ఉన్న ఓ చిన్న గేటు నుంచి కార్యాలయం లోపలికి వెళ్లారు. ప్రస్తుతం బోర్డు కార్యాలయంలో సాగుతున్న కమిటీ విచారణలో ఆయన పాల్గొన్నట్టు తెలిసింది. ఇంటర్మీడియట్‌ ఫలితాల్లో గందరగోళానికి గ్లోబరీనా సంస్థనే కారణమని ఆరోపణలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఆ సంస్థ తీవ్రమైన నిర్లక్ష్యం.. నేడు లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడేలా చేసింది. డీపీఆర్పీ ప్రాజెక్టులో భాగంగా గ్లోబరీనా సంస్థ పలుదశల్లో సాంకేతిక సేవలను ఇంటర్మీడియట్‌ బోర్డుకు అందించాలి. దీనికి అవసరమైన సమాచారాన్ని బోర్డు నుంచి సేకరించి.. కంప్యూటరీకరించడం, విశ్లేషించడం తదితర పనులు సమయానుగుణంగా చేయాలి. కానీ.. ఈ విషయంలో కనీసస్థాయిలో కూడా అనుభవంలేని గ్లోబరీనా సంస్థ టెండరు దక్కించుకున్నప్పటినుంచీ.. బోర్డుతో సమన్వయం చేసుకోవడంలో దారుణంగా విఫలమైంది. దీంతో ప్రాజెక్టు ఆసాంతం తీవ్ర గందరగోళంగా తయారైంది. ఇంటర్‌ ఫలితాల వెల్లడిలో అవకతవకలపై ఏర్పాటైన త్రిసభ్య కమిటీ ఇంటర్‌ బోర్డు కార్యాలయంలో విచారణ చేపట్టింది. ఇంటర్‌ ఫలితాల్లో చోటుచేసుకున్న గందరగోళంపై కమిటీ వివరాలు సేకరించింది. త్రిసభ్య కమిటీ విచారణ నిమిత్తం బోర్డు కార్యాలయానికి చేరుకున్న సమయంలో.. అశోక్కుమార్‌ అక్కడ లేరు. బాలల హక్కుల సంఘం హైకోర్టులో లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేయడంతో.. ఇంటర్‌ బోర్డు కార్యదర్శి అశోక్‌ కుమార్‌ విచారణ నిమిత్తం కోర్టుకు హాజరయ్యారు. ఆయన లేని సమయంలోనే త్రిసభ్య కమిటీ కార్యాలయంలో విచారణ చేపట్టడం గమనార్హం.

ఇంటర్‌ బోర్డు వద్ద పోలీసుల దిగజారుడు ప్రవర్తన: ఈ క్రమంలో ఇంటర్‌ బోర్డు కార్యాలయం వద్ద పోలీసులు దిగజారి ప్రవర్తించడం.. తీవ్ర విమర్శలకు తావిచ్చింది. విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో బోర్డు కార్యాలయానికి వచ్చిన ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కే నాగేశ్వర్ను కార్యాలయంలోకి వెళ్లకుండానే పోలీసులు అరెస్ట్‌ చేశారు. అదే సమయంలో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకుడిని మాత్రం వెంటబెట్టుకొని మరి బోర్డు కార్యాలయం లోపలికి పోలీసులు తీసుకెళ్లారు. అది కూడా కార్యాలయంలో త్రిసభ్య కమిటీ విచారణ జరుగుతున్న సమయంలో పోలీసులు ఇలా వ్యవహరించడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. దీనిపై పోలీసులను విూడియా ప్రశ్నించడంతో సదరు టీఆర్‌ఎస్‌ నేతను బయటకు తీసుకొచ్చారు.

మినిస్టర్‌ క్వార్టర్స్‌ వద్ద ఏబీవీపీ ఆందోళన: ఇంటర్‌ ఫలితాల్లో అవకతవకల నేపథ్యంలో బంజారాహిల్స్లోని మినిస్టర్‌ క్వార్టర్స్‌ వద్ద ఏబీవీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. ఇంటర్‌ ఫలితాల్లో జరిగిన అవకతవకలపై ప్రభుత్వం స్పందించాలని విద్యార్థి నేతలు డిమాండ్‌ చేశారు. ఇంటర్‌ బోర్డ్‌ కార్యదర్శి అశోక్కుమార్ను వెంటనే సస్పెండ్‌ చేయాలని నినాదాలు చేశారు. రీ వెరిఫికేషన్‌, రీవాల్యుయేషన్‌ ఉచితంగా చేయాలని ఏబీవీపీ కార్యకర్తలు డిమాండ్‌ చేస్తున్నారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఎబీవీపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here