ఈ సారి ప్రపంచకప్‌ భారత్‌కే : సచిన్‌

0

న్యూఢీల్లీ : క్రికెట్‌ విశ్లేషకులంతా ఈ సారి ప్రపంచకప్‌లో ఫేవరెట్లుగా ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా జట్ల పేర్లను చెప్తుంటే భారత లెంజడరీ బ్యాట్స్‌మన్‌, మాస్టర్‌ బ్లాస్టర్‌ మాత్రం మరోలా స్పందించాడు. ఈ సారి ప్రపంచకప్‌ భారత్‌కే రాబోతోందని జోస్యం చెప్పాడు. ముంబయిలోని ఎంఐజీ మైదానంలో సచిన్‌ పేరుతో పెవిలియన్‌ ఎండ్‌ను ప్రారంభించిన సందర్భంగా మాస్టర్‌ బ్లాస్టర్‌ మాట్లాడాడు. ‘మే 30 నుంచి జరిగే ఈ ప్రపంచకప్‌ పూర్తి వేసవిలో జరగనుంది. ఎండల ప్రభావానికి పిచ్‌లు ఫ్లాట్‌గా మారుతూ ఉంటాయి. అలాంటి పిచ్‌పై బ్యాట్స్‌మెన్‌ సౌకర్యంగా బ్యాటింగ్‌ చేసే అవకాశం ఉంటుంది. గతంలో జరిగిన ఛాంపియన్స్‌ ట్రోఫీలో కూడా ఇలాంటి పరిస్థితే ఉంది. పైగా ఇంగ్లాండ్‌లో ఉండే పిచ్‌లన్నీ ఫ్లాట్‌గా ఉంటాయి. కాబట్టి బ్యాట్స్‌మెన్‌కు అనుకూలించే అవకాశం ఉంది. అయితే, ఇంగ్లాండ్‌ వాతావరణంలో భారీగా మార్పులు చోటు చేసుకుంటే తప్ప పిచ్‌పై ప్రభావం ఉండదు.’ ‘ఇక బ్యాటింగ్‌ విషయంలో భారత బ్యాట్స్‌మెన్‌ అంతా మంచి ఫామ్‌లో ఉన్నారు. కోహ్లీ, కేఎల్‌ రాహుల్‌, హార్దిక్‌పాండ్యతో పాటు ఇతర ఆటగాళ్లు కూడా మంచి లయతో ఆడుతున్నారు. వీళ్లంతా ఐపీఎల్‌లో బాగా రాణిస్తున్నారు. ఒక క్రికెటర్‌ ఏ ఫార్మాట్‌లో రాణించినా అతనిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆ తర్వాత ఫార్మాట్‌ మారినా పరిస్థితులకు అనుగుణంగా ఆడగలరు. భారత జట్టులో ఆటగాళ్లంతా సరిపడా క్రికెట్‌ ఆడారు. మెరుగుపడాల్సిన అంశాలను ఇప్పటికే తెలుసుకొని ఉంటారు. కాబట్టి ఈసారి ప్రపంచకప్‌లో భారత్‌ ఫేవరెట్‌ జట్టు అనడంలో సందేహం లేదు’ అని సచిన్‌ పేర్కొన్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here