విపక్షాల ఐక్యత స్వరం

0

కోల్‌కతా : ప్రధాని మోదీ ఏకపక్ష నిర్ణయాలతో, కుట్రపూరిత, మత రాజకీయాలతో దేశాన్ని బ్రష్టుపట్టిం చారని, దేశంలో ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశారని.. మళ్లీ మంచిరోజులు రావాలంటే విఫక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చి భాజపా ప్రభుత్వాన్ని గద్దెదించాలని విపక్ష పార్టీల నేతలు పేర్కొన్నారు. పశ్చిమ్‌ బంగలోని కోల్‌కతా వేదికగా ప్రధాని మోదీ ప్రభుత్వంపై విపక్షాలు సమరశంఖం పూరిం చాయి. ఒకే వేదికపై చేరి ప్రతిపక్షాల ఐక్యతను చాటాయి. బంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలో కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు భాజపాయేతర పార్టీల నేతలు ఐక్య ర్యాలీకి తరలివచ్చారు. ఒక్కొక్కరిగా ప్రసంగిస్తూ భాజపా ప్రభుత్వ పాలనపై విమర్శల వర్షం కురిపించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వం గడువు ఇక ముగిసిపోయిందని, త్వరలోనే ఈ దేశ ప్రజలు మోదీని సాగనంపుతారని తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి, పశ్చిమ్‌ బంగ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. ఈ ర్యాలీ ఆఖర్లో మమతా బెనర్జీ మాట్లాడుతూ.. ప్రధాని మోదీ పాలన తీరుపై మండిపడ్డారు. ‘మేం అవినీతి రహితంగా ఉన్నామని మోదీ చెబుతారు. కానీ ఆయన హయాంలో రఫేల్‌ లాంటి పెద్ద పెద్ద కుంభకోణాలు

జరిగాయి. నోట్ల రద్దు, జీఎస్‌టీ వంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాలను అమలు చేశారు. రాజకీయాల్లో లక్ష్మణరేఖ లాంటిది ఉంటుంది. కానీ విూరు (భాజపాను ఉద్దేశించి) దాన్ని దాటారు. విూతో కలిసే ఉంటే ఫర్వాలేదు. లేదంటే ఎవరినైనా సరే అణగదొక్కుతారు. లాలూ ప్రసాద్‌ యాదవ్‌, అఖిలేశ్‌, మాయావతి సహా ఎవర్నీ వదల్లేదు. ఇక మోదీ ప్రభుత్వాన్ని మార్చాల్సిన సమయం వచ్చింది. భాజపాను ఓడించడమే కాదు మూలాలతో సహా పెకిలించాలి. ప్రాంతీయ పార్టీలను ఓడించేందుకు భాజపా చేసే కుట్రలు పనిచేయవు. ఈ వేదిక ఐక్య భారత్‌కు నిదర్శనంగా నిలవాలి’ అని మమత చెప్పుకొచ్చారు. భాజపా ప్రతి ప్రభుత్వ సంస్థను అవమానించిందని, సీబీఐ, ఈడీని కూడా వదల్లేదని దీదీ దుయ్యబట్టారు. ఆర్థిక వ్యవస్థను భ్రష్టు పట్టించారని మండిపడ్డారు. ఈసారి ప్రజలు భాజపాకు ఓటేస్తే వారి బ్యాంకు ఖాతాల్లో ఉన్న కాస్త డబ్బు కూడా తిరిగి రాదని వ్యాఖ్యానించారు. దేశంలో నిరుద్యోగం ఎక్కువగా ఉందని, అసలు ఉద్యోగాలే లేనప్పుడు రిజర్వేషన్లు ఇవ్వడంలో అర్థమేంటని ప్రశ్నించారు. భాజపా హాయంలో మంచి రోజులే రాలేదని విమర్శించారు. నవ భారతాన్ని నిర్మించేందుకు విపక్షాలన్నీ ఏకమయ్యాయని మమత అన్నారు. ప్రధాని ఎవరన్నదానిపై తాను ఆలోచించట్లేదని.. భాజపాను వెళ్లగొట్టడమే తమ లక్ష్యమని మమతా బెనర్జీ స్పష్టంచేశారు. మాజీ కేంద్ర మంత్రి యశ్వంత్‌ సిన్హా మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య పరిరక్షణకు విపక్ష పార్టీలన్నీ ఏకం కావాల్సిన అవసరముందని అన్నారు. రాజ్యాంగ వ్యవస్థలను కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని, దేశంలో ఆర్థిక వ్యవస్థ తిరోగమనంలో ఉందని దుయ్యబట్టారు. దేశాన్ని చిన్నాభిన్నం చేసి పాలించాలనేది భాజపా వ్యూహంగా కనిపిస్తోందని యశ్వంత్‌ వ్యాఖ్యానించారు. కశ్మీర్‌లో అల్లర్లు, కాల్పులకు కారణమెవరని ఆయన ప్రశ్నించారు. మరో కేంద్ర మాజీ మంత్రి అరుణ్‌శౌరి మాట్లాడుతూ.. భాజపా ఒంటెద్దు పోకడలకు పెద్దనోట్ల రద్దే నిదర్శనమన్నారు. విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలను అస్థిరం చేసేందుకు భాజపా యత్నిస్తోందని మండిపడ్డారు. గుజరాత్‌ పాటిదార్‌ అనామత్‌ ఆందోళన్‌ సమితి నేత హార్దిక్‌ పటేల్‌ మాట్లాడుతూ.. నేతాజీ సుభాష్‌ చంద్ర బోస్‌.. గోరో (బ్రిటీషర్లు)కు వ్యతిరేకంగా పోరాటం చేస్తే.. మేమంతా దొంగలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నామని అన్నారు. దళిత నేత, ఎమ్మెల్యే జిగ్నేశ్‌ మేవానీ మాట్లాడుతూ.. దేశం తీవ్ర సంక్షోభంలో చిక్కుకుందని, నాలుగున్నరేళ్ల భాజపా పాలనలో పేదలు, మైనార్టీలు, దళితులు దోపిడీకి గురవుతున్నారని విమర్శలు గుప్పించారు. కేంద్రంలో మహాకూటమి విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత ఫరూక్‌ అబ్దుల్లా మాట్లాడుతూ.. ఈవీఎంలు చోర్‌ మెషిన్లు.. ఎన్నికలు సజావుగా జరగాలంటే తిరిగి పేపర్‌ బ్యాలెట్ల విధానం రావాల్సిన అవసరం ఉందని అన్నారు. భాజపా ప్రభుత్వం ప్రజలను కుల, మతం పేరిట విభజించి పాలిస్తోందని ఫరూక్‌ ఆరోపించారు. జమ్ముకశ్మీర్‌లో ఏర్పడ్డ పరిస్థితికి భాజపానే బాధ్యత వహించాలని, నేను ముస్లింని.. కశ్మీరీని అయినా ఈ దేశంలో భాగమని అన్నారు. అంతా కలిసి పోరాడి భాజపాను ఓడించాలని అన్నారు. అనంతరం లోక్‌జనశక్తి పార్టీ చీఫ్‌ శరద్‌ యాదవ్‌ మాట్లాడుతూ.. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం అన్ని ప్రభుత్వ సంస్థలను నాశనం చేసిందని, ఒక్కదాన్ని కూడా వదలలేదనిఆరోపించారు. దేశం ప్రమాదంలో ఉందని, రైతుల పరిస్థితి దారుణంగా ఉందని అన్నారు. ప్రతి చోటా నాశనమే కనిపిస్తోందన్నారు. జీఎస్టీ, పెద్ద నోట్ల రద్దు దేశ పరిస్థితిని దిగజార్చాయని అన్నారు. అనంతరం డీఎంకే నేత స్టాలిన్‌ మాట్లాడుతూ.. మతవాద పోకడల నుంచి దేశానికి విముక్తి కల్పించేందుకు సాగుతున్న పోరాటమిదని అన్నారు. భాజపాను ఓడించండి.. మోదీని గద్దె దించండి.. దేశాన్ని కాపాడండి.. ఇదే మన నినాదని అన్నారు. మహాకూటమి చేతిలో ఎక్కడ ఓడిపోతామోనని భాజపా భయపడుతోందని, అందుకే ప్రతిసారి విపక్షాలను విమర్శించడమే పనిగా పెట్టుకుందని విమర్శించారు. మోదీకి వ్యతిరేకంగా ఎందుకు ముందుకెళ్తున్నారని చాలా మంది నన్ను ప్రశ్నించారని, మోదీ విధ్వంసకర విధానాలకు మాత్రమే నేను వ్యతిరేకమని, అంతేకానీ వ్యక్తిగతంగా ఎటువంటి వ్యతిరేకం లేదని స్టాలిన్‌ పేర్కొన్నారు.

