అమరావతిలో టికెట్ల పంచాయితీ

0

అమరావతి (ఆదాబ్‌ హైదరాబాద్‌): తెలంగాణలో తెదేపా టిక్కెట్ల పంచాయతీ అమరావతికి చేరింది. మహాకూటమిలో భాగంగా రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం నియోజకవర్గాన్ని తెలుగుదేశం పార్టీకి కేటాయించారు. దీంతో తమ పార్టీ అభ్యర్థిగా సామ రంగారెడ్డిని ఆ పార్టీ ప్రకటించింది. అయితే తాను ఎల్బీనగర్‌ నుంచి పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటే పక్క నియోజకవర్గ కేటాయిండమేంటని సామ రంగారెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎల్బీనగర్‌ తెదేపా సిట్టింగ్‌ స్థానం కావడంతో తొలి నుంచి తనకే ఇవ్వాలని రంగారెడ్డి డిమాండ్‌ చేస్తున్నారు. అధికారికంగా ఈ స్థానం ఎవరికి కేటాయిస్తారన్నది ప్రకటించకపోయినా కాంగ్రెస్‌ పార్టీకి చెందిన సుధీర్‌రెడ్డి తనకే టికెట్టు వస్తుందని ప్రచారం చేసుకొంటున్నారు. దీంతో కలత చెందిన సామ రంగారెడ్డి అనుచరులు కొద్దిరోజుల క్రితం ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌కు పెద్దఎత్తున వచ్చి ఆందోళన చేశారు.

ఎల్బీనగర్‌ ఇవ్వలేం – చంద్రబాబు

తనకు ఎల్బీనగర్‌ టికెట్‌ కేటాయించాలని కోరుతూ గురువారం అమరావతిలో తెదేపా నేత నామా నాగేశ్వరరావుతో కలిసి సామ రంగారెడ్డి బాబుతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తనకు ఎల్బీనగర్‌ టికెట్‌ కేటాయించాలని కోరారు. దీనికి స్పందించిన బాబు.. కూటమి పొత్తుల్లో భాగంగా ఎల్బీనగర్‌ను కాంగ్రెస్‌కు కేటాయించడం జరిగిందని, పొత్తుల నేపథ్యంలో సర్దుకుపోవాలని బాబు సూచించారు. కాగా ఇబ్రహం పట్టణం నుండి టీడీపీ టికెట్‌ ఆశించిన మరో నేత బీంరెడ్డి రెబల్‌గా నిలిచే అవకాశం ఉన్నట్లు అధిష్టానం దృష్టికి రావడంతో ఇబ్రహీంపట్నంలో పరిస్థితిని చక్కదిద్దే బాధ్యతను బాబు నామా నాగేశ్వరరావుకు అప్పగించారు. ఇదిలా ఉంటే సామ వర్గీయులు ఎల్బీనగర్‌ సీటు కేటాయించాల్సిందే అని ఆందోళన చేపట్టారు. టీ.టీడీపీ అధ్యక్షుడు ఎల్‌.రమణకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎల్బీనగర్‌ కాకుండా ఇబ్రహింపట్నం సీటు కేటాయిస్తే 15రోజుల్లో ఎలా పనిచేసుకోగలం అని సామరంగారెడ్డి ఆయన వర్గీయులు ప్రశ్నించారు. గత ఎన్నికల్లో మూడో స్థానంలో ఉన్న సుధీర్‌రెడ్డికి మహాకూటమి తరపున టికెట్‌ ఇవ్వడమేంటి అని నిరసన వ్యక్తం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here