Featuredరాజకీయ వార్తలుస్టేట్ న్యూస్

ప్రశ్నించే గొంతులపై ఆసహానం..

ప్రతి పనికి అడ్డంకులే సృష్టిస్తున్నారంటూ ఆరోపణ..

ఆరునూరైనా సచివాలయం కట్టుడే…

ప్రజలకోసమే కొత్త భవనాలంటున్న కెసిఆర్‌…

సమస్యలపై దృష్టి పెట్టాలంటున్న ప్రతిపక్షం…

ప్రజలకోసం మంచిగ పనిచేస్తున్న.. అందరికి అన్ని అవకాశాలిస్తూ, కొత్త కొత్త పథకాలతో దేశానికే స్పూర్తిగా ఉంటున్నాం.. ప్రజల కోసం కష్టపడుతుంటే తాపుకొకలు దాపురించి అంతా నాశనం చేస్తున్నారంటూ ముఖ్యమంత్రి కెసిఆర్‌ ఆసహానం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.. ప్రజల నిర్ణయం మేరకు, ప్రజల ఆలోచన మేరకు పనిచేస్తే ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు ఎందుకు గొడవ చేస్తారనే విషయాన్ని అధినాయకులు ఎందుకు ఆలోచించడం లేదు.. నిజంగా ప్రజల కోసమే తపిస్తూ రాష్ట్రంలో లెక్కలేనన్ని సమస్యలున్నాయి. వాటిని వదిలేసి, చెక్కు చెదరకుండా ఉన్న సచివాలయ భవనం కూలడానికి సిద్దంగా ఉందంటూ వందల కోట్ల రూపాయలతో కొత్త సచివాలయాన్ని ఏలా నిర్మిస్తారని అడగడం తప్పేలా అవుతుందని ప్రశ్నించడం అధినేతకు తప్పుగా మారిపోయింది. ఒక పసిపాప అతి దారుణంగా అమానుషానికి బలైపోతే స్పందించడం చాతకాలేదు.. ఔట్‌ సోర్సింగ్‌ జాబ్‌ చేస్తూ నెలలు గడుస్తున్న జీతం రాకపోవడంతో అత్మహత్య చేసుకున్న యువత గుర్తుకురావడం లేదు.. ప్రజా సమస్యలు, రాష్ట్ర అభివృద్దిపై న్యాయం కోసం న్యాయస్థానాన్ని అశ్రయిస్తే అది మన పాలకులకు తప్పుగా కనబడుతోంది. ప్రజల కోసం పనిచేసే నాయకులు ఏం చేసినా చూస్తూ ఉండాలి.. భవనాలు కూలగొట్టిన, కొత్త భవనాలు నిర్మిస్తున్న చూస్తూనే ఉండాలనే తీరు మంచిది కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అభిప్రాయాలన్నీ తప్పంటూ తాము చేసిందే కరెక్ట్‌ అనే ధోరణి ఉండడం వల్లనే ప్రశ్నించే గొంతులు పెరుగుతు ఉన్నాయి.. ఇంకా పెరుగుతూ ఉంటాయనే విషయాన్ని గ్రహించాల్సిన అవసరం ఇప్పడు అధికారపార్టీకి అత్యవసరం…

హైదరాబాద్‌ ఆదాబ్‌ హైదరాబాద్‌ :

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ కోపం వచ్చేసింది. ప్రజల కోసం నిరంతరం కష్టపడుతుంటే కావాలనే అడ్డుకట్ట వేస్తున్నారని ఆరోపిస్తున్నారు. రాష్ట్రాభివృద్ది కోసం తాను చేస్తున్న ప్రయత్నాలకు అడుగడుగునా ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు అడ్డు పడుతున్న తీరు ఆయనలో అసహనం కొట్టొచ్చేలా కనిపిస్తోంది. తన కలల పంటైన కొత్త అసెంబ్లీ, సచివాలయం నిర్మాణం కోసం ఇప్పటికే పలు వ్యూహాల విూద వ్యూహాలు వేసి నిర్మాణానికి అంతా సిద్దం చేశారు ముఖ్యమంత్రి కెసిఆర్‌.. ఎంతమంది వచ్చినా, ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కొత్త అసెంబ్లీని, సరికొత్త సచివాలయాన్ని నిర్మించడమే ప్రధాన కర్తవ్యంగా ముందుకు వెళుతున్నాడని తెలుస్తోంది.. అందులో భాగంగా ఇర్రమంజిల్‌ దగ్గర కాకుండా ఇప్పుడున్న పాత సచివాలయాన్ని కూల్చేసి అదే స్థానంలో కొత్తది కట్టించాలని డిసైడ్‌ అయ్యినట్లు సమాచారం. అదే సమయంలో కొత్త అసెంబ్లీ భవనాన్ని ఎర్రమంజిల్‌ దగ్గర నిర్మించాలని.. అందులో భాగంగా చారిత్రక భవనమైన ఎర్రమంజిల్‌ ను కూల్చేయాలన్న నిర్ణయాన్ని తీసుకోవటం తెలిసిందే. ఇదిలా ఉంటే.. చారిత్రక ఎర్రమంజిల్‌ భవనాన్ని కూల్చేయాలన్న నిర్ణయంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ పలువురు స్వచ్చంధ సంస్థ ప్రతినిధులు కోర్టును ఆశ్రయించారు. ఈ అంశంపై హైకోర్టులో జరిగిన విచారణ సందర్భంగా.. చారిత్రక కట్టడాల్ని కూల్చివేసే అంశంపై ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ప్రభుత్వ భవనాన్ని ఏలా కూల్చి వేస్తారంటూ ప్రశ్నించింది. దేశంలో, రాష్ట్రంలో ఎన్నో పురాతన భవనాలు, అలయాలు ఉన్నాయని వాటిని కూడా అలాగే కూల్చివేస్తారా అంటూ నిలదీసింది. అజంతా ఎల్లోరా గుహలూ ప్రభుత్వానివేనని.. అంత మాత్రాన వాటిని కూల్చేస్తామంటే ఒప్పకుంటారా? అని వ్యాఖ్యానించటం సంచలనంగా మారిపోయిన విషయం అందరికి తెలిసిందే…

