Featuredఅంతర్జాతీయ వార్తలుజాతీయ వార్తలుప్రాంతీయ వార్తలురాజకీయ వార్తలువార్తలు

నీళ్ళు వదిలిన అసెంబ్లీ సంప్రదాయం..!

సంతాప తీర్మానం

? ఎందుకు ఇలా…?

? మొదటిరోజు నుంచి ‘మధ్యకు’

? సరిదిద్దుకోవాలని విశ్లేషకుల సూచ

(అనంచిన్ని వెంకటేశ్వరరావు, ఆదాబ్‌ హైదరాబాద్‌)

ప్రజాస్వామ్యానికి విలువైన వేదిక… అసెంబ్లీ సమావేశాలు. సంప్రదాయాలకు నిలువుటద్దం. ఇక్కడ ప్రస్థావించే ప్రతి అక్షరం రికార్డు రూపంలో భవిష్యత్‌ తరాలకు అందుబాటులో ఉంటుంది. నాయకుల బాగోతాలు బయట భయంకరంగా ఎలా ఉన్నా… ఉభయసభ (శాసనమండలి, శాసనసభ)లలో మాత్రం సభ్యుల పవిత్రతను హుందాగా, సగర్వంగా, సగౌరవంగా రక్షిస్తుంది. అయితే…. తాజాగా జరుగుతున్న

సమావేశాలలో… సరైన సమయంలో జరగాల్సిన సంప్రదాయ ప్రక్రియ మరోసారి జరగటం పట్ల ప్రజాస్వామ్య వాదులు ఆక్షేపణలు వ్యక్తం చేస్తున్నారు.

అసలు జరగాల్సింది ఏమిటి..?:

శాసనసభ సమావేశాలలో తొలిరోజు గవర్నర్‌ ప్రసంగం ఉంటుంది. ఆ ప్రసంగంలో ప్రభుత్వ చేసిన, చేస్తున్న అభివృద్ధి గురించి గవర్నర్‌ ప్రసంగిస్తారు. ఈ ప్రసంగాన్ని అధికార పార్టీ సభ్యులు చప్పట్లు చరుస్తూ ఆస్వాదిస్తారు. ప్రతిపక్షాలు మొటికలు విరుస్తూ విమర్శిస్తారు. అనంతరం గత సమావేశాలకు ప్రస్థుతం నిర్వహిస్తున్న సమావేశాలకు మధ్యన మరణించిన మాజీ రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధాని, ఉప ప్రధాని, రాష్ట్రంతో సంబంధాలు కలిగిన కేంద్ర మంత్రులు, గవర్నర్లు, శాసనమండలి, శాసన సభ్యులకు సంతాపం వ్యక్తం చేసే కార్యక్రమం ఉంటుంది. స్పీకర్‌ లేదా డిప్యూటీ స్పీకర్‌ ఆదేశాలతో ముఖ్యమంత్రి మొదట సంతాప తీర్మానం ప్రవేశపెడతారు. అందుకు అనుగుణంగా ముఖ్యమంత్రి ప్రసంగంతో సంతాప చర్చ ప్రారంభమవుతుంది. స్పీకర్‌ కూడా ఈ విషయంలో సభ్యుల అభిప్రాయాలకు… సాధారణ చర్చలకు భిన్నంగా కొంత వెసులుబాటు ఇస్తారు. మరణించిన ప్రముఖులతో తమ అనుబంధాలను భారంగా నెమరేసుకుంటారు. కొంత ఉద్విగ్న వాతావరణం ఉంటుంది. సభ కూడా గంభీరంగా కొనసాగుతుంది. ఇది సభా సంప్రదాయం.

