Featuredఅంతర్జాతీయ వార్తలుజాతీయ వార్తలు

సైన్స్‌లో వైఫల్యాలు ఉండవు

  • అంతర్జాతీయ ఐదో సైన్స్‌ ఫెస్టివల్‌ను వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించిన మోడీ

ప్రపంచానికి ఎంతోమంది గొప్ప శాస్త్రవేత్తలను భారత్‌ అందించిందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. మంగళవారం సాయంత్రం ఆయన కోల్‌కతాలో అంతర్జాతీయ ఐదో సైన్స్‌ ఫెస్టివల్‌ను దిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా మోడీ ప్రసంగించారు. ‘భారతదేశ చరిత్ర ఎంతో విలువైనది.. వర్తమానం శాస్త్ర సాంకేతిక విజ్ఞానంతో, భవిష్యత్తంతా మరిన్ని బాధ్యతలతో నిండి ఉంది’ అని వ్యాఖ్యానించారు. మానవతా విలువలతో కూడిన శాస్త్రసాంకేతికత విజ్ఞానం దిశగా ముందుకెళ్లాలన్నారు. ఈ సందర్భంగా 21వ శతాబ్ధంలో మానవ జాతికి శాస్త్రసాంకేతికత ఆవశ్యకతను ఆయన గుర్తు చేశారు. శాస్త్ర సాంకేతికత లేకుండా ఏ దేశమూ అభివృద్ధి చెందిన దాఖలాల్లేవని మోడీ అన్నారు. దేశం గర్వించదగిన శాస్త్రవేత్తలు సర్‌ సీవీ రామన్‌ (ఈనెల 7న), జగదీశ్‌ చంద్రబోస్‌ (ఈ నెల 30న) జయంతి వేడుకల నేపథ్యంలో సైన్స్‌ ఫెస్టివల్ను జరుపుకోవడం హర్షనీయమన్నారు. కొత్త ఆలోచనలకు, ఆవిష్కరణలకు ప్రభుత్వం సంస్థాగతంగా ప్రోత్సహిస్తుందని చెప్పారు. శాస్త్ర సాంకేతిక విజ్ఞానం మరింత బలోపేతం కావాలని ప్రధాని ఆకాంక్షించారు. ”దేశంలో కొత్త ఆవిష్కరణలకు అనుకూలమైన, ఉత్తేజకరమైన వాతావరణం అవసరం. ఆ దిశగా ముందుకెళ్లాల్సి ఉంది. ఈ సందర్భంగా ఇటీవల జరిగిన చంద్రయాన్‌ 2 ప్రయోగాన్ని ఉదాహరణగా చెప్పాలనుకుంటున్నా. చంద్రయాన్‌ 2 ప్రయోగంలో శాస్త్రవేత్తలంతా అలుపెరగకుండా శ్రమించారు. సత్ఫలితాలు వస్తాయని భావించారు. అంతా అనుకున్న ప్రణాళిక ప్రకారం జరగలేదు. అయినప్పటికీ ఆ మిషన్‌ మాత్రం విజయవంతమైంది. సైన్స్లో వైఫల్యాలు ఉండవు. కృషి, ఆవిష్కరణలు, విజయాలే ఉంటాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని ముందుకెళ్తే సైన్స్లోనైనా, జీవితంలోనైనా ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తవు. మానవీయ విలువలతో కూడిన శాస్త్ర సాంకేతికతను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది” అని మోడీ గుర్తుచేశారు.

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close