Featuredస్టేట్ న్యూస్

బాసరలో అవినీతి తాండవం…

  • సరస్వతిక్షేత్రంలో దళారులదే దందా..
  • గుట్టచప్పుడు కాకుండా టెండర్లు…

అక్కడ చదివితే సరస్వతీ దేవి దీవెనలుంటాయి అనుకుంటారు. అందుకే ప్రతి విద్యార్థి అక్కడ చదవాలని కోరుకుంటారు. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఆ తల్లి దీవెనలుండాలని తాపత్రయపడుతారు.. అలాంటి చదువుల తల్లి సరస్వతిదేవి కోలువైన బాసరలో అవినీతి రాజ్యమేలుతోంది. సంపాదనే ధ్యేయంగా పనిచేస్తున్న కొంతమంది అధికారులు ఆ సరస్వతిదేవి క్షేత్రాన్ని అక్రమాలకు అడ్డాగా మార్చుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఎంతో కష్టపడి ట్రిపుల్‌ ఐటిలో సీటు సంపాదించుకున్న విద్యార్థులకు ఏ పని కావాలన్నా, ఏలాంటి సౌకర్యాలు అందాలన్నా డబ్బుతో ముడిపెడుతున్నట్లు తెలుస్తోంది.. విద్యార్థులు తాగే నీళ్లనుంచి వేసుకునే దుస్తులు, షూస్‌, వాడుకునే ల్యాప్‌టాప్‌ వంటి ప్రతి వస్తువులో భారీగా అవినీతి చేతులు మారుతోందని పవిత్రమైన సరస్వతి క్షేత్రాన్ని అవినీతికంపుగా మార్చుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి..

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌కు కేరాఫ్‌ అడ్రస్‌గా తెలంగాణలోనే ఏకైక ట్రిపుల్‌ ఐటీగా పేరుగాంచినది సరస్వతీ క్షేత్రం బాసర ట్రిపుల్‌ ఐటీ. అక్కడ చదివితే జీవితం చాలు ఏదోరంగంలో ముందుకుపోవాలనుకుంటారు విద్యార్థులు.. అందుకే బాసర ట్రిపుల్‌ ఐటీలో సీటుకోసం మరీ పోటిపడుతారు. చదువుల తల్లి నీడలో, సరస్వతి దేవి దీవెనలతో ముందుకు పోదామనుకుంటున్న విద్యార్థులకు అక్కడ చేదు అనుభవాలు మిగులుతున్నాయి.. సరస్వతీక్షేత్రాన్ని అక్రమాలకు కేరాఫ్‌గా మార్చారనే విమర్శలు వినిపిస్తున్నాయి. రాజీవ్‌ గాంధీ వైజ్ఞానికి సాంకేతిక విశ్వవిద్యాలయం ఆర్‌జియుకెటి పరిధిలోని బాసర ట్రిపుల్‌ ఐటీలో సీటు కోసం పోటీ ఎక్కువగానే ఉంటుంది. టెన్త్‌ తర్వాత ఎంట్రెన్స్‌ రాసి ఎంట్రీ ఇస్తే.. ఆరేళ్ల తర్వాత మేటీ ఐటీ సంస్థల్లో ఉద్యోగం సంపాదించి దర్జాగా బయటకు రావొచ్చు. ట్రిపుల్‌ ఐటీలో సీటు సంపాదించిన విద్యార్థులకు డ్రెస్‌, షూస్‌, ల్యాప్‌టాప్‌లాంటి సౌకర్యాలను ఉచితంగా ఇస్తారు. అయితే… ