Featuredస్టేట్ న్యూస్

పాతవాటికే పైసల్లేవు.. కొత్త నిర్మాణాలు లేవు..

  • ప్రస్తుతానికి అన్నీ బంద్‌..
  • నిలిపివేసిన కొత్త ప్రాజెక్టులు..
  • ప్రభుత్వంపై ఆర్థికమాంద్యం..
  • కొన్ని రోజులు ఎక్కడివక్కడే..

పాలనలో పైసల్లేక కొట్టుమిట్టాడుతున్నారు.. రూపాయి దొరకక తల్లడిల్లుతున్నట్లు చెపుతున్నారు.. కోట్ల రూపాయలతో తెలంగాణలో పలు ప్రాజెక్టులను ప్రారంభించారు. కెసిఆర్‌ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుకే వేల కోట్ల రూపాయలు ఖర్చయ్యాయి. వాటి పనులే ఇంకా పూర్తి కాలేదు. అఉన్న నిధులన్నీ దానికే పెట్టేసరికి ప్రభుత్వంలోని పలు పథకాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులకు, ఔట్‌సోర్సింగ్‌ వారికి జీతాలు కూడా ఇవ్వని పరిస్థితిలో తెలంగాణ ప్రభుత్వం ఉందనే ఆరోపణలు ఉన్నాయి. అందుకే కొన్ని రోజులు కొత్త పథకాలు, కొత్త ప్రాజెక్టులు, కొత్త పనులు ప్రారంభించాలని, అమలు చేయాలనే ఆలోచన చేయట్లేదు. కొత్త పనులు, ప్రాజెక్టులు చేపట్టరాదని పలు శాఖలకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు వెల్లినట్లు తెలుస్తోంది. ఆర్థిక మాంద్యం ప్రభుత్వంపై ఘోరంగా ఉందని, ప్రభుత్వం కొలుకోలేని స్థితిలో ఉందనే విషయం అందరికి తెలిసిందే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఆంధ్రప్రదేశ్‌ కంటే తెలంగాణ రాష్ట్రమే మిగులు బడ్జెట్‌గా ఉంది. నిధులకు కొదవ లేకుండా ఉన్న తెలంగాణ రాష్ట్రం అందరికి సమన్యాయం జరుగుతుందనే ఆలోచనలో ఉండేవారు. కాని తీరా ఐదు సంవత్సరాల పాలన ముగిసిందో లేదో తెలియదు కాని ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం అప్పుల కుంపటిగానే మిగిలిపోయింది. నిధులు లేక, పథకాలు అమలు కాక, కొన్ని ప్రభుత్వం శాఖలలోని ప్రభుత్వ, ప్రయివేట్‌ ఉద్యోగులకు జీతాలు కూడా అందించలేని పరిస్థితిలో ఉందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ సైతం పార్లమెంట్‌ సమావేశాల్లో తెలంగాణ ప్రభుత్వం అప్పుల కుంపటిగా మారిపోయిందని తెలిపారు. ఆర్థికంగా తెలంగాణలో ఎన్నో అవకాశాలు ఉన్నా కాని నూతన తెలంగాణ అప్పుల పాలు కావడానికి ప్రధాన కారణం, వేల కోట్ల ప్రాజెక్టులు, అమలు కాని హామీలుగానే చెపుతున్నారు. అందుకే తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం కూడా ఆర్ధికంగా చాలా ఇబ్బందులున్నాయని, కొత్త పనులకు, కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే ఆలోచన చేసేదీ లేదని ఖరాఖండిగా చెప్పినట్లు సమాచారం. కేంద్రం నుంచి కూడా అప్పులు వచ్చే పరిస్థితి కూడా లేకపోవడంతో కొన్ని రోజులు మామూలుగా ఉండడం తప్ప చేసేదేమి లేదంటున్నారు ఆర్థిక నిపుణులు..

హైదరాబాద్‌ ఆదాబ్‌ హైదరాబాద్‌…

రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మారుస్తూ ప్రజలు కలలుగన్న రాష్ట్రాన్ని అందిస్తామని చెప్పిన తెలంగాణ పాలకులు కొంత కాలంలోనే అప్పుల తెలంగాణగా మార్చివేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పలు పథకాలు నిధులు లేక మధ్యలోనే నీరుగారిపోతున్నాయి. పథకాలు మంజూరైనా ఎంతోమంది లబ్దిదారులు వారికొచ్చే లబ్దికోసం నెలల నుంచి ఎదురుచూస్తూనే ఉన్నారు. స్థానిక నాయకులను, అధికారులను ఎప్పుడు అడిగినా రేపు మాపంటూ చెపుతున్నారు కాని ఇప్పటి వరకు పూర్తి హామీలు ఇచ్చిన వారు లేరు. ప్రభుత్వ ఖజానా అంతా కాసులు లేక ఖాళీగా ఉందని ప్రచారం సాగుతూనే ఉంది. ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న పరిస్ధితి చూస్తే ఆ ప్రచారం నిజమనే తేలిపోతుంది.

రాష్ట్రాన్ని వేధిస్తున్న ఆర్థికమాంద్యం..

