అంచనాలకు అందని వ్యూహాలు

0

గెలుపే లక్ష్యంగా సాగుతున్న కేసీఆర్‌

సిట్టింగ్‌ లకే అవకాశాలంటూ సంకేతాలు..

రాజకీయం అంటేనే ఎవ్వరికి ఏమి అర్థం కాదు. మన పక్కన నవ్వుతూ ఉంటూ, నవ్వుతూ వెన్నుపోటు పొడుస్తారు. అందుకే రాజకీయంలో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండనే ఉండరు. అంతా మనవాళ్లే అనుకుంటారు. చివరికి కొంప మునిగేవరకు తెలియదు. మన వాళ్లే మనం అనుకున్న వాళ్ళె నాశనం చేసారనే విషయం తెలియదు. రాజకీయాలను అవపోసాన పట్టడంలో కెసిఆర్‌ అందెవేసిన చెయ్యి. ప్రత్యర్థులు ఊహించని విధంగా తన పార్టీ నాయకులు సైతం ఉలిక్కిపడేలా రాజకీయ చదరంగంలో ఆయన ఆడే ఆట వేరు. ఆయన తర్వాతనే ఇంకెవరన్నా అని చెప్పొచ్చు. అందుకే తగ్గట్లుగానే ఇప్పటికే పలుమార్లు తనదైన శైలిలో వ్యూహాలను రచించారు. తన వేసిన వ్యూహాలను దిగ్విజయంగా అమలు చేయటమే కాకుండా తాను కోరుకున్న ఫలితాలను తెచ్చుకున్నారు తెరాస అధినేత. ముందు జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ, రాబోయే పార్లమెంట్‌ ఎన్నికల్లోనూ ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వకుండా విజయాన్ని అందుకునేలా ప్రణాళికలు రచిస్తున్నాడు. ప్రతిపక్షాలకు పోటీ మాట దెవుడెరుగు ఉన్నవారిని కాపాడుకోవడమే ఇప్పుడు వారికి గగనంగా మారిపోయింది

హైదరాబాద్‌ ఆదాబ్‌ హైదరాబాద్‌:

తెలంగాణలో జరిగిన ముందస్తు ఎన్నికల్లో ఎవరి అంచనాలకు ఊహించని విధంగా విజయం సాధించి రెండవసారి అధికారంలోకి వచ్చింది తెరాస. తాను కోరుకున్న ఫలితాల్ని తెచ్చుకోని విజయపతాకం ఎగరవేశారు కెసిఆర్‌. సిట్టింగ్‌ ఎమ్మెల్యేలను ఒకరిద్దరిని తప్పించి యధాతథంగా మిగిలిన వారిని ఎన్నికల బరిలోకి దించటం పెద్ద సాహసంగానే చెప్పాలి. అధికారపార్టీ విూద ఉండే వ్యతిరేకత.. ఎమ్మెల్యేల పనితీరుపై నియోజకవర్గంలో ఉండే అసంతృప్తులను పట్టించుకోకుండా అభ్యర్థుల్ని ప్రకటించటం అంటే మాటలు కాదనే విషయంపై అందరూ చర్చించుకున్నారు. ప్రభుత్వాన్ని రద్దు చేయాలని గవర్నర్‌ ను కోరిన గంటల వ్యవధిలో కొద్దిమంది మినహా మిగిలిన అభ్యర్థుల జాబితాను ప్రకటించటం ద్వారా సంచలనానికి తెర తీశారు. సిట్టింగుల విూద తీవ్ర వ్యతిరేకత ఉందన్న అభిప్రాయానికి భిన్నంగా, తనను, తన చేసిన అభివృద్దిని చూసి తెలంగాణ ప్రజలు పట్టం కడతారనే విషయాన్ని చెప్పిన కేసీఆర్‌ మాటల్ని చాలా మంది నమ్మలేదు కాదు కదా ముందస్తు పోయిందీ మాత్రం మునగడానికే అన్నారు. కాని ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాక మాత్రం అచ్చు గుద్దినట్లుగా కేసీఆర్‌ చెప్పినట్లే ఫలితాలు ఉండటం పలువురు రాజకీయ విశ్లేషకుల్ని సైతం దిమ్మ తిరిగిపోయేలా చేసింది.

