వెయ్యికోట్ల కారుణ్య స్కాం..

0

(అనంచిన్ని వెంకటేశ్వరరావు, ఆదాబ్‌ హైదరాబాద్‌)

‘జింకను వెటాడాలంటే పులి ఎంత నిశ్శబ్దంగా ఉంటుంది… అదే పులిని వేటాడాలంటే…’ ఓ సినిమాలో డైలాగ్‌ ఈ పరిశోధన కథనానికి అతికినట్టు సరిపోతుంది. బంగారు తెలంగాణ రాష్ట్రంలో కారుణ్య నియామకాలు దర్జాగా జరిగాయి. అంతా సవ్యంగానే జరిగాయని భావించారు. అసలు నిజాలకై ‘ఆదాబ్‌ హైదరాబాద్‌’ సెప్టెంబర్‌ 16, 2014న సమాచారహక్కు చట్టం ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఓ దరఖాస్తు చేసింది. అది.. అలా.. అలా.. ఓ ‘అల’ లగా కదిలి.. సునావిూ లాగే అతిపెద్ద తేనే తుట్టె కదిపింది. తీగ లాగ కుండానే డొంక కదిలింది. కారుణ్య నియామకాలలో… అర్హతలేని దౌర్భాగ్యులు అందలం ఎక్కారు. అజమాయిషీ విషయంలో అసలు ఉద్యోగులను త్రోసి రాజంటూ.. ఎంచక్కా లక్షలాది రూపాయలను విందు భోజనం చేశారు. ఆరగించుకున్నారు. పాపం పండింది ‘ఆదాబ్‌ హైదరాబాద్‌’ రూపంలో అవాతంరం ఎదురైంది. తప్పనిసరి పరిస్థితుల్లో విషయ తీవ్రత ప్రభుత్వానికి అర్థమైంది. వెంటనే సిబిసిఐడిని రంగంలోకి దిగింది. సమాచార హక్కు చట్టం ద్వారా చేసిన ఆదాబ్‌ దరఖాస్తు దొంగలను పట్టించింది. చదవండి మీకోసం ప్రత్యేక కథనం..

ఇలా ఆరంభం: ఉమ్మడిరాష్ట్రంలో జరిగిన అన్యాయాలలో ఇదో తరహా నేరం. ఎవరూ పసిగట్ట లేరని నీచుల పన్నాగం. ఇది ఏస్థాయికి దిగజారిందంటే.. ఉద్యోగం కోసం తల్లిదండ్రులను సైతం చంపడానికి వెనుకాడని వారసులు. ఆ హత్యలన్నీ రికార్డుల ప్రకారం సహజ మరణాలు. అడపా, దడపా అనుమానాస్పద మరణాలు. కొద్ధి రోజుల తరువాత ఫైల్‌ క్లోజ్‌. ఎంచక్కా జాబు నుంచి వచ్చే డబ్బు దర్జాగా ఆ హంతక వారసుల జేబుల్లోకి వెళ్ళటం. అనుమానం వచ్చిన ‘ఆదాబ్‌ హైదరాబాద్‌’ స్వయంగా రంగంలోకి దిగింది. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సెప్టెంబర్‌ 16,2014న దరఖాస్తు చేసింది. యు.ఓ.నోట్‌ నెం. 1469/పిఏజిబి/2014 ద్వారా ప్రభుత్వంలోని అన్ని శాఖలు… ఆ శాఖలు తమ జిల్లా శాఖలు, అక్కడి నుండి మండల స్థాయి వరకు ఉత్తరప్రత్యురాలు కొనసాగాయి. అనంతరం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి మొత్తం విషయం అర్థమైంది. అంతే డిజిపి ద్వారా సిబిసిఐడికి ఈ నియామకాలపై దర్యాప్తుకు ఆదేశించారు.

రాజకీయ వత్తిడి: సహజంగా వచ్చే రాజకీయ వత్తిడి ఇక్కడ కూడా పనిచేసింది. విజిలెన్స్‌ విచారణ నీరుగార్చారు. ప్రతి విషయం ‘ఆదాబ్‌’ దృష్టిలో ఉంది. అయినా సమయానుకూలంగా ముందుకు వెళ్ళాలనే ధ్యేయంతో ఉంది. అయితే కేసు మూసివేతకు అధికారులు అంగీకరించ లేదు. ఎందుకంటే గతంలో ఇలాగే కేసులు మూసివేసి నేటికీ ఆపసోపాలు పడుతున్నారు. దాంతో కేసు ఆలస్యం చేయగలిగారు.. తప్ప మరో ఆలోచన చేయడానికి సహసించ లేదు.

గుట్టుగా ‘బహిరంగ’ విచారణ: విచారణకు హాజరైన 20 మంది ఉద్యోగులు సమాచారం పొక్కకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మహాబూబ్‌ నగర్‌ జిల్లా పరిషత్తు పరిధిలోని కారుణ్య నియామకాల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయన్న నిజాలతో సిబీసీఐడీ అధికారులు విచారణ చేపట్టారు. అర్హత లేకున్నా నకిలీ ధ్రువపత్రాలతో టైపిస్టు, జూనియర్‌ అసిస్టెంట్‌ ఉద్యోగాలు పొందినట్లు అభియోగం. దీనిపై సోమవారం నుంచి గురువారం వరకు హైదరాబాద్‌ నుంచి సిబీసీఐడీ అధికారుల బృందం మహాబూబ్‌ నగర్‌ జిల్లా పరిషత్తు కార్యాలయానికి వచ్చి విచారణకు చేశారు. ఈ వ్యవహారం బయట రాకుండా జిల్లా పరిషత్తు సిబ్బంది, ఉద్యోగులు జాగ్రత్తపడ్డారు. ఇదివరకు ఈ వ్యవహారంపై విజిలెన్స్‌ ఎన్ఫోర్స్మెంట్‌ శాఖకు ఫిర్యాదు అందగా వారు విచారించారు. అభియోగాలు ఎదుర్కొంటున్న 20 మంది ఉద్యోగులపై ఇంతవరకు ఎలాంటి చర్యలు లేకపోవడంతో తాజాగా సిబీసీఐడీకి ఫిర్యాదు అందడంతో వారు సోమవారం నుంచి గురువారం వరకు జడ్పీలో విచారించారు.

