Featuredస్టేట్ న్యూస్

వారికి లేదు.. వీరికే..

  • ఉద్యోగులకు పెరగనున్న జీతాలు..
  • ఆర్టీసీకి మాత్రం అంతే సంగతులు..
  • ఉన్నవాళ్లను కాపాడుకునే ఆలోచన.
  • తెరపైకి ప్రభుత్వం కొత్త వ్యూహం..

ఉన్నవారికే పరమాన్నం.. లేనివారికి ఖాళీ కంచెం అన్నట్లుగా ఉంది ప్రభుత్వం పనితీరు.. ఆర్టీసీని కాపాడాలని, తమ జీతాలను పెంచాలని ఆర్టీసీ ఉద్యోగులు అలుపెరగకుండా నిరతరం సమ్మె చేస్తూనే ఉన్నారు. కొంతమంది కార్మికులు అత్మహత్యలకు పాల్పడి ప్రాణాలను సైతం తీసుకున్నారు. మొన్న జరిగిన ట్యాంక్‌బండ్‌ ముట్టడిలో ఎందరో ఆర్టీసీ ఉద్యోగులు గాయాలపాలయ్యారు. ఆడ, మగా అనే తేడా లేకుండా పోలీసులు లాఠీలతో విరుచుకుపడ్డారు. చిన్న ఉద్యోగులు, చిన్న జీతాలతో కడుపులు ఎండుతున్న వారి చేస్తున్న నిరంతర పోరాటానికి ప్రభుత్వమే దిగివచ్చి వారితో చర్చలు జరపాలి. కాని వారి సమ్మెను ప్రభుత్వం అసలు పరిగణనలోకే తీసుకోవడం లేదు. ప్రభుత్వానికి సంబంధం లేనట్లుగానే వ్యవహరిస్తోంది. ఇంచుమించుగా నలబై రోజులకు చేరుకున్న ఆర్టీసీ ఉద్యోగుల డిమాండ్లకు డబ్బులు లేవని, నిధులు లేవని చెబుతున్నా ప్రభుత్వం ఇతర ఉద్యోగాలకు మాత్రం జీతాలు పెంచే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆకలితో ఉన్నవారికి కనీసం నాలుగు మెతుకులు పెట్టడం లేదని, ఉన్నవాళ్లకు బిర్యానీ పెడుతున్నట్లుగా ఉంది మన ప్రభుత్వం పనితీరు. ఆర్టీసీతో పాటుగా మిగతా ఉద్యోగ సంఘాలు కూడా సమ్మె దారి పడుతే మొదటికే మోసం వస్తుందనే ఆలోచనతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అర్ధమవుతోంది. ఇప్పటికే ఆర్థికమాంద్యంతో తల్లడిల్లుతున్న రాష్ట్రప్రభుత్వానికి ఉద్యోగులకు వేతనాలు పెంచుతే ప్రభుత్వంపై భారం ఎంత పడుతుందో సమాచారం సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తేన్న ఆర్టీసీ కార్మికులు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ ఎంత చెప్పినా మాట వినకుండా ముందుకే నడుస్తున్నారు. వీరి దారిన మరికొన్ని ఉద్యోగసంఘాలు వెళితే లేనిపోని ఇబ్బందులు ఎదురవుతాయి. అందుకే ఉన్నవారిని కాపాడుకునే ప్రయత్నాల్లో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వివిధ ప్రభుత్వ సంఘాలు ఆర్టీసీకి మద్దతు తెలుపడమే కాకుండా వారితో పాటుగా సమ్మెలు పాల్గంటున్నారు. ఆర్టీసీ ఉద్యోగులే కాకుండా మిగతా ప్రభుత్వ శాఖల ఉద్యోగులు కూడా ప్రభుత్వంపై గుర్రుగా ఉన్నా బయటపడడం లేదు. తగిన సమయాన్ని బట్టి వారు కూడా సమ్మె బాటలో ఉన్నట్లు ప్రభుత్వానికి సమాచారం వచ్చినట్లు తెలుస్తోంది. అందుకే ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు వేతన సవరణపై దృష్టిసారించినట్లు సమాచారం. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లకు ససేమిరా అంటున్న ప్రభుత్వం, వారికి జీతాలకు పెంచడానికి లేని డబ్బులు మిగతా శాఖల ఉద్యోగులకు ఏలా వస్తున్నాయనే ప్రచారం జరుగుతోంది.. ప్రభుత్వానికి ఒకరు మంచి, ఒకరు చెడు అనే ఆలోచన రావద్దని, అందరిని సమానంగా చూడాలని ఆర్టీసీ సంఘాలు అంటున్నారు. మరీ ప్రభుత్వం వేతనాల పెంపుపై అందరికి న్యాయం చేస్తుందా.. లేదా కొందరికి జీతాలు పెంచుతుందా అనేదీ అర్థం కాని ప్రశ్నగా మారిపోయింది..

హైదరాబాద్‌ ఆదాబ్‌ హైదరాబాద్‌..

