Featuredప్రాంతీయ వార్తలుస్టేట్ న్యూస్

సమ్మె మరింత ఉగ్రరూపం..

ఏకమవుతున్న అన్ని వర్గాలు..

కేంద్రానికి చేరిన రిపోర్టు..

సమ్మెపై స్పందించని కెసిఆర్‌..

పట్టువీడని ఆర్టీసీ కార్మికులు.

సమ్మె ఆగడం లేదు.. ప్రభుత్వం చొరవ తీసుకోవడం లేదు. ప్రయాణీకులు గత పదిహేను రోజుల నుంచి నిత్యం నరకం అనుభవిస్తున్నారు. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలియక అందోళన చెందేవారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతూనే ఉంది. ఇంటికి పెద్ద తండ్రి ఏలాగో, రాష్ట్రానికి పెద్ద దిక్కు ముఖ్యమంత్రి అని పిల్లలు తెలిసి, తెలియక తప్పులు చేసినా సముదాయించి ప్రేమగా చూడాల్సిన స్థానంలో ఉన్న అధినేత ఎందుకంత మొండి పట్టుదలతో ఉన్నారో ఎవ్వరికి అర్థం కావడం లేదు. నిరవధికంగా, నిరంతరాయంగా కొనసాగుతున్న సమ్మెను చర్చల ద్వారా పరిష్కరించుకుందామని ప్రభుత్వం అసలు ప్రయత్నం చేయడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. అధినేత తమకేమి పట్టనట్లుగా వ్యవహరించడం, కార్మికులకు ఇతర సంఘాలు, అన్ని వర్గాలు తోడవ్వడంతో సమ్మె ప్రభావం ఎక్కడికి దారితీస్తుందో తెలియడం లేదు. రాష్ట్రంలోని మంత్రులు సైతం ఎవరికి తోచినట్లుగా వారు మాట్లాడడంతో ఆగ్నికి మరింత ఆజ్యం తోడయినట్లుగానే కనబడుతోంది. యాభై వేల మంది ఉద్యోగులను తీసివేశామని ప్రభుత్వం చెప్పడం, ప్రయాణీకులకు ఇబ్బందులు కలగకుండా ప్రవేట్‌ వ్యక్తులతో పోలీస్‌ పహారాతో బస్సులు నడిపిస్తున్న ఆగచాట్లు మాత్రం తప్పడం లేదు. ఒక పక్క ఆర్టీసీ కార్మికులు, మరొపక్క ప్రభుత్వం ఏ ఒక్కరూ మెట్టు దిగడం లేదు. తెలంగాణపై ఎప్పటి నుంచో అధికారం దక్కించుకోవాలని కన్నేసినా బిజెపి ఆగ్రనాయకత్వం అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుందని తెలంగాణ గవర్నర్‌తో నివేదిక తెప్పించుకొని పరిశీలిస్తున్నట్లు తెలిసిందే. చర్చలకు రాష్ట్రం ప్రభుత్వం కావాలని చొరవ చూపడం లేదని తెలంగాణ ప్రజానీకం నుంచి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇంకెన్ని రోజులు సమ్మె కొనసాగుతుందో తెలియక ప్రయాణీకులు తలలు పట్టుకుంటున్నారు.

హైదరాబాద్‌ ఆదాబ్‌ హైదరాబాద్‌..

ఆర్టీసీ కార్మికులు నిరవధిక సమ్మె రోజురోజుకు పెరిగిపోతూనే ఉంది. మొదట ఒంటరిగా ప్రారంభమైనా సమ్మె రోజురోజుకు ఉగ్రరూపం దాల్చినట్లు కనబడుతోంది. అన్నివర్గాలు, అన్నిసంఘాలు ఆర్టీసీకి మద్దతు ప్రకటిస్తూ తోడుగా నిలుస్తున్నారు. నేరుగా ప్రభుత్వం చర్చలకు పిలిచే అంతవరకు సమ్మె విరమించేది లేదంటూ ఆర్టీసీ కార్మికులు సమ్మెను మరింత ఉదృతం చేస్తున్నారు. జిల్లాల వారీగా బంద్‌లు పాటిస్తూ, వివిధ కార్యక్రమాలు చేస్తున్నారు. ఇప్పుడు వీరికి టిఎన్జీవో సంఘం కూడా మద్దతు ప్రకటించింది. ఉస్మానియా యూనివర్శిటీ విద్యార్థులు వంటా, వార్పుతో పాటు ఆందోళనలు చేపడుతున్నారు. ఒక ప్రాంతమంటూ లేకుండా అన్ని ఏరియాలో సమ్మెను విస్తృతం చేస్తూ ముందుకు నడిపిస్తున్నారు. పదిహేను రోజుల నుంచి తెలంగాణ వ్యాప్తంగా ప్రజలు, ప్రయాణీకులు అష్టకష్టాలు పడుతున్నా ఒక అడుగు ముందుకేసి చర్చలకు పూనుకుందామని అధికార యంత్రాంగం ఆలోచించడమే లేదు. ప్రభుత్వం కార్మికుల సమస్యలపై ఏమి పట్టనట్లుగా వ్యవహరిస్తోందని అర్టీసీ అంటేనే చిన్నచూపుగా వ్యవహరిస్తుందని కార్మికులు ఆరోపిస్తున్నారు.. అందుకే తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఎత్తున సమ్మెలు, ఆందోళనలు, నిరసన ప్రదర్శనలు ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. ప్రభుత్వం దిగి వచ్చే అంతవరకు నిరవధిక సమ్మె నిరంతరం కొనసాగుతూనే ఉంటుందని చెపుతున్నారు. ఆర్టీసీ సమ్మె వలన ఇప్పటికి ఇద్దరూ కార్మికులు ఆత్మహత్య చేసుకొని మరణించగా, అనుభవం లేని డ్రైవర్లు ఆర్టీసీ బస్సులు నడపడం కారణంగా రోడ్డు ప్రమాదాలు జరగడంతో పాటు ప్రయాణీకులు మృత్యువాత పడుతున్నారు. తెలంగాణలో జరుగుతున్న ఆర్టీసీ సమ్మెపై తెలంగాణ గవర్నర్‌ డిల్లీకి వెళ్లి ఇక్కడి పరిస్థితులపై నివేదిక సైతం సమర్పించారు. గవర్నర్‌ సమర్పించిన నివేదిక ఆధారంగా కేంద్రం తెలంగాణలో ఏదైనా పాచికలు పారించే అవకాశం ఉందా, లేదా అనేది చూడాల్సిందే..

