నేడు తుదిపోరు

0

మూడవ విడత ఎన్నికలు

˜ రాష్ట్ర వ్యాప్తంగా 3,529 జీపీలు, 27,582 వార్డులకు పోలింగ్‌

˜ రాత్రి వరకు పూర్తిస్థాయి ఫలితాలు వెల్లడి

˜ పోలింగ్‌ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తిచేసిన అధికారులు

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): గ్రామ పంచాయతీ ఎన్నికలు తుది దశకు చేరుకున్నాయి. మొత్తం మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తుంగా.. మూడో విడత ఎన్నికలు నేడు జరగనున్నాయి. మూడో విడతలో మొత్తం 4116 గ్రామాల్లో ఎన్నికలు జరగాల్సి ఉండగా, 577 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మరో 10 గ్రామాల్లో నామినేషన్లు దాఖలు కాలేదు. దీంతో ఆఖరి విడతలో 3,529 గ్రామాలకు బుధవారం పోలింగ్‌ నిర్వహించనున్నారు. ఈ గ్రామాల్లో 11,667 మంది సర్పంచ్‌ అభ్యర్థులు, 27,582 వార్డులకు 73,976 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. మొత్తం 36,729వార్డులుండగా, 8,959 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. 188వార్డులకు నామినేషన్లు దాఖలుచేయకపోవడంతో పోలింగ్‌ జరగడం లేదు. ఇక రెండో విడతలో పోలింగ్‌ వాయిదాపడిన నిజామాబాద్‌ జిల్లా జల్లపల్లి, ఆదిలాబాద్‌ జిల్లా తోషంతండా సర్పంచ్‌, మూడో వార్డుతోపాటు రంగారెడ్డి జిల్లాలో ఒక వార్డుకు నేడు పోలింగ్‌ నిర్వహించనున్నారు. బుధవారం ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు పోలింగ్‌ జరగనుంది. మధ్యాహ్నం 2గంటల నుంచి కౌంటింగ్‌ ప్రారంభం కానుంది. రాత్రి 8గంటల వరకు పూర్తి ఫలితాలు వెల్లడి కానున్నాయి. పోలింగ్‌ నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పోలింగ్‌కు 44 గంటల ముందు ప్రచారాన్ని నిర్వహించరాదని, కరపత్రాల పంపిణీ చేయరాదని ఎన్నికలసంఘం ఆదేశాలివ్వడంతో పంచాయతీ అభ్యర్థులు ప్రచారాన్ని ముగించారు. ఇక మూడో విడతలో ఎన్నికల్లో భాగంగా ఆయా గ్రామాల్లో నిర్వహించిన తనిఖీల్లో 5 లక్షల 79 వేల 855 విలువైన మద్యాన్ని పట్టుకున్నట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది. రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో లక్షా 39వేల 140, నిజామాబాద్‌ జిల్లాలో రూ.24 వేలు, రామగుండం కమిషనరేట్‌ పరిధిలో రూ.1,560, ఖమ్మంలో రూ.6 వేల 600, కరీంనగర్‌లో రూ.2లక్షల 11 వేల 980, వనపర్తిలో రూ.19 వేల 200, మహబూబ్‌నగర్‌లో రూ.31 వేల 500, వికారాబాద్‌లో రూ.24 వేలు, రాజన్న సిరిసిల్లలో రూ.9 వేల 870, భద్రాద్రి కొత్తగూడెంలో రూ.48 వేల 300, జయశంకర్‌ భూపాలపల్లిలో రూ.32వేలు, జగిత్యాల జిల్లాలో రూ.32 వేల 205 విలువైన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. 16 మందిపై కేసు నమోదుచేసి, అదుపులోకి తీసుకున్నట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here