జీతాలు సరిపోవడం లేదని, జీతాలు పెంచాలని ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని గత నలభై రోజుల నుంచి ఆర్టీసీ కార్మికులు నిరవధిక సమ్మె చేస్తున్నారు. ప్రభుత్వం ఎంతగా ఆర్టీసీని సమ్మెను అణిచివేయాని ప్రయత్నం చేస్తున్న సమ్మె మాత్రం నిరంతరం కొనసాగుతూనే ఉంది. ఆర్టీసీ సమ్మె రాష్ట్ర ప్రభుత్వం చేయిదాటిపోయినట్లుగానే తెలుస్తోంది. ఇప్పుడు తెలంగాణ అధినేత కెసిఆర్‌ ఆర్టీసీ సమ్మెపై, వారి డిమాండ్లపై వెనక్కి తగ్గే పరిస్థితుల్లో లేనట్టుగానే ఉన్నారు. సమ్మెను పరిష్కరించే ఆలోచన కూడా కనిపించడం లేదు. ఐతే ఆర్టీసీ ఉద్యోగులకు పరోక్ష మద్దతునిస్తూ తెలంగాణ ప్రభుత్వంపై ఉడికిపోతున్న ప్రభుత్వ ఉద్యోగులను కూల్‌ చేసేందుకు కెసిఆర్‌ నడుం బిగించినట్లు తెలుస్తోంది. ఆర్థిక మాంద్యం వెంటాడుతున్న రాష్ట్రం అప్పుల కుప్పలతో కుదేలవుతున్నా కూడా మిగతా ప్రభుత్వ ఉద్యోగులు సమ్మెకు వెళితే కొంపలు అంటుకుంటాయి. అందుకే ముందుగానే పీఆర్పీ ప్రకటించేందుకు సిద్దమవుతున్నారు. పీఆర్సీతో ఉద్యోగులు జీతాలు పెరగడంతోపాటు వారికి వచ్చే ఫిట్‌మెంట్‌ కూడా ప్రకటించనున్నారనే సమాచారం వినిపిస్తోంది. దీంతో ఆర్టీసీ కార్మికులతో పోరుబాట పట్టాలని ఆలోచిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులను ఇలా జీతాలు పెంచి సంతృప్తి పరచడానికి కెసిఆర్‌ ఆలోచనగా చెపుతున్నారు. ఇప్పటికే ఆర్టీసీ మంటలు రాష్ట్రంలో చల్లారడకుండా మండుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఎంతోకాలంగా రగిలిపోతున్న ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఆవేశంతో సమ్మెబాట పడుతే ప్రభుత్వం పనులన్నీ స్తంభింపచేయడమే కాకుండా ప్రజల నుంచి చెడ్డపేరు వచ్చే అవకాశమే ఎక్కువగా ఉంటుంది. అందుకే కెసిఆర్‌ వ్యూహత్మకంగా ప్రభుత్వ ఉద్యోగుల్లో అసంతృప్తిని చల్లార్చేందుకు పీఆర్సీని తెరపైకి తెస్తున్నారని ప్రచారం జరుగుతోంది.

ఉద్యోగులు కొత్త వేతన సవరణపై కసరత్తు..

తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగుల కొత్త వేతన సవరణపై ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. పది నుంచి పన్నెండు రోజుల వ్యవధిలో పీఆర్సీకి సంబంధించిన నివేదికను సమర్పించాలని కోరుతూ వేతన సవరణ సంఘానికి ముఖ్యమంత్రి కెసిఆర్‌ ఆదేశాలు జారీ చేశారని సమాచారం. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నలభై మూడు శాతం ఫిట్‌మెంట్‌తో 2015 ఫిబ్రవరి ఐదున వేతన సవరణను సిఎం కెసిఆర్‌ ఆమోదించారు. ఇది 2019 జూన్‌ 30తో ముగిసింది. జూలై ఒకటి నుంచి వేతన సవరణ జరగాల్సి ఉంది. దీనికి సంబంధించి గత సంవత్సరం మేలో పీఆర్సీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి బిస్వాల్‌ అధ్యక్షతన మరో ఇద్దరు రిటైర్డ్‌ ఐఏఎస్‌లను నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. ఐతే దీనికి సంబంధించిన నివేదిక ఇప్పటికి ప్రభుత్వానికి అందలేదు. ఇదిలా ఉంటే ఐఆర్‌ కోసం ఉద్యోగ సంఘాలు కోరుతుంటే ఇదేమీ కాదంటూ కొత్త వేతన సవరణకు ముఖ్యమంత్రి సానుకూలంగా ఉన్నట్లు చెపుతున్నారు. రాష్ట్రంలోని 3.5లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, రెండు లక్షల మంది పింఛన్‌దారులు ఉన్నారు. వీరందరికి జీతాలు పెంచుతే ప్రభుత్వంపై ఎంత భారం పడుతుందనే విషయం మీద నివేదికను సిద్దం చేస్తున్నట్లు సమాచారం. ఒక వైపు ఆర్టీసీ కార్మికుల జీతాలకు చెల్లించాల్సిన డబ్బులు తమ వద్ద లేవని చెపుతున్న ముఖ్యమంత్రి కెసిఆర్‌ అదే సమయంలో ప్రభుత్వ ఉద్యోగుల జీతాల పెంపు దిశగా అడుగులు వేయడం చూస్తుంటే కెసిఆర్‌ ప్రభుత్వం కొత్త వ్యూహాన్ని అమలు చేస్తుందా అనే అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగుల్లో ప్రభుత్వం మీద పెరుగుతున్న వ్యతిరేకతను ఇలా అడ్డుకోవాలని నిర్ణయంగా తెలుస్తోంది. అన్ని వర్గాల్ని దూరం చేసుకునే దాని కన్నా, విభజించి పాలించు తరహాలో కొన్ని వర్గాలు ప్రభుత్వం పట్ల సానుకూలత వ్యక్తం చేసేలా కొత్త వ్యూహాన్ని అవలంభిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఒకరికి లాభం, మరొకరికి నష్టం జరిగే ప్రభుత్వ వ్యూహాన్ని ఉద్యోగసంఘాలు ఏలా స్పందిస్తాయో చూడాల్సిందే..

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close