ప్రజల ఆలోచనలకు అనుగుణంగా అడుగులు

ప్రజల మైండ్‌ సెట్‌ ను అతి జాగ్రత్తగా గుర్తించటం, వారి మనసుల్ని కేసీఆర్‌ అర్థంచేసుకున్నంత బాగా ఇటీవల కాలంలో ఏ అధినేత అర్థం చేసుకోలేదన్న మాట వినిపిస్తోంది. ఒక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నెలల తరబడి మంత్రుల్ని ఏర్పాటు చేయకుండా ఉండటం సాధ్యం కాదు. తీవ్రమైన ఒత్తిడి, పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతాయి. కాని కేసీఆర్‌ విషయంలో అలాంటివేవిూ చోటు చేసుకోకపోగా ఆయన నిర్ణయం కోసం ఎదురుచూసిన పరిస్థితి. చివరకు విూడియాలోనూ, మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయకపోవటంపై ఎవరూ కలాన్ని విదిల్చి మరీ రాసింది లేదు. అంతలా కంట్రోల్‌ చేసే సత్తా ఉన్న కేసీఆర్‌ కున్న మరో గుణం, ఎప్పటికప్పుడు తన వ్యూహాల్ని మార్చేసుకోవటం. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అమలు చేసిన ముందస్తు అభ్యర్థుల ప్రకటనకు భిన్నంగా తాజా లోక్‌ సభ ఎన్నికల విషయంలో వ్యవహరించాలన్న ఆలోచనలో ఆయన ఉన్నట్లు చెబుతున్నారు. విపక్షాలు చతికిలపడిపోయి, మళ్లీ లేవలేని రీతిలో ఉన్నవేళ, లోక్‌ సభ ఎన్నికల్లో పోటీ చేసే పార్టీ అభ్యర్థుల విషయంలో తాపీగా ప్రకటన చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. ముందస్తుగా అభ్యర్థుల్ని ప్రకటించిన విధానానికి భిన్నంగా ఈసారి వ్యవహరించాలని ఆయన డిసైడ్‌ చేసినట్లుగా తెలుస్తోంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే తొలుత అసెంబ్లీ ఎన్నికల వేళ అభ్యర్థుల్ని ప్రకటించిన బాటలోనే పయనించాలని భావించినా, తర్వాత ఆయన తన వ్యూహాన్ని మార్చుకున్నట్లుగా చెబుతున్నారు. రాష్ట్రంలోని 17 లోక్‌ సభ స్థానాల్లో 16 స్థానాల్లో విజయం సాధించాలన్న లక్ష్యాన్ని కేసీఆర్‌ పెట్టుకున్నారు. తనకు అత్యంత ఆఫ్తుడైన మిత్రుడు మజ్లిస్‌ అధినేత అసదుద్దీన్‌ ఓవైసీ బరిలోకి దిగే హైదరాబాద్‌ లోక్‌ సభ స్థానం నుంచి తన పార్టీ తరఫున అభ్యర్థిని బరిలోకి దింపకూడదని కేసీఆర్‌ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ కారణంతోనే ఆయన టార్గెట్‌ 16 ఎంపీలన్న నినాదాన్నే తరచూ వినిపిస్తున్నారు. లోక్‌ సభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులుగా దాదాపుగా సిట్టింగులకే మళ్లీ పార్టీ టికెట్లు ఇవ్వనున్నట్లు చెబుతున్నారు. ఎంపీలుగా వ్యవహరిస్తూ ఎమ్మెల్యేలుగా గెలిచినా మల్లారెడ్డి.. బాల్క సుమన్‌ స్థానాలతో పాటు.. ఒకటి రెండు నియోజకవర్గాలు తప్పించి మిగిలిన అన్ని చోట్ల సిట్టింగులకే అవకాశం ఉంది. ఈ ఎన్నికలు సైతం అభ్యర్థుల ఆధారంగా కాకుండా.. తనను చూసి ప్రజలు ఓట్లు వేయాలన్న నినాదాన్నే వినిపించాలన్న ఆలోచనలో కేసీఆర్‌ ఉన్నట్లు చెబుతున్నారు. కేంద్రం మెడలు వంచాలంటే 16 సీట్లు ఉండాల్సిందేనన్న మాట మంత్రంగా ప్రజల్లోకి తీసుకెళ్లి తాను కోరుకున్నట్లుగా తుది ఫలితం ఉండాలన్న యోచలో కేసీఆర్‌ ఉన్నారు. మరి ఆయన మాటను తెలంగాణ ఓటర్లు ఏ మేరకు స్వాగతిస్తారో చూడాల్సిందే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here