పోచారం ఎన్నిక ఏకగ్రీవం

0

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): తెలంగాణ శాసనసభాపతి ఎన్నికకు నామినేషన్ల పక్రియ ముగియడంతో స్పీకర్‌ పదవికి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి ఒక్కరు మాత్రమే నామినేషన్‌ దాఖలు చేశారు. ఒకే ఒక నామినేషన్‌ దాఖలు కావడంతో స్పీకర్‌ ఎన్నిక ఏకగ్రీవం కానుంది. సభాపతిగా పోచారం శ్రీనివాస్‌ రెడ్డి ఎన్నికను శుక్రవారం అధికారికంగా ప్రకటించనున్నారు. దీంతో శుక్రవరాం 11గంటలకు ఆయన సభలోకి రానున్నారు. వెంటనే సభకార్య క్రమాలను నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా పోచారం శ్రీనివాస్‌ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను

కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. అసెంబ్లీలో సీఎం చాంబర్‌కు వెళ్లి ధన్యవాదాలు తెలియ జేశారు. తెలంగాణ శాసనసభాపతిగా బాన్సువాడ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఖరారయ్యారు. ఈ మేరకు ఆయన శాసనసభాపతి అభ్యర్థిగా గురువారం నామినేషన్‌ దాఖలు చేశారు. పోచారం తరఫున ఆరు ప్రతిపాదనలు సమర్పించారు. దీంతో నెలరోజులుగా స్పీకర్‌గా ఎవరుంటారనే ఉత్కంఠతకు నేటితో తెరపడినట్లయింది. గురువారం ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకూ సభాపతి అభ్యర్థి కోసం ప్రతిపాదనలు స్వీకరిస్తారు. పోచారం పేరును ప్రతిపాదించిన వారిలో సీఎం కేసీఆర్‌తోపాటు మల్లు భట్టి విక్రమార్క, అహ్మద్‌ బలాల, సురేఖా నాయక్‌, అబ్రహం ఉన్నారు. స్పీకర్‌గా పోచారంకు మద్దతుగా కాంగ్రెస్‌తో సహా శాసనసభలో ప్రాతినిధ్యం ఉన్న అన్ని పార్టీలు మద్దతు తెలిపాయి. దీంతో ఎన్నిక ఏకగ్రీవం అయినట్లయింది. ఆదినుంచి ముఖ్యమంత్రి కేసీఆర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ మేరకు బుధవారం రాత్రి కేసీఆర్‌.. పోచారంతో మాట్లాడారు. గురువారం ఉదయమే పోచారం పేరు ప్రకటించి, ఆయనతో నామినేషన్‌ దాఖలు చేయించారు. సభాపతి ఎన్నికకు సంబంధించి సీఎం కేసీఆర్‌ గత నెల రోజులుగా కసరత్తు చేశారు. ఈ పదవికి అర్హులుగా భావించి ఒక జాబితాను రూపొందించారు. పలువురు నేతలతో మాట్లాడారు. చివరికి ఆయన పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేరు ఖరారు చేశారు. అనుభవం, వాక్పటిమ కారణంగా పోచారం సభను సమర్థంగా నిర్వహించగలరని సీఎం భావిస్తున్నట్లు తెలిసింది. ఇంజినీరింగ్‌ పట్టభద్రుడైన పోచారం శాసనసభకు ఆరోసారి ఎంపికయ్యారు. వ్యవసాయ మంత్రిగానూ బాగా పనిచేశారని సీఎం భావిస్తున్నారు. ఇప్పటికే ఆయనను ఒప్పించేందుకు పలు దఫాలు చర్చలు జరిపారు. వయస్సు, ఆరోగ్యపరమైన సమస్యలను ఆయన సీఎం దృష్టికి తెచ్చినా.. వాటిపరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవని సీఎం భరోసా ఇచ్చినట్లు తెలిసింది. పోచారం వచ్చే ఎన్నికల్లో పోటీ చేయలేని పరిస్థితి ఉంటే ప్రత్యామ్నాయంగా ఆయన కుమారుడికి అవకాశం ఇచ్చేందుకు కూడా సీఎం నుంచి హావిూ లభించినట్లు సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here