భాజపాది నియంత వైఖరి – కేరళ సీఎం కుమారస్వామి

'ప్రజాస్వామ్యం, రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా భాజపా పాలన సాగుతోందని కర్ణాటక సీఎం, జేడీఎస్‌ నేత కుమారస్వామి అన్నారు. ప్రజలంటే గౌరవం లేని, ప్రజల ప్రయోజనాలు పట్టని ప్రభుత్వం కేంద్రంలో ఉందని దుయ్యబట్టారు. భాజపాది నియంత వైఖరి అని, ఆ పార్టీ కుట్రలతో పేద రైతులు ఎంతగానో నష్టపోతున్నారన్నారు. కర్ణాటకలో రైతు రుణమాఫీని విఫలం చేయాలని భాజపా కుట్ర చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఆ పార్టీ కార్పొరేట్లను ఒకలాగ, రైతులను ఒకలాగా చూస్తోందని కుమారస్వామి దుయ్యబట్టారు. భాజపా రైతులు, పేద ప్రజల కోసం ఎలాంటి పథకాలు తీసుకురావట్లేదని, అంతేగాక.. ఈ పార్టీ విధానాలతో గ్రావిూణ ఆర్థికవ్యవస్థ కుప్పకూలుతోందని విమర్శించారు. మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీఎస్‌టీ వల్ల రాష్ట్రాలకు ఆర్థిక స్వేచ్ఛ లేకుండా పోయిందని ఆరోపించారు. రాష్ట్రాలపై పెత్తనం చేసేందుకు మోదీ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందని తప్ప దేశంలో ప్రజల ఇబ్బందులను దృష్టి పెట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాల్లోని ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం ద్వారా రాష్ట్రాన్ని ప్రభుత్వాలను కూలదేయాలని చూస్తుందని, తద్వారా రాష్ట్రాల్లో అక్రమంగా అధికారంలోకి రావాలని చూస్తుందని దుయ్యబట్టారు. మోదీ కుట్రలకు చరమగీతం పాడే సమయం ఆసన్నమైందని, విపక్షాలన్నీ ఐక్యంగా పోరాడి మోదీని గద్దెదించాలని, తద్వారా దేశాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉందని కుమారస్వామి పేర్కొన్నారు. 

బాక్స్‌:

మహా కూటమిలో ప్రధాని పదవి లొల్లి

తెరపైకి దీదీపేరు

దేశ రాజకీయాల్లో ప్రధానమంత్రి పదవి ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. ఇంకా సార్వత్రిక ఎన్నికలు రాకముందే అతడే భావి ప్రధాని అని ఒక పార్టీ కాదు కాదు ఆమెనే ప్రధాని అంటూ మరొక పార్టీ ఇలా ఏ పార్టీకి ఆ పార్టీ అభ్యర్థులను ప్రకటించేసి వేడి రాజేస్తోంది. దీంతో దేశ రాజకీయాల్లో ప్రధాని పదవిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇప్పటికే డీఎంకే పార్టీ అధినేత స్టాలిన్‌ ఇటీవలే ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీయే ప్రధాని అభ్యర్థి అంటూ ప్రకటించేశారు. ఈ ప్రకటన కాస్త దేశ రాజకీయాల్లో అలజడి సృష్టించింది. ఆ తర్వాత ఎస్పీ నేత, మాజీ సీఎం అఖిలేష్‌ యాదవ్‌ సైతం తమ ప్రధాని అభ్యర్థి మాయావతి అంటూ ప్రకటించేశారు. ఉత్తరప్రదేశ్‌ లో బీఎస్పీ, ఎస్పీల మధ్య పొత్తుకుదరిన సందర్భంలో అఖిలేష్‌ యాదవ్‌ మమతను ప్రధాని అంటూ పొగడ్తలతో ముంచెత్తారు. తాజాగా మరోసారి ప్రధాని ఎవరు అనే అంశంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అఖిలేష్‌ యాదవ్‌. పశ్చిమబంగాలో ఆ రాష్ట్ర సీఎం టీఎంసీ అధినేత్రి మాయావతి నిర్వహించిన ర్యాలీలో పాల్గొనేందుకు హాజరైన అఖిలేష్‌ యాదవ్‌ దేశ ప్రధానిగా బీఎస్పీ అధినేత్రి మాయావతి లేదా, పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ అయితే బాగుంటుంది అని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దేశంలో మాయావతి, మమత బెనర్జీ ఇద్దరూ బలమైన నేతలేననీ, మహాకూటమిని నడిపించగల శక్తి వారిలో ఉందని స్పష్టం చేశారు. ప్రధాని అభ్యర్థి ఎవరన్నది సమస్య కాదని, ప్రస్తుతం తమ ముందన్న లక్ష్యం బీజేపీని ఓడించడమేనని ఆ తర్వాత కవర్‌ చేసుకున్నారు. అంతేకాదు దేశంలో మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో దేశానికి కొత్త ప్రధాని కావాలని, సరికొత్త నాయకత్వానికి తమ కూటమి నాంది పలుకుతుందని అఖిలేష్‌ యాదవ్‌ స్పష్టం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here