Featuredజాతీయ వార్తలు

ట్రిపుల్‌ తలాక్‌ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

న్యూఢిల్లీ (ఆదాబ్‌ హైదరాబాద్‌): లోక్‌సభలో ట్రిపుల్‌ తలాక్‌ బిల్లు ఆమోదం తెలిపింది. ఈ బిల్లుపై నిర్వహించిన ఓటిం గ్‌లో అనుకూలంగా 245 మంది, వ్యతిరేకంగా 11 మంది సభ్యులు ఓటు వేశారు. ట్రిపుల్‌ తలాక్‌ బిల్లును జాయింట్‌ సెలెక్ట్‌ కమిటీకి పంపించనందుకు నిరసనగా కాంగ్రెస్‌, అన్నాడీఎంకే సభ్యులు సభ నుంచి వాకౌట్‌ చేశారు. ఈ బిల్లుకు ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ ప్రతిపాదించిన పలు సవరణలు వీగిపోయాయి. ఈ బిల్లుపై సుమారు నాలుగు గంటలపాటు వాడీవేడి చర్చ జరిగింది. విపక్షాలు లేవనెత్తిన అభ్యంతరాలను విన్న తర్వాత ప్రభుత్వ సమాధానం ఇచ్చింది. అనంతరం నిర్వహించిన ఓటింగ్‌లో ఈ బిల్లుకు ఆమోదం లభించింది. సెప్టెంబర్‌లో తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ స్థానంలో ట్రిపుల్‌ తలాక్‌ బిల్లును కేంద్రం ఈ నెల 17న సభ ముందు పెట్టింది. వెంట వెంటనే మూడు సార్లు తలాక్‌ అంటూ ముస్లిం మహిళలకు విడాకులు ఇవ్వడాన్ని నేరంగా పరిగణిస్తూ కేంద్రం కొత్త చట్టం తీసుకొచ్చింది. మూడు సార్లు తలాక్‌ చెప్పే భర్తలకు ప్రస్తుత చట్టం ప్రకారం మూడేళ్ల వరకు జైలు శిక్ష పడుతుంది. రెండుసార్లు వాయిదా అనంతరం ఈ రోజు మధ్యాహ్నం 2గంటలకు తిరిగి లోక్‌సభ ప్రారంభం కాగానే కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ ముస్లిం మహిళల వివాహ హక్కుల రక్షణ బిల్లును ప్రవేశపెట్టి చర్చను ప్రారంభించారు. గతంలో ఈ బిల్లును లోక్‌సభ ఆమోదించినప్పటికీ రాజ్యసభలో వీగిపోవడంతో రద్దైంది. గతంలో ప్రతిపక్షాలు వ్యక్తంచేసిన పలు అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకొని ఆ మేరకు మార్పులు చేసి కొత్త చట్టం తీసుకొచ్చినట్టు కేంద్రమంత్రి తెలిపారు. ఈ బిల్లు మైనార్టీ మహిళల హక్కులు, వారిని న్యాయం చేసేందుకు సంబంధించిందని తెలిపారు. ముమ్మారు తలాక్‌ను క్రిమినల్‌ నేరంగా పరిగణించకూడదని పేర్కొనడం సమంజసం కాదన్నారు. ఈ సభ మహిళల గౌరవం కోసం ఉరిశిక్ష వేసే చట్టాలను చేసినప్పుడు అదే సభ ముమ్మారు తలాక్‌పై ఏకాభిప్రాయానికి ఎందుకు రాకూడదని రవిశంకర్‌ ప్రసాద్‌ ప్రశ్నించారు. లోక్‌సభలో వాడీవేడీ చర్చ కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ట్రిపుల్‌ తలాక్‌ బిల్లుపై గురువారం లోక్‌సభలో వాడీవేడి చర్చ జరుగుతోంది. ఈ రోజు రెండుసార్లు సభ వాయిదా అనంతరం మధ్యాహ్నం 2గంటలకు లోక్‌సభ తిరిగి ప్రారంభం కాగానే కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ ఈ బిల్లును ప్రవేశ పెట్టి చర్చను ప్రారంభించారు. ఈ బిల్లు ఏ కులానికీ, మతానికి, విశ్వాసానికి వ్యతిరేకం కాదని ఆయన తెలిపారు. ఇది మైనారిటీ మహిళల హక్కు, వారి న్యాయానికి సంబంధించినదని పేర్కొన్నారు. బిల్లుపై చర్చకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పలు దేశాలు ఈ బిల్లును రద్దు చేశాయన్నారు. బిల్లులో అభ్యంతరాలు ఉంటే పరిశీలిస్తామని ఆయన సభకు తెలిపారు. అంతకముందు కాంగ్రెస్‌ సహా ఇతర విపక్షాలు ట్రిపుల్‌ తలాక్‌ బిల్లుపై చర్చకు అభ్యంతరం తెలిపాయి. ఈ బిల్లును జాయింట్‌ సెలెక్ట్‌ కమిటీకి పంపాలని కోరాయి. దీంతో సభలో కాసేపు గందరగోళ వాతావరణం నెలకొంది. ట్రిపుల్‌ తలాక్‌ బిల్లు చాలా ముఖ్యమైనదని, రాజ్యాంగపరమైన అంశాలతో కూడుకున్నందున దానిపై అధ్యయనం చేయాల్సి ఉందని లోక్‌సభలో కాంగ్రెస్‌ పక్షనేత మల్లికార్జున ఖర్గే అన్నారు. రాజ్యాంగంలోని 13 (2), 14, 15, 21, 29 అధికరణల ఉల్లంఘన జరుగుతోందని, ఒక మతానికి సంబంధించిన విషయంలో కేంద్రం జోక్యం చేసుకొని చట్టం చేయడం ఎంతవరకు సరైనదని తేల్చాల్సిన అవసరం ఉందని తెలిపారు. అందుకే ఈ బిల్లును జాయింట్‌ సెలెక్ట్‌ కమిటీకి పంపాలని ఆయన కోరారు. జాయింట్‌ సెలెక్ట్‌ కమిటీకి పంపాలన్నదే విపక్షాల అందరి అభిప్రాయమని త ణమూల్‌ కాంగ్రెస్‌ సభ్యుడు సందీప్‌ బందోపాధ్యాయ తెలిపారు.