తెలంగాణ రాష్ట్రానికి ఇప్పుడు ఆర్థిక మాంద్యం ఊహించని దెబ్బతీసింది. మాంద్యం మాట తరచూ వినిపిస్తూనే పాలకులకు నిద్రలేకుండా చేస్తున్నట్లు తెలుస్తోంది. దేశం మొత్తంమీద ఇతర పార్టీల అధినేతలు, ప్రముఖులు చెబుతున్నట్లుగా మాంద్యం తీవ్రత ఎంతన్నది పక్కన పెడితే, ఆ పేరుతో ప్రభుత్వాలు చేసుకుంటున్న దిద్దుబాట్లు అంతా ఇంతా కాదన్నట్లుగానే కనిపిస్తోంది. ప్రస్తుతం దేశంలోని తెలంగాణ ప్రభుత్వాన్ని చూస్తేనే గొప్పదనం కోసం భారీగా పెంచేసిన బడ్జెట్‌ గణాంకాల కారణంగా తీవ్ర ఇబ్బందులు, ప్రశ్నల్ని ఎదుర్కొవాల్సి వస్తోంది. మాంద్యం పేరుతో ఆ మధ్య ప్రవేశ పెట్టిన బడ్జెట్‌ను కూడా తగ్గించుకోవడం ద్వారా గతంలో చేసిన తప్పుల్ని సరిదిద్దుకునే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. మాంద్యం పేరు చెప్పి తెలంగాణ సర్కారు మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటుందంటున్నారు. ఇటీవల కాలంలో ప్రభుత్వానికి రావాల్సినంత ఆదాయం రాకపోవడం, చేసిన అప్పులకు చెల్లించాల్సిన చెల్లింపులు రోజురోజుకు అంతకంతకూ పెరుగుతున్న వేళ, గతంలో చెప్పిన ప్రాజెక్టులు, నిర్మాణ పనులకు రానున్న రోజుల్లో ప్రభుత్వం నుంచి ఎలాంటి టెండర్లు పిలవకూడదని ఫిక్స్‌ అయిపోయినట్లుగా చెబుతున్నారు. దీనికి సంబంధించిన అత్యవసర సందేశాన్ని తెలంగాణ ప్రభుత్వం అన్ని శాఖల్లోని ఇంజనీరింగ్‌ విభాగాలకు పంపినట్లుగా చెబుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకాలకు నిధుల లోటు లేకుండా ఉండాలంటే వివిధ పనులు, ప్రాజెక్టులు, నిర్మాణ పనులకు బ్రేకులు వేయాలని ఆదేశాలు సైతం వెళ్లినట్లు చెపుతున్నారు. మాంద్యం నుంచి బయటపడే వరకు ఇదే విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం అధికారులకు చెప్పినట్లు తెలుస్తోంది. అదే జరిగితే రాష్ట్రంలో ఇంకా పలు పనులు నిలిచిపోతాయని చెపుతున్నారు.

నిర్మాణంలో ఉన్న చాలా పనులకు బ్రేకే..

ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కఠినంగా అమలు చేస్తే రాష్ట్రంలో చాలా పనులు ఆగిపోనున్నాయని తెలుస్తోంది. తాజాగా పంపిన అత్యవసర సందేశం కారణంగా సాగునీటి, పంచాయితీరాజ్‌, రహదారులు, భవనాలు లాంటి కీలకశాఖల్లో ఇరవై ఐదు వేల కోట్ల విలువైనా ప్రాజెక్టు పనులకు బ్రేకులు పడినట్లేనని చెపుతున్నారు. తాజాగా తీసుకున్న కాళేశ్వరం ఎత్తిపోతలకు సంబంధించి మిడ్‌ మానేరు దిగువన ఉన్న మల్లన్నసాగర్‌ వరకూ అదనపు మూడో టిఎంసీ నీటిని పైప్‌లైన్‌ వ్యవస్థళ ద్వారా తరలించాలన్న ప్రభుత్వ నిర్ణయం ఆగిపోనుంది. ఇదే తీరులో దేవాదుల ప్రాజెక్టులో అదనపు నీటి నిల్వల్ని పెంచేందుకు అవసరమైనా కొత్త రిజర్వాయర్‌ నిర్మాణానికి బ్రేకులు పడతాయి. హైదరాబాద్‌ నుంచి అన్ని జిల్లాలకు నాలుగు వరుసల లైన్లతో కూడిన రోడ్ల నిర్మాణ పనులు ఆగిపోనున్నాయి. ఇలా పలు నిర్మాణ పనులు, ప్రభుత్వ పథకాలు ఎక్కడిదక్కడే నిలిపివేయనున్నారు. అనుకోకుండా ఒక్కసారిగా పనులన్నీ ఆగిపోవడం ద్వారా ప్రభుత్వ వ్యవస్థల్లో స్తబ్దత నెలకొనటమే కాదు, పనులు ముందుకు సాగకపోవడంతో ఇచ్చిన హమీలన్నీ సకాలంలో పూర్తి చేయలేని పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది. ఆర్ధిక మాంద్యం మెరుగు పడినప్పుడు, అన్ని నిర్మాణాలకు, అన్ని పనులకు, పథకాలకు పూర్తిగా మోక్షం కలిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు చెపుతున్నారు..

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close