ఎదుటి వారి బలహీనతే కెేసీఆర్‌ బలం

0
  • ఉద్యమ నేతకు పెరగుతున్న ఆదరణ
  • ఒకే ఒక్కడుగా గుర్తింపు

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): కొత్త జిల్లాల ఏర్పాటుతో తెలంగాణలో కొత్త పాలన ప్రారంభమయ్యాక జిల్లాల్లో గతంలో ఉన్న నాయకత్వ పెత్తనం తగ్గుతూ వస్తోంది. ఇది టిఆర్‌ఎస్‌కు బాగా కలసి వస్తోంది. దీనికి తోడు ఇతర పార్టీల్లో ఉన్న నేతలు మెల్లగా గులాబీ దళంలో చేరుతున్నారు. అవతలి పార్టీలు బలంగా లేకపోవడం, ఎన్నికల్లో గెలుస్తామన్న ఆశ లేకపోవడంతో ఈ పరిస్తితి ఏర్పడింది. వివిధ జిల్లాలకు చెందిన టిడిపి, కాంగ్రెస్‌ నేతలు టిఆర్‌ఎస్‌లు చేరడం ఇందుకు ఉదాహరణగా చూడాలి. ఈ చేరికలు ఇకముందు మరింతగా పెరగనున్నాయి. పరిషత్‌ ఎన్నికల వేళ ఇది మరింత స్పీడ్‌ అందుకోనుంది. ఆయా పార్టీలకు చెందిన నేతలు మెల్లగా తెలంగాణ రాష్ట్రసమితిలో చేరాలని ఉత్సాహం చూపడం వెనక కెసిఆర్‌ బలమైన నాయకుడు కావడం కూడా కారణంగా చూడాలి. మరోవైపు తెలంగాణలో కెసిఆర్‌కు ఎదురొడ్డి నిలిచే నాయకుడు లేకపోవడం వల్ల ఇతర పార్టీల్లో ఉన్న వారికి నమ్మకం లేకుండా

పోతోంది. అందుకే కాంగ్రెస్‌,టిడిపి, బిజెపిలు ఎంతగా పోరాడినా, ఉద్యమించినా లాభం లేకుండా పోతోంది. క్యాడర్‌ అంతా టిఆర్‌ఎస్‌ వైపు చూస్తోంది. కేసీఆర్‌కు ప్రత్యామ్నాయం అని చెప్పగల నాయకుడు ఒక్కరు కూడా తెలంగాణలో లేకపోవడం కూడా ఆయా పార్టీలకు మైనస్‌గా భావించాలి. టిడిపి, బిజెపి, కాంగ్రెస్‌, కమ్యూనిస్టుల్లో గ్టటిగా మాట్లాడి పోరాడగలిగిన వారు లేరు. నాయకత్వ పటిమ వల్లనే ఇతర పార్టీల్లో ఉన్న వారు అధికార పార్టీ కండువా కప్పుకోవాలని ఆశిస్తున్నారు. ఇకపోతే జిల్లాల పరిధి తగ్గి నాయకులకు ప్రాధాన్యం పెరిగింది. కొత్త నాయకత్వానికి అవకాశం ఏర్పడింది. ఇదే దశలో ఆయా పార్టీలు కూడా ఇక తమ జిల్లాల విభాగాల ఏర్పాటుపై దృష్టి పెట్టాయి. తెలంగాణ ఏర్పడ్డ వెంటనే కూడా ఆయా పార్టీలు తమ పార్టీలకు కొత్త అధ్యక్షులను నియమించారు. టిడిపి, కాంగ్రెస్‌,బిజెపిలు కూడా ఉమ్మడి నాయకత్వం నుంచి బయట పడ్డాయి. ఇప్పుడు తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటు కారణంగా కొత్తగా నాయకత్వం పుట్టుకుని వచ్చే అవకాశాలు పెరిగాయి. పాతుకు పోయిన వారికి కాలం చెల్లిందనే చెప్పాలి. అన్ని పార్టీలు విధిగా కొత్త రక్తాన్ని తీసుకుని రావాల్సి ఉంటుంది. అందుకే యువతకు ప్రాధాన్యం ఇస్తూ వచ్చారు. ప్రతిజిల్లాకు అనివార్యంగా కొత్త నాయకులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఓ రకంగా అన్ని పార్టీలకు నాయకత్వం పెరిగినా అధికార పార్టీ టిఆర్‌ఎస్‌కు మాత్రమే ఇది బాగా లాభిస్తోంది. అన్ని ప్రాంతాల నుంచి నాయకలు టిఆర్‌ఎస్‌లో చేరడానికి ఉత్సాహం చూపుతున్నారు. ఇప్పటికే తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో టిఆర్‌ఎస్‌లో బహుళ నాయకత్వం ఉంది. అనేకులు సమర్థులైన నేతలుగా ఎదిగారు. ఈ దశలో కొత్త నాయకులు వస్తే తప్ప ఆయా పార్టీలకు భవిష్యత్‌ లేకుండా పోవడం ఖాయం. ఉద్యమ పార్టీగా ఉన్నందున తెలంగాణ రాష్ట్ర సమితిలోకి ఎక్కువగా కొత్తరక్తం వచ్చి చేరుతోంది. దీంతో ప్రస్తుతం ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన వారు బలమైన నాయకులుగా ఎదగడానికి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు కొత్త జిల్లాల ఏర్పాటుతో వీరంతా కీలక భూమిక పోషించే అవకాశాలు వచ్చాయి. జిల్లాల పునర్విభజన చేయడంతో బడుగుబలహీన వర్గాలకు అవకాశం ఇవ్వడం వంటి కారణాల వల్ల కొత్త నాయకత్వానికి అవకాశాలు పెరిగాయి. జిల్లాల పరిధి చిన్నది కావడం వల్ల కొత్త సమస్యలు ఉంటాయి. వాటిని పట్టుకుని పరిష్కరించే సత్తా చూపితే నాయకులుగా ఎదిగే అవకాశాలు ఉంటాయి. దీంతో ఇప్పుడు విపక్షాలకు ఇది ఊహించని దెబ్బ కాగలదు. కొత్త జిల్లాల ఏర్పాటు వల్ల కొత్త నాయకత్వం ఎదిగివచ్చే అవకాశం ఉంది. అదే సమయంలో ఇప్పుడు బలంగా ఉన్న నాయకులలో కొందరు బలహీనపడే అవకాశం ఉంది. నియోజకవర్గాల పెంపు, జిల్లాల పెంపు వంటి విషయాలలో అధికారంలో ఉన్న పార్టీకి అనుకూలంగానే మారిందనడంలో సందేహం లేదు. రాజశేఖర్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శాసనసభ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరిగింది. అప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి కంచుకోటలుగా ఉన్న నియోజకవర్గాలను చీల్చారు. అధికార పార్టీకి అనుకూలంగా నియోజకవర్గాల పునర్విభజన జరిగిపోయింది. అన్ని పార్టీలు ఈ సమస్యను ఎదుర్కోక తప్పదు. దీనివల్ల గులాబీ దళాలు మరింతగా విస్తరించే అవకాశాలు పెరిగాయి. దీంతో మరోరెండు దశాబ్దాలపాటు తెలంగాణలో కేసీఆర్‌ నాయకత్వాన్ని ఎదుర్కోగల సమర్థులు ఉండకపోవచ్చు. గతంలో ముఖ్యమంత్రులకు దీటైన నాయకులు మంత్రివర్గంలో కనిపించేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ప్రాంతీయ పార్టీలు వ్యక్తులు, కుటుంబాలపై ఆధారపడి ఉంటాయి కనుక ఆ పార్టీలో ప్రత్యామ్నాయ నాయకులు ఎదిగే అవకాశం ఉండదు. అందుకే తెలంగాణలో మరో పదికాలాల పాటు కెసిఆర్‌కు ఎదురుండకపోవచ్చు. వివిధ కార్యక్రమాలతో కెసిఆర్‌ ప్రజల్లోకి చొచ్చుకు పోవడం, తెలంగాణ సెంటిమెంట్‌ పునాదులు ఇంకా బలంగా ఉండడం వంటి కారణాల వల్ల బిజెపి, కాంగ్రెస్‌, టిడిపిలకు అవకాశాలు రాకపోవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here