గతంలో విజిలెన్స్‌ విచారణ : కారుణ్య నియామకాల్లో అక్రమాలు జరిగాయన్నది ప్రధాన ఆరోపణ. జిల్లా పరిషత్తు పరిధిలో వివిధ మండలాలు, జడ్పీలో పనిచేస్తున్న కొందరు ఉద్యోగులు జూనియర్‌ అసిస్టెంట్‌, టైపిస్టుల నియామకాల్లో కావాల్సిన అర్హత ధ్రువపత్రాలను అర్హత లేకున్నా పొంది ఉద్యోగాలు చేజిక్కించుకున్నారన్నది ఆరోపణ. వీరే కాకుండా కొందరు పదోన్నతులు పొందేందుకు సైతం నకిలీ ధ్రువపత్రాలు సమర్పించినట్లు ఆరోపణలున్నాయి. 2015లో దీనిపై విజిలెన్స్‌ ఎన్ఫోర్స్మెంట్‌ హైదరాబాద్‌ కార్యాలయంలో ఫిర్యాదు చేయగా వారు 2017 నవంబరు 29, 30 తేదీల్లో మరో మారు విచారించారు. దానికి సంబంధించి తుది నివేదిక వచ్చినట్లు సమాచారం. అయితే ఆయా ఉద్యోగులు ఇంకా ఉద్యోగాల్లోనే కొనసాగుతుండటంతో సీఐడీకి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. దీనిపై విచారణ కొనసాగుతోంది. విజిలెన్స్‌ విచారణకు సహకరించని వైనం :తప్పుడు ధ్రువపత్రాలతో ఉద్యోగాలు పొందిన వారి విషయంలో కొందరు పైరవీకారులు అక్రమార్కులకు వత్తాసు పలికినట్లు తెలిసింది. వీరిలో కొందరు జడ్పీ ఉద్యోగులు ఉండటం విశేషం. గతంలో సదరు ఉద్యోగులు పైరవీకారుల మద్దతుతో విజిలెన్స్‌ విచారణకు సహకరించలేదు. దీంతో వారు జిల్లా పరిషత్తు ఉన్నతాధికారుల దృష్టికి ఈ వ్యవహారాన్ని తీసుకెళ్లారు. అప్పట్లో జిల్లాపరిషత్తు పరిధిలోని అన్ని మండలాల్లో పనిచేస్తున్న సిబ్బంది ఉద్యోగుల ధ్రువపత్రాలను సైతం విజిలెన్స్‌ ఎన్ఫోర్స్మెంట్కు సమర్పించారు. అయితే తాజాగా సీఐడీ ఇన్స్పెక్టర్‌ స్థాయి అధికారులు జిల్లా పరిషత్తులోని ఓ విభాగంలో ఆ 20 మందితో వివరాలు సేకరించారు. ఆ ధ్రువపత్రాలు ఎక్కడి నుంచి పొందారు. వాటిపై హాల్‌ టిక్కెట్‌ నంబర్లు, వాటిపై ఉన్న గుర్తులు, పరీక్షలకు వీరు హాజరయ్యారా? లేక ఇతరులతో రాయించారా లేక దొంగ ధ్రువపత్రాలు ఏ విధంగా సమర్పించారనే సమాచారం రాబట్టారు. మంగళవారం సైతం విచారించే అవకాశం ఉంది

ఎంత నొక్కారు: ఒక్క జిల్లాలో..ఈ ఒక్క శాఖలోనే గత పదేళ్ళుగా 10 కోట్లు జీతం రూపంలో నొక్కారు. అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని శాఖలలో ఈ నకిలీ ఉద్యోగులు.. సుమారు వేయి కోట్లపై కొల్లగొట్టారని తెలుస్తోంది. మున్సిపల్‌ శాఖలో ఈ కారుణ్య నియామకాలు ఎక్కువగా జరిగిన నట్లు నిఘా వర్గాలు ‘ఆదాబ్‌ హైదరాబాద్‌, ప్రత్యేక ప్రతినిధి’కి చెప్పాయి.

ముందస్తు సమాచారం లేదు : వసంతకుమారి, జడ్పీ సిఇఓ ఎన్నికల సంఘం సమావేశానికి హైదరాబాద్కు వెళ్లాను. జడ్పీకి వచ్చామని సిబీసీఐడీ అధికారుల నుంచి ఫోను వస్తే అక్కడి సిబ్బందిని కలవమని చెప్పాను. నేను రెండు నెలల క్రితమే వచ్చాను. రాగానే ఎన్నికల విధుల్లో నిమగ్నమయ్యాను. ఇక్కడి విజిలెన్స్‌, సీఐడీ కేసుల గురించి నాకు అవగాహన లేదు. దీనిపై క్షుణ్ణంగా పరిశీలిస్తా. దీనిపై అన్ని వివరాలు తెలుసుకొని సిబీసీఐడీ విచారణకు సహకరిస్తాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here