ఉదృతమవుతూనే ఉన్న ఆందోళనలు..

రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణలో సమ్మె తగ్గముఖం పట్టిన దాఖలాలు మాత్రం కనిపించడమే లేదు. పలుచోట్ల పోలీసులకు, ఆర్టీసీ ఉద్యోగులకు మధ్య ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంటున్నాయి. హైదరాబాద్‌తో సహా తెలంగాణలో ఆర్టీసీ కార్మికులకు అన్ని సంఘాలు, రాజకీయ పార్టీ నాయకులు మద్దతు ప్రకటిస్తూ నిరసనలు ముమ్మరం చేస్తున్నారు. కరీంనగర్‌, వరంగల్‌, నిజామాబాద్‌, ఖమ్మం జిల్లాలో ఆయా పార్టీలకు చెందిన రాజకీయ నాయకులు ఆందోళనలు చేస్తుండగా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. జిల్లాలో ఉంటున్న ముఖ్య నాయకులందరిని అదుపులోకి తీసుకుని వారిని ప్రత్యేక పోలీసు వాహనంలో ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. దీనివల్ల స్థానిక పోలీసులపై, ప్రభుత్వంపై పెద్ద ఎత్తున తీవ్రమైనా వ్యతిరేకత వస్తుంది. వందల మీటర్లు పొడవునా పోలీసుల వాహనాలకు పార్టీ కార్యకర్తలు, ఆర్టీసీ ఉద్యోగులు అడ్డు తగులుతున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయటంతో పాటు, న్యాయంగా నిరసన చేస్తే అరెస్ట్‌ చేయాల్సిన అవసరం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం చర్చలకు ఆహ్వనించాలనే ఆలోచన లేదని, అందుకు ఆర్టీసీ ఉద్యోగులను, వారికి మద్దతు పలికేవారిని తొక్కిపెడుతున్నారని విమర్శిస్తున్నారు. జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో పరిస్ధితి చేయి దాటిపోతుంది. తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల ఆందోళనతో పాటు విపక్షాలు పలుచోట్ల నిర్వహించిన ఆందోళనలు ఉద్రిక్తంగా మారిపోయాయి. ఆర్టీసీ కార్మికులతో చర్చలకు టిఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత కెకె మధ్యవర్తిత్యం వహిస్తారని ప్రచారం సాగింది. కాని అవన్నీ వట్టిమాటలనే తేలిపోయింది. కెకె చొరవతో చోటు చేసుకున్న సానుకూల వాతావరణం మొత్తం ముఖ్యమంత్రి కెసిఆర్‌ మౌనంతో పరిస్థితి అంతా మారిపోయిందంటున్నారు. ఆర్టీసీ సమ్మెతో ప్రభుత్వంపై విమర్శలు పెరుగుతున్న వేళ సమ్మెను ఒక కొలిక్కి తెచ్చే అవకాశం వచ్చినప్పుడు వెంటనే స్పందించకపోవటాన్ని తెలంగాణ ప్రజలు తప్పుబడుతున్నారు. సమ్మె ఇంకెన్ని రోజులు కొనసాగుతుందో, ఆర్టీసీ కార్మికులకు ఎప్పుడు విముక్తి కలుగుతుందో అర్థమే కావడం లేదంటున్నారు తెలంగాణ ప్రజలు. ఎవరికి వారుగా మొండి పట్టుదలతో ఉండడం వల్లనే ఇబ్బందులు ఎదురవుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి.

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close