ఎప్పటి నుంచి ఇలా..:

ప్రస్తుత అసెంబ్లీ భవవనం 1913లో నిర్మించారు. ఈ భవనం నిజానికి హైదరాబాద్‌ టౌన్‌ హాల్‌. 1905 లో నిజాం విూర్‌ మహాబూబ్‌ ఆలీఖాన్‌ 40వ పుట్టిన రోజు సందర్భంగా హైదరాబాద్‌ సంస్థాన రాష్ట్ర పౌరులు దీని నిర్మాణానికి అవసరమయిన నిధులు సేకరించారు. నిజాం నవాబు భారత సైనిక చర్య అనంతరం ఈ భవనం ప్రభుత్వ పరమైంది. తొలి నుంచి శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయి. అప్పుడప్పుడు అసెంబ్లీ ముట్టడి వంటి కార్యక్రమాలు జరిగినా పోలీసుశాఖ ఇప్పటిదాకా కాపాడుతూ వస్తుంది.

గత సమావేశాలలో..:

స్పీకర్‌ ఆదేశాలతో మొదలు కావలసిన తీర్మానాలు సంప్రదాయ రీతిలో కొనసాగుతున్నాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య జరిగే శ్రుతి మించిన వాగ్వాదాలను స్పీకర్‌ లేదా డిప్యూటీ స్పీకర్లు నియంత్రించడం పరిపాటి.

పిబ్రవరిలో జరిగిన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండోరోజున మాజీ గవర్నర్‌ ఎన్డీ తివారీతో పాటు ఇటీవల మృతి చెందిన 16 మంది మాజీ ఎమ్మెల్యేలకు శాసనసభ సంతాపం తెలిపింది. సంతాప సూచకంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం పంచాయతీరాజ్‌, జీఎస్టీ బిల్లులకు సవరణలు చేస్తూ తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ లను బిల్లుగా సభ ముందు ఇవాళ ప్రవేశపెట్టారు.

శాసనసభ, మండలిలో ప్రవేశపెట్టిన ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌పై చర్చ జరిగింది. అలాగే జులైలో జరిగిన రెండురోజుల సమావేశాలలో కూడా ఈ సంతాప తీర్మానాన్ని సజావుగానే జరిపారు.

జరగాల్సింది ఏమిటి..?:

అసెంబ్లీలో గవర్నర్‌ ప్రసంగం అనంతరం జరగాల్సిన సంతాప తీర్మానం ఈసారి మధ్యలో చేశారు. ‘ఇందులో తప్పేముంది’ అనుకునే సర్థుకునే వ్యవహారం కాదు. చిన్నదేం కాదు. సెంటిమెంట్‌ తో కూడుకున్న విషయం. పార్లమెంట్‌, రాజ్యసభ, అసెంబ్లీ శాసనసభ, శాసన మండలిలో అనేక సేవలందించిన ప్రముఖులకు సభ నివాళులు అర్పించే ఓ అద్వితీయమైన కార్యక్రమం. మరణించిన ఆ సభ్యుల కుటుంబాల స్వాంతనకు సంబంధించిన సున్నితమైన, భావోద్వేగాలతో కూడిన గంభీర అంశం.

ఈ నెల 9 నుంచి ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలలో తొలిరోజు గవర్నర్‌ ప్రసంగం చేశారు. అనంతరం ప్రవేశ పెట్టాల్సిన సంతాప తీర్మానం శనివారం ప్రవేశపెట్టారు. కేంద్ర మాజీమంత్రి జైపాల్‌ రెడ్డి, మాజీ శాసనసభ్యులు ముఖేష్‌ గౌడ్‌, సోమ్‌ భూపాల్‌, చెరుకు ముత్యంరెడ్డిల మృతికి సంతాప సూచికంగా 2నిమిషాలు మౌనం పాటించి, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని అసెంబ్లీ తెలిపింది.

పాత సంప్రదాయం కొనసాగించాలి:

ఈ సంతాప తీర్మాన గంభీర కార్యక్రమం తొలిరోజు గవర్నర్‌ ప్రసంగం అనంతరం చేస్తే బాగుండేదని రాజకీయ పరిశీలకుల అభిప్రాయం. వచ్చే అసెంబ్లీ సమావేశాలలో అయినా గతంలో కొనసాగించిన సంప్రదాయాన్ని కొనసాగించాలని ప్రభుత్వం కోరుకుందాం. మరణించిన సభ్యులకు అసెంబ్లీ తొలిరోజునే నివాళులు, సంతాప కార్యక్రమాలు చేపడతారని ఆశిద్దాం.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close