ఎవరినీ సంప్రదించలేదు?: అసదుద్దీన్‌

ఈ బిల్లుపై కేంద్ర ప్రభుత్వం ఎవరినీ సంప్రదించలేదని ఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ అన్నారు. ప్రజలు, ప్రతిపక్షాలు.. ఎవరినీ పరిగణనలోకి తీసుకోలేదని ఆక్షేపించారు. స్పీకర్‌ విచక్షణ అధికారాలు ఉపయోగించి దీన్ని జాయింట్‌ సెలెక్ట్‌ కమిటీకి పంపాలని ఆయన డిమాండ్‌ చేశారు.

ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నాం: ప్రేమ్‌ చంద్రన్‌

ట్రిపుల్‌ తలాక్‌ బిల్లును తాము వ్యతిరేకిస్తున్నామని ఆర్‌ఎస్పీ ఎంపీ ప్రేమ్‌ చంద్రన్‌ స్పష్టంచేశారు. ఈ బిల్లులో రాజకీయ ప్రయోజనాలే కనబడుతున్నాయని ఆయన విమర్శించారు. బిల్లును చట్టం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం తొందరపడుతోందని ఆయన ఆక్షేపించారు.

విశ్వాసం ఏదైనా మహిళలు విడాకులు కోరుకోరు

భాజపా ఎంపీ మీనాక్షి లేఖి

ట్రిపుల్‌ తలాక్‌ బిల్లుపై లోక్‌సభలో గురువారం వాడీవేడీ చర్చ జరిగింది. అధికార, విపక్ష నాయకులు దానిపై తమ అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు. ఈ బిల్లును జేపీసీకి పంపాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేస్తోంది. ఈ నేపథ్యంలో భాజపా ఎంపీ మీనాక్షి లేఖి సభలో మాట్లాడుతూ.. మతం, విశ్వాసం ఏదైనప్పటికీ మహిళలు విడాకులు కోరుకోరన్నారు. ‘మహిళలు వారి కుటుంబంతో కలిసి సంతోషంగా జీవితం గడపాలనుకుంటారు. భార్యకు విడాకులు ఇవ్వడానికి, వదిలివేయడానికి పురుషుడికి పూర్తి హక్కు ఇవ్వలేం’ అని వ్యాఖ్యానించారు. బట్టలు మార్చినంత సులభంగా మహిళలను మార్చగలుగుతున్నారని ఆమె ఆరోపించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close