భిన్నమైన భావజాలాలున్న

0

కూటమిని ప్రజలు నమ్మరు

  • తెలంగాణ ఫలితాలే వారికి ఎదురవుతాయి
  • ఎన్డీఏ పాలనలో దేశం ఆర్థికాభివృద్ధి సాధిస్తోంది
  • కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లీ

న్యూఢిల్లీ, జనవరి1(ఆర్‌ఎన్‌ఎ) : భిన్నమైన భావజాలాలున్న పార్టీలన్నీ ఒక కూటమిగా ఏర్పడేందుకు ప్రయత్నిస్తున్నాయని, వారి ప్రయత్నాలను ప్రజలు తిప్పికొడతారని, ఇటీవల తెలంగాణ ఎన్నికల్లో అక్కడి కూటమికి ఎదురైన పరాభావమే దేశంలో ఏర్పడబోయే కూటమికి ఎదురవడం ఖాయమని కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లీ అన్నారు. ఓ ఛానల్‌ ఇంటర్వ్యూలో జైట్లీ పలు విషయాలు వెల్లడించారు.. బీజేపీ వ్యతిరేకంగా ఏర్పాటు అవుతున్న మహాకూటమిపై విమర్శలు కురిపించారు. ప్రతి పక్ష నేతలది విఫలమైన ఆలోచనగా ఆయన అభివర్ణించారు. అందుకు తెలంగాణ శాసనసభ ఎన్నికల ఫలితాలే ఉదాహరణ అని చెప్పారు. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికలను పరిశీలిస్తే తెలంగాణలో ఇటువంటి మహాకూటమే ఏర్పాటై తెరాసపై పోటీ చేసిందని, తెలంగాణ అనుకూల, వ్యతిరేక శక్తులకు జరిగిన పోటీ ఇదన్నారు. ప్రతిపక్షాలన్నీ కలిసి తెరాసను ఓడించాలనుకుని విఫలమయ్యాయని వ్యాఖ్యానించారు. ఇటువంటి ఫలితమే లోక్‌సభ ఎన్నికల్లోనూ వస్తుందని ఆయన అన్నారు. భిన్నమైన భావజాలాలు కలిగిన పార్టీలన్నీ కలవాలనుకుంటున్నాయని ఆయన విమర్శించారు. మహాకూటమి అనేది భారత్‌ను భయపెట్టే ఆలోచన అని, అలాగే, దానికి ఇప్పటికే బీటలు పడుతున్నాయని అన్నారు. వారిలో రెండు రకాల ఆలోచనలు ఉన్నాయని జైట్లీ అన్నారు. ఓ వైపు కాంగ్రెస్‌, డీఎంకే కొన్ని కమ్యూనిస్టు పార్టీలు, తెలుగు దేశం పార్టీ కలిసి ఓ కూటమిని ఏర్పాటు చేయాలనుకుంటుంటే, మరోవైపు తెరాస, తృణమూల్‌ కాంగ్రెస్‌, బీజూ జనతా దళ్‌ కలిసి కాంగ్రెస్‌-భాజపాయేతర ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు చేయాలనుకుంటున్నాయని ఆయన విమర్శించారు. మహాకూటమి అనేది ఇప్పటికే పరీక్షించి, విఫలమైన ఆలోచన అని ఆయన వ్యాఖ్యానించారు. ఎన్డీఏ పాలనలో దేశం ఆర్థికాభివృద్ధి సాధిస్తోందని చెప్పుకొచ్చారు. ప్రపంచంలోనే అత్యధిక వేగంగా ఆర్థిక వృద్ధి సాధిస్తున్న దేశంగా భారత్‌ నిలిచిందని అన్నారు. తమ పాలనలో వ్యవసాయ రంగంలోనూ అత్యుత్తమ సేవలు అందుతున్నాయని అన్నారు. మోదీ మళ్లీ మన ప్రధాని కావాలా? లేదా అస్పష్టమైన విధానాలతో ఏర్పాటవుతున్న కూటమి అధికారంలోకి రావాలా? అనే విషయంపై ఆలోచించి ప్రజలు లోక్‌సభ ఎన్నికల్లో ఓట్లు వేస్తారని ఆయన అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here