ఆ నాలుగు సీట్లపై గులాబీ బాస్‌ ప్రత్యేక దృష్టి

0

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): రాష్ట్రంలోని ఒక్క స్థానం మినహా మిగిలిన 16 ఎంపీ స్థానాల్లో విజయం సాధించాలని టీఆర్‌ఎస్‌ వ్యూహత్మకంగా అడుగులు వేస్తోంది. ఈ 16 స్థానాల్లోని నాలుగు ఎంపీ స్థానాలపై గులాబీ బాస్‌ ప్రత్యేకించి దృష్టి సారించారు. దేశ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కేసీఆర్‌ రంగం సిద్దం చేసుకొన్నారు. ఈ మేరకు ఫెడరల్‌ ఫ్రంట్‌ పేరుతో కేసీఆర్‌ ప్రాంతీయ పార్టీలను ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నాలను చేస్తున్నారు. ఫెడరల్‌ ఫ్రంట్‌ సక్సెస్‌ కావాలంటే టీఆర్‌ఎస్‌ రాష్ట్రంలో 16 ఎంపీ సీట్లను కైవసం చేసుకోవాలని భావిస్తోంది. రాష్ట్రంలోని ఎంఐఎం చీఫ్‌ అసదుద్దీన్‌ ఓవైసీ ప్రాతినిథ్యం వహిస్తున్న హైద్రాబాద్‌ మినహా మిగిలిన 16 ఎంపీ స్థానాలపై టీఆర్‌ఎస్‌ కన్నేసింది. గత ఎన్నికల్లో చేవేళ్ల స్థానం నుండి టీఆర్‌ఎస్‌ అభ్యర్ధిగా పోటీ చేసిన కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి అసెంబ్లీ

ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. గత ఎన్నికల్లో మల్కాజిగిరి నుండి టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసి మల్లారెడ్డి విజయం సాధించారు. ఆ తర్వాత ఆయన టీఆర్‌ఎస్‌ లో చేరారు. మల్లారెడ్డి ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో మేడ్చల్‌ అసెంబ్లీ స్థానం నుండి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు.మల్కాజిగిరి నుండి గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్ధిగా మైనంపల్లి హన్మంతరావు పోటీ చేసి మల్లారెడ్డిపై ఓటమి పాలయ్యారు. నల్గొండ ఎంపీ స్థానం నుండి గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్ధిగా పోటీ చేసిన గుత్తా సుఖేందర్‌ రెడ్డి విజయం సాధించారు. ఆ తర్వాత ఆయన టీఆర్‌ఎస్‌ లో చేరారు. ప్రస్తుతం సుఖేందర్‌ రెడ్డి రైతు సమన్వయ సమితి ఛైర్మెన్‌గా కొనసాగుతున్నారు. సుఖేందర్‌ రెడ్డిని ఎమ్మెల్సీగా చేసి ఆ తర్వాత కేసీఆర్‌ తన కేబినెట్‌లోకి తీసుకొనే అవకాశం ఉంది. ఈ స్థానం నుండి వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌ పోటీ చేస్తారనే ప్రచారం సాగుతోంది. సికింద్రాబాద్‌ స్థానం లో గత ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధిగా బండారు దత్తాత్రేయ పోటీ చేసి విజయం సాధించారు. ఈ స్థానం నుండి ఆ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్ధిగా టీ.బీంసేన్‌ పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

ప్రస్తుతం నల్గొండ, మల్కాజిగిరి, చేవేళ్ల,సికింద్రాబాద్‌ స్థానాలపై టీఆర్‌ఎస్‌ కేంద్రీకరించింది. మల్కాజిగిరి పార్లమెంట్‌ స్థానంలో పోటీ చేసేందుకు టీఆర్‌ఎస్‌ నాయకత్వం బలమైన నాయకుల కోసం అన్వేషిస్తోంది. ఈ తరుణంలో శాసనమండలి ఛైర్మెన్‌ స్వామి గౌడ్‌ చేవేళ్ల పార్లమెంట్‌ స్థానం నుండి బరిలోకి దింపాలని భావిస్తున్నట్టు ప్రచారం సాగుతోంది. అయితే ఈ స్థానం నుండి పోటీకి స్వామిగౌడ్‌ ప్రస్తుతం ఆసక్తిగా లేడని చెబుతున్నారు. మరో వైపు సినీ నటుడు రామ్‌చరణ్‌ సతీమణి ఉపాసనను ఈ స్థానం నుండి బరిలోకి దింపుతారనే ప్రచారం సాగింది. కానీ ఈ ప్రచారాన్ని ఉపాసన కొట్టిపారేశారు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆమె కొడుకు కార్తీక్‌ రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరే అవకాశం ఉందని... అలా జరిగితే కార్తీక్‌ రెడ్డి టీఆర్‌ఎస్‌ అభ్యర్ధిగా చేవేళ్ల నుండి పోటీ చేసే అవకాశం ఉందనే ప్రచారం కూడ లేకపోలేదు.అయితే ఈ విషయాన్ని కాంగ్రెస్‌ వర్గాలు కొట్టిపారేస్తున్నాయి. 2014 ఎన్నికల్లో చేవేళ్ల ఎంపీ స్థానం నుండి సబితా ఇంద్రారెడ్డి తనయుడు కార్తీక్‌ రెడ్డి పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. ఇటీవల జరిగిన  అసెంబ్లీ ఎన్నికల్లో సబితా ఇంద్రారెడ్డి మహేశ్వరం నుండి కాంగ్రెస్‌ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించారు. గత ఎన్నికలతో పోలిస్తే సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ సెగ్మెంట్‌ పరిధిలో చాలా వ్యత్యాసం వచ్చిందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. గత ఎన్నికల్లో సికింద్రాబాద్‌ అసెంబ్లీ మాత్రమే విజయం సాధించారు.2018 ఎన్నికల్లో సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ పరిధిలో ఆరు సెగ్మెంట్లను  టీఆర్‌ఎస్‌ విజయం సాధించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here