Featuredరాజకీయ వార్తలు

అప్పుడే చెడిందా…

  • జగన్‌, కెసిఆర్‌ మధ్య దూరం..
  • ఆర్టీసీ ఆస్తులతో చిచ్చు..
  • కాళేశ్వరం ప్రాజెక్టుపై ఫిర్యాదు..
  • శత్రువులవుతున్న మిత్రువులు..

పక్కపక్క తెలుగురాష్ట్రాలు.. దేశమంతా ఒక్కటైనా మనం మాత్రం కలిసే ఉండాలి.. తెలుగు రాష్ట్రాల పాలకులను ఎంతమంది దూరం చేయాలని చూసినా, జాతీయ నాయకులు ఎంత విడదీయాలని ప్రయత్నం చేసినా మన స్నేహం కలకాలం నిలిచిపోవాలని అనుకున్నారు. అందుకు ఆంధ్రప్రదేశ్‌లో చిన్న కార్యక్రమం జరిగినా ఆగమేఘాలపై తెలంగాణ ముఖ్యమంత్రి వెళ్లేవారు.. తెలంగాణలో ఏలాంటి కార్యక్రమం జరిగినా ఆంధ్ర ముఖ్యమంత్రి హజరయ్యేవారు.. కాని గత కొద్ది కాలం నుంచి ఇరువురి కలయిక లేదు. ఇద్దరి మాటామంతీ లేదు. ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణలోని ఆర్టీసీ ఆస్తులు మాయంటే మాయనే వాదన పెరుగుతున్న ఇరువురి అధినేతలు మాత్రం వాటిపై స్పందించడమే లేదు. లోలోపల ఆస్తులపై సమరం సాగుతున్నా బయటికి మాత్రం చిరునవ్వును ప్రదర్శిస్తున్నారు. దేశంలోనే అతిపెద్ద ప్రాజెక్టు కాళేశ్వరంలో నిర్మించడం మరిచిపోలేని విషయమని కెసిఆర్‌ గొప్పగా చెప్పారు. తెలంగాణ రైతాంగం ఏలాంటి ఇబ్బందులు లేకుండా పదికాలాల పాటు సంతోషంగా ఉండాలని ఆలోచనతో ప్రాజెక్టును నిర్మించామని చెపుతున్న కెసిఆర్‌ దాని ప్రారంభోత్సవానికి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ను ప్రత్యేకంగా ఆహ్వనించారు. అంగరంగవైభవంగా కాళేశ్వరం ప్రాజెక్టును ప్రారంభించారు. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసిమెలిసి ఇరు రాష్ట్రాల అభివృద్దికి పాటుపడుతున్నారని అంతా అనుకున్నారు. కాని మొదటి నుంచి ఆంధ్రలో జరుగుతున్న పనులు కాని, అభివృద్ది పథకాలు కాని తెలంగాణ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేలా ఉంటున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు వ్యతిరేకంగా చేసే కొన్ని పనులు అక్కడ అనుకూలంగా ఉండడంతో ప్రభుత్వంపై మండిపడుతున్నారు. ఇటీవల ఆర్టీసీలో జరిగినా కొన్ని విషయాలను గమనిస్తే అక్కడ కార్మికులు కోరగానే విలీనం చేస్తానని మాట ఇచ్చారు. తెలంగాణలో మాత్రం ఉన్న ఆర్టీసీని తీసివేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. పక్కరాష్ట్రం కలిసిమెలిసి ఉంటూ ముందుకు పోవాలని అనుకుంటున్న కెసిఆర్‌కు జగన్‌ వల్ల లేనిపోని సమస్యలు ఎదురవుతున్నాయి. కెసిఆర్‌ కలల ప్రాజెక్టు కాళేశ్వరానికి జాతీయ హోదా ఇవ్వొద్దని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఫిర్యాదు చేసింది. అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉండాల్సిన పక్క ఆంధ్రరాష్ట్రమే కాళేశ్వరంపై ఫిర్యాదు చేయడంతో తెలంగాణ ప్రభుత్వం అవాక్కైనట్లు తెలుస్తోంది. రెండు పార్టీలు అధికారంలోకి వచ్చి సంవత్సరం కావడం లేదు అప్పుడే ఇరు రాష్ట్రాల మధ్య గొడవలు మొదలైనట్లు తెలుస్తోంది. కలిసుండాల్సిన నాయకులు కయ్యానికి కాలుదువ్వుతున్నారనే విషయం అర్థమైపోతుంది. ఇరు రాష్ట్రాల మధ్య మొదలవుతున్న చిన్న చిన్న గొడవలు చిలికి చిలికి గాలివానగా మారే అవకాశాలే కనిపిస్తున్నాయి…