వితండవాదంతో అభివృద్దిని అడ్డుకుంటున్నారు..

రాష్ట్రంలో కొంతమంది ప్రతి అంశాన్ని వితండవాదం చేస్తూ అభివృద్దికి అడ్డుకట్ట వేస్తున్నారని కెసిఆర్‌ ఆరోపించారు. దేశంలో, రాష్ట్రంలో చారిత్రక, పురాతన భవనాలు చాలా ఉంటాయని, వాటిని అలా చూసుకుంటూ ఉంటే నూతన భవనాలు, అభివృద్ధి పనులు సాధ్యం కాదనే విషయంపై ప్రతిపక్షాలను ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది.. ఉస్మానియా ఆసుపత్రి చారిత్రక వారసత్వ భవనమని.. ఇప్పుడున్న స్థలంలోనే కొత్త ఆసుపత్రి నిర్మించాలని కొందరు అంటున్నారని.. కొన్ని నియమనిబంధనల కారణంగా పురాతన భవనాల్ని కూల్చివేయటం సాధ్యం కాదన్నారు. పాత భవనాల విషయంలో కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ఆయన పేర్కొన్న వితండవాదం మాటలు కొత్త తలనొప్పులు తప్పవన్నట్లుగా ఉన్నాయి. కోర్టును ఉద్దేశించి నేరుగా అనకున్నా.. పురాతన కట్టడాలు.. చారిత్రక భవనాల విూద తన అభిప్రాయంగా ముఖ్యమంత్రి చెప్పినప్పటికీ.. ఆయన వ్యాఖ్యలు తొందరపాటుతో కూడికున్నవన్న మాట పలువురి నోట వినిపిస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కోర్టుకు ఆగ్రహం తెప్పించే మాటలెందుకనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

అభివృద్ది అంటే భవనాలు కట్టడమేనా..

రాష్ట్రంలో అభివృద్ది అంటే పాత భవనాలు కూల్చేసి, కోట్ల రూపాయలతో కొత్త భవనాలు నిర్మించడమేనా అని ప్రతిపక్షాలి ప్రశ్నిస్తున్నాయి. రాష్ట్రంలో ఎన్నో చిన్న సమస్యలపై ప్రజలంతా నానా ఇబ్బందులు పడుతున్నారని, ప్రజల సమస్యలపై పట్టించుకొకుండా భవనాల వెంట పడడం కరెక్ట్‌ విషయం కాదనే ఆరోపణలు వస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చుతానని చెప్పినా ప్రభుత్వం ఇప్పుడు అప్పుల తెలంగాణగా మార్చి వేసిందని, ఇప్పటికి ఎన్నో ప్రభుత్వ పథకాలు నిధులు లేక పడకేసిన విషయాన్ని ప్రభుత్వం గుర్తించకుండా మళ్లీ కోట్ల రూపాయల అప్పులతో కొత్త భవనాలు నిర్మించడం సరియైన పద్దతే కాదన్నారు. ప్రజల తరపున ప్రజా సమస్యలపై పోరాడాల్సిన బాధ్యత ప్రతిపక్షాలపై, ప్రజాసంఘాలపై ఉందని వారు అంటున్నారు. కొత్తగా నిర్మించబోయే భవనాలపై అధికారపక్షం, ప్రతిపక్షం మధ్య గొడవలు చిలికి చిలికి గాలివానగా మారే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లోనే రాష్ట్రంలో మరో ఎన్నికలకు ప్రభుత్వం సిద్దమవుతోంది.. మరీ రాబోయే ఎన్నికల్లో ప్రజా తీర్పు అధికారపక్షం వైపో, ప్రతిపక్షం వైపో ఏలా ఉంటుందో చూడాల్సిందే.. వీరిద్దరి మధ్య ఎన్నికల రణరంగం రసవత్తరంగా జరగనుంది

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close