Featuredజాతీయ వార్తలుప్రాంతీయ వార్తలురాజకీయ వార్తలుస్టేట్ న్యూస్

ఆ సీసాల్లోవి మురుగునీరే..!

గవర్నర్‌తో సహా ఐఏఎస్‌, ఐపిఎస్‌ అధికారులకు పార్సిల్స్‌

  • నీరేనని తేల్చిన ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ సిబ్బంది
  • ఊపిరిపీల్చుకున్న పోలీసులు

సికింద్రాబాద్‌ లోని హెడ్‌ పోస్టాఫీస్‌ లో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. పోస్టాఫీస్‌ కి వచ్చిన కొన్ని పార్సిల్స్‌ సిబ్బందిని వణికించాయి. ఉరుకులు పరుగులు పెట్టించాయి. రంగంలోకి దిగిన పోలీసులకు కూడా చెమట్లు పట్టించాయి. కారణం… ఆ పార్సిల్స్‌ నుంచి తీవ్రమైన దుర్వాసన రావడమే. పైగా వాటిని పార్సిల్‌ చేయాల్సిన అడ్రస్‌ లు చూసి షాక్‌ తిన్నారు. గవర్నర్‌ నరసింహన్‌, సీఎం కేసీఆర్‌, టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, మాజీ ఎంపీ కవిత, డీజీపీ మహేందర్‌ రెడ్డి, హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌, ఐదుగురు డీసీపీలు… ఇలా అంతా ప్రముఖులే. వారికి ఈ పారిల్స్‌ పంపాలని వాటిపై అడ్రస్‌ లు ఉన్నాయి. ప్రముఖుల పేర్లు, పార్సిల్స్‌ నుంచి భయంకరమైన దుర్వాసన.. దీంతో పోస్టాఫీస్‌ సిబ్బంది హడలెత్తిపోయారు. అవి పేలుడు పద్దార్ధాలు, కెమికల్‌ బాంబులేమోనని భయపడ్డారు. వెంటనే పార్సిల్స్‌ ని ఓపెన్‌ చేశారు. పెట్టెల్ని తెరిచి చూస్తే సీసాలు కనిపించాయి. వాటిల్లో కెమికల్‌ ని పోలిన లిక్విడ్‌ ఉంది. ఒక్కో సీసాలో లీటరున్నర దాకా ఉంటుంది. దీంతో రసాయన బాంబులేమోనన్న అనుమానంతో అధికారులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు సీసాలను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ కి పంపించారు. అక్కడ వాటిని పరీక్షించారు. సీసాలో ఉన్నది కెమికల్‌ బాంబులు కాదని ల్యాబ్‌ నిర్ధారించింది. పరిశ్రమల్లోని రసాయన వ్యర్థాలుగా క్లూస్‌ బృందం గుర్తించింది. దీంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. అసలు ఈ పార్సిల్స్‌ ఎవరు పంపించారు? ఇలా ఎందుకు చేశారు? అనేది ఇప్పుడు హాట్‌ టాపిక్‌ గా మారింది. పెట్టెల్లో సీసాలతోపాటు లేఖలు కూడా కనిపించాయి. ఆ లేఖల్లో క్లారిటీ లేకపోయినా.. ‘కలుషిత నీళ్లు తాగి బతుకుతున్నాం…” అని తెలియజేయాలన్నది వారి ఉద్దేశంగా కనిపిస్తోందని పోలీసులు చెబుతున్నారు. శనివారం రోజున ఉస్మానియా యూనివర్సిటీ పోస్టాఫీసు నుంచి ఈ పార్సిల్స్‌ వచ్చాయి. సోమవారం సికింద్రాబాద్‌ పోస్టాఫీస్‌ కి చేరాయి. ఉస్మానియా వర్సిటీ పరిసర ప్రాంతాల్లో కలుషిత నీటి సమస్య పరిష్కారం కాకపోవడంతో విసుగుచెందిన వారు ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ఈ నిరసన పద్ధతి ఎంచుకొని ఉంటారని పోలీస్‌ అధికారులు భావిస్తున్నారు. విద్యార్థులు ఎవరైనా ఇలా చేసి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. పోస్టాఫీస్‌ అధికారుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. ఈ పార్సిళ్లు పంపిన వారిని గుర్తించే పనిలో ఉన్నారు. పార్సిళ్ల ఘటన దుమారం రేపింది. అధికార వర్గాల్లో చర్చకు దారితీసింది. పోస్టాఫీసుల్లో భద్రతా ప్రమాణాలపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పోస్టాఫీసుల్లో లోపాలను ఈ ఘటన వెలుగులోకి తెచ్చింది. సికింద్రాబాద్‌ హెడ్‌ పోస్టాఫీస్‌ తో పాటు స్థానికంగా ఉండే సబ్‌ పోస్టాఫీసుల్లో మెటల్‌ డిటెక్టర్లు లేవు. పోస్టాఫీస్‌ చట్టాలు, నిబంధనల ప్రకారం పోస్టు ద్వారా పేలుడు పదార్థాలు, నిషేధిత వస్తువులను పంపరాదు. తేడా వస్తే పంపినవారిపైనే కాదు సిబ్బందిపైనా చర్యలుంటాయి. తాజా ఘటనతో అన్ని పోస్టాఫీసుల్లో ముఖ్యంగా పార్సిల్‌ బుకింగ్‌ కార్యాలయాల్లో మెటల్‌ డిటెక్టర్లు ఉండేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందనే విషయం స్పష్టమైంది. ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకుంటారో లేదో చూడాలి. భవిష్యత్తులో ఇలాంటివి రిపీట్‌ అవకుండా చూసుకోవాల్సిన బాధ్యత వారిపై ఉంది. ఇప్పుడు పంపిన పార్సిల్స్‌ లో కెమికల్‌ నీళ్లు మాత్రమే ఉన్నాయి కాబట్టి సరిపోయింది. అదే పేలుడు పదార్దాలో మరొకటో ఉండి ఉంటే.. ఊహించని నష్టం జరిగి ఉండేదని పోస్టాఫీస్‌ సిబ్బంది భయపడుతున్నారు.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close