హైదరాబాద్‌ ఆదాబ్‌ హైదరాబాద్‌..

తెలంగాణ సీఎం కేసీఆర్‌, ఏపీ సీఎం జగన్‌ మధ్య మిత్ర బంధం తెగిపోయి ఇరువురి మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయా అంటే నిజమనే సంకేతాలు కనబడుతున్నాయి. అన్నదమ్ముల్లా, తండ్రికొడుకుల్లా కలిసి ఉండే ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య అధిక దూరం పెరిగిందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. వారిరువురి మధ్య వైరం రోజురోజుకు పెరిగినట్లు అధికార వర్గాలలోనూ చర్చ సాగుతుంది. అయితే వీరిద్దరి మధ్య ఆర్టీసీ విలీనం చిచ్చు పెట్టిందని భావిస్తే అందులోనూ ఆస్తుల పంచాయితీ కారణం అని తాజాగా ఆసక్తికర చర్చ జరుగుతుంది. నిన్నా మొన్నటి దాకా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు స్నేహగీతం పాడారు. ఫ్రెండ్‌ అంటే నువ్వే అంటూ మీడియా ముందు సందడి చేశారు. రెండు రాష్ట్రాల అభివృద్దే ధ్యేయం అని తెగ మంతనాలు జరిపారు. కానీ ఏపీలో ఆర్టీసీ విలీనం వల్ల తెలంగాణలో ఏర్పడిన పరిస్థితి సీఎం కేసీఆర్‌ కు చికాకును తెప్పించింది. ఏపీలో ఆర్టీసీ విలీనం అంశాన్ని ప్రస్తావించి ఘాటుగా తనదైన శైలిలో మాట్లాడారు సీఎం కేసీఆర్‌. ఇక సీఎం కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలు ఏపీ ముఖ్యమంత్రికి రుచించలేదు.సాధ్యమైనంత దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక ఇదే సమయంలో ఆర్టీసీ ఆస్తుల కోసమే సీఎం కేసీఆర్‌ ఆర్టీసీ కార్మికుల సమస్యలను గాలికి వదిలేసి ఆర్టీసీని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తున్నారని ప్రతిపక్ష పార్టీలు కేసీఆర్‌ను టార్గెట్‌ చేశాయి. ఆర్టీసీని విలీనంపై సీఎం కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలు అటుంచి ఇక ఆర్టీసీ ఆస్తుల పంచాయితీనే అసలు జగన్మోహన్‌ రెడ్డికి, సీఎం కేసీఆర్‌ కు మధ్య అగాధాన్ని పెంచిందని చర్చ జరుగుతుంది. రాష్ట్ర విభజన జరిగి దాదాపు ఆరు సంవత్సరాలు కావొస్తున్నా ఏపీ, తెలంగాణా రాష్ట్రాల మధ్య ఇప్పటివరకూ ఆర్టీసీ ఆస్తుల విభజన పూర్తి కాలేదు. ఏపీఎస్‌ ఆర్టీసీకే గుర్తింపు ఉంది కానీ టీఎస్‌ ఆర్టీసీకి గుర్తింపు లేదన్న విషయం కూడా ఇటీవల ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపధ్యంలోనే బయటకు వచ్చింది. అయితే ఇంతకాలం ఒక అవగాహనతో రెండు రాష్ట్రాలకు చెందిన ఆర్టీసీలు పని చేస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలోని ఆర్టీసీకి హైదరాబాద్‌ లోనూ, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆస్తులు భారీగా ఉన్నాయి. భవనాలు, ఖాళీ స్థలాలు లాంటివి వివిధ రూపాల్లో ఆర్టీసీకి ఉన్నాయి. విభజన లెక్కల ప్రకారం 58-42 నిష్పత్తిలో పంచుకోవాల్సి ఉన్నా ఇప్పటివరకు ఆ పని జరగలేదు. పైపెచ్చు సీఎం కేసీఆర్‌ ఆర్టీసీ ఆస్తులను పంపకాలు జరగకుండానే లీజుకు ఇస్తున్న ఉదంతాలు బయటకు వచ్చాయి.

కాళేశ్వరం ప్రాజెక్టుపై ఆంధ్రా ప్రభుత్వం ఫిర్యాదు

ఆంధ్రప్రదేశ్‌లోని రైతుల ప్రయోజనాలకు విరుద్ధంగా, విచక్షణా రహితంగా తెలంగాణ చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించే అంశాన్ని పరిశీలించొద్దని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేసింది. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి తెలంగాణలోని ముంపు ప్రాంతాలు ఏపీలో కలిపేయడంతో అభ్యంతరాలు చెప్పే హక్కు లేదని పేర్కొంది. పోలవరానికి సంబంధించిన కేసులో తెలంగాణన పార్టీగా పరిగణించాల్సిన అవసరం లేదంది. అఫిడవిట్‌లోని అంశాలు పరిశీలించి విభజన చట్టంలో పేర్కొన్న హామీలు తు.చ. తప్పకుండా త్వరగా అమలు చేసేలా కేంద్రానికి ఆదేశాలివ్వాలని సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేసింది. పిటిషనర్‌ దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌ను కొట్టివేయాలని కోరింది. విభజన హామీల అమలులో జాప్యం జరుగుతోందని తెలంగాణ భాజపా నేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో తెలంగాణ ప్రభుత్వ అఫిడవిట్‌కు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేసింది. పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలు విభజన చట్టంలో లేవని, క అష్ణా బోర్డు అనుమతులు లేవని కేంద్ర జలవనరుల శాఖ స్పష్టం చేసినా తెలంగాణ ఆయా ప్రాజెక్టులపై ముందుకెళ్తోందని పేర్కొంది. మరోసారి అపెక్స్‌ కౌన్సిల్‌ ఏర్పాటు చేయాలని కోరినా కేంద్రం చర్యలు తీసుకోలేదని పేర్కొంది. ‘కఅష్ణా బేసిన్‌లో 180 టీఎంసీలకు పైగా వినియోగించుకునేలా పాలమూరు రంగారెడ్డి, డిండి, భక్త రామదాసు ప్రాజెక్టులు, 450 టీఎంసీల నీటి వినియోగం నిమిత్తం కాళేశ్వరం, సీతారామ ఎత్తిపోతల పథకం తుపాకులగూడెం తదితర ప్రాజెక్టులు చేపట్టింది. రీఇంజినీరింగ్‌ పేరుతో కాళేశ్వరం చేపట్టినట్లు చెబుతోంది. ఇది ముమ్మాటికీ నూతన ప్రాజెక్టే. తెలంగాణ నూతన ప్రాజెక్టుల వల్ల పోలవరం, ధవళేశ్వరం బ్యారేజీలపై తీవ్ర ప్రభావం పడుతుంది. అపెక్స్‌ కౌన్సిల్‌ ముందు ఈ అంశాలు పెట్టాలని పలుసార్లు కేంద్రానికి విజ్ఞప్తి చేశాం. ఆంధ్రప్రదేశ్‌ ప్రాజెక్టుల పరిధిలోని రైతులను విస్మరించి పక్షపాతంతో కాళేశ్వరం పనులు కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించే అంశాన్ని పరిగణనలోకి తీసుకోవద్దు’ అని ఏపీ అఫిడవిట్‌లో పేర్కొంది.

అస్తుల పెంపకానికి ఆసక్తి చూపని కెసిఆర్‌..

ఏపీ, తెలంగాణా వాటాల లెక్కల్ని తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకిస్తోంది. ఉమ్మడి ఆర్టీసీకి చెందిన మొత్తం ఆస్తులు అంచనా ప్రకారం రూ.35వేల కోట్లు. ఆ ఆస్తుల్లో రూ.16వేల కోట్ల ఆస్తులు తమకు చెందాల్సి ఉంటుందని ఏపీ ప్రభుత్వం చెబుతోంది.ఈ వాదనను తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకిస్తోంది. హైదరాబాద్‌ లో ఆర్టీసీకి 11 ప్రధానమైన చోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. ఇవన్నీ భవనాలు, స్థలాల రూపంలోనే ఉన్నాయి. ఆర్టీసీ ప్రధాన కార్యాలయం ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌లో ఉంది. తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌ లోని బస్‌ భవన్‌ షేర్‌ మాత్రమే ఇస్తామని మరింకేమీ ఏపీకి ఇచ్చే ప్రసక్తే లేదని వాదిస్తోంది. ఈ భవనాన్నినిర్మించినప్పుడు దీని విలువ రూ.76 కోట్లు. దాన్లో వాటా ఇస్తాం తప్పించి మిగిలిన ఆస్తుల్ని ఇచ్చేందుకు ససేమిరా అంటోంది తెలంగాణా సర్కార్‌ . ఇదే రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య వివాదంగా మారి తెలుగు రాష్ట్రాల సీఎంల మధ్య దూరం పెంచిందని ఆసక్తికర చర్చ జరుగుతుంది. అయితే ఏపీ ఆర్టీసీ కి చెందిన ఆస్తులను విభజన లెక్కల ప్రకారం అప్పగించాలని ఏపీ సర్కార్‌ , బస్‌ భవన్‌ లో వాటా మినహాయించి ఇంకేం ఇవ్వమని తెలంగాణా సర్కార్‌ ప్రస్తుతం తమ వాదనలను వినిపిస్తున్నాయి. ఈ ఆస్తుల పంచాయితీతోనే ఇద్దరి ముఖ్యమంత్రుల మధ్య స్నేహం దెబ్బతిన్నట్లుగా తాజా చర్చ జరుగుతుంది. అసలే అప్పుల రాష్ట్రం , అందులోనూ ఆర్తీసీనీ ఆదుకోవటం కోసం కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేసిన రాష్ట్రం అయిన ఏపీ, తెలంగాణలో ఉన్న తమ ఆస్తులను దక్కించుకుంటే కొంత ఏపీఎస్‌ ఆర్టీసీని బలోపేతం చేసినట్టు అవుతుందని భావిస్తుంది. సీఎం కేసీఆర్‌ ఆస్తుల పంపకానికి ససేమిరా అంటున్నారు. ఈ పంచాయితీ తెగకుంటే సీఎం జగన్‌ కూడా అంత సులువుగా ఈ వ్యవహారాన్ని వదిలిపెట్టరు. ఏది ఏమైనా ఇరు రాష్ట్రాల సీఎంల మధ్య ప్రస్తుతం ఏర్పడిన విభేదాలకు ఆస్తుల పంచాయితీ మరోసారి ఆర్జ్యం పోసినట్టు అయ్యింది. ఈ ఆస్తుల పంచాయితీతో భవిష్యత్తులో తెలుగు రాష్ట్రాల మధ్య ఎలాంటి పరిస్థితులు ఉండబోతున్నాయి అన్నది ఆసక్తికరంగా మారింది.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close