ఆంధ్రాలో ముగిసిన సార్వత్రిక సమరం

0
  • 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్‌ స్థానాలకు ఎన్నిక
  • అక్కడక్కడా పలు ఘర్షణలు
  • ఘర్షణల్లో ఇద్దరు మృతి..కోడెలపై దాడి
  • పవన్‌ కళ్యాణ్‌ కోసం గాజువాకలో భారీగా పోలింగ్‌

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. చెదురుముదురు ఘటనలుచోటు చేసుకున్నాయి. ఎన్నికల హింసలో ఇద్దరు మృతి చెందారు. స్పీకర్‌ కోడెల శిప్రసాదరావుపై దాడి జిరగింది. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ నియోజకవర్గాల్లో ఈ ఉదయం 7 గంటలను నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ కొనసాగింది. పలుచోట్ల ఈవీఎంలు మొరాయించడంతో ఆరంభంలో పోలింగ్‌కు కాసేపు అంతరాయం కలిగింది. విజయనగరం, విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్‌ను ముగించారు. నిర్ణీత సమయంలోపు క్యూలైన్లలో చేరినవారికి ఓటు వేసే అవకాశం కల్పించారు.సాయంత్రం 6 గంటలలోపు క్యూలో ఉన్నవారికి ఓటేసేందుకు అవకాశం కల్పించారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. ఈవీఎంలు పనిచేయక వెనక్కి వెళ్లిన ఓటర్లు మళ్లీ రావడంతో రద్దీ పెరిగింది. ఎంత రద్దీ ఉన్నా ఓటు వేశాకే తిరిగి వెళ్తామని వృద్ధులు, మహిళలు అంటున్నారు. మావోయిస్టు ప్రభావిత నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్‌ ముగిసింది. విశాఖ జిల్లా గాజువాక శాసనసభ నియోజకవర్గానికి జరుగుతున్న ఎన్నికల పోలింగ్‌లో ఓటర్లు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. జనసేన అధ్యక్షుడు పపన్‌ కల్యాణ్‌ స్వయంగా బరిలో నిలిచిన ఈ స్థానంలో యువత హడావుడి బాగా కనిపిస్తోంది. మహిళలు, వృద్ధులను దగ్గరుండి మరీ పోలింగ్‌ కేంద్రాల వరకు తీసుకెళ్తున్నారు. ఈ నియోజకవర్గ పరిధిలో ఏర్పాటు చేసిన 307 పోలింగ్‌ కేంద్రాల్లో సాయంత్రం 5 గంటల వరకు 56 శాతం పోలింగ్‌ నమోదైంది. అధిక సంఖ్యలో ఓటర్లు క్యూ లైన్లలో నిలబడి ఉన్నారు. వీరందరికీ పోలింగ్‌ అధికారులు స్లిప్పులు అందజేశారు. చీకటి పడితే విద్యుత్‌ బల్బులు ఏర్పాటు చేసి మరీ పోలింగ్‌ పక్రియ కొనసాగిస్తామని అధికారులు చెబుతున్నారు. అధికారులు ఉదయం 7గంటలకే ఓటింగ్‌ పక్రియను ప్రారంభించినప్పటికీ ఈవీఎంలు, వీవీప్యాట్‌లు మొరాయించడంతో దాదాపు 2 గంటలపాటు పోలింగ్‌ పక్రియ నిలిచిపోయింది. దీంతో ఓటర్లు కాస్తా నిరాశకు గురయ్యారు. కేంద్రీయ విద్యాలయం కేంద్రంలో 8 బూత్‌లు ఏర్పాటు చేయంగా అందులో 2 బూత్‌లు 10 గంటల వరకు పని చేయలేదు. మరో ఈవీఎంలో మాక్‌ పోలింగ్‌ డేటా డిలీట్‌ కాకపోవడంతో పోలింగ్‌ పక్రియ ఆలస్యంగా ప్రారంభమైంది. మరోవైపు ఎండ తీవ్రత అధికంగా ఉండటంతో క్యూ లైన్లలో నిలబడలేక ఓటర్లు ఇంటి ముఖం పట్టారు. కానీ, మధ్యాహ్నం 3 గంటల తర్వాత పోలింగ్‌ కేంద్రాలు కళకళలాడుతున్నాయి. దీంతో పోలింగ్‌ శాతం కూడా పెరిగేందుకు అవకాశమున్నట్లు అధికారులు చెబుతున్నారు.గాజువాకలోని హైస్కూల్‌ రోడ్డులో 43 పోలింగ్‌ కేంద్రాలున్నాయి. ఇందులో 50,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉంది. ఎండ తీవ్రత తగ్గడంతో చాలా మంది సాయంత్రం పూటే ఓటు వేసేందుకు వచ్చారు. దీంతో ఈ మార్గమంతా జాతరను తలపించింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ తనిఖీలు చేపడుతున్నారు. చెదురు ముదురు ఘటనలు తప్ప ఇప్పటి వరకు పోలింగ్‌ పక్రియ సజావుగా సాగుతోంది. గాజువాక శాసనసభ నియోజవర్గం తెదేపా అభ్యర్థిగా పల్లా శ్రీనివాసరావు, వైకాపా తరఫున నాగిరెడ్డి, కాంగ్రెస్‌ తరఫున వెంకట సుబ్బారావు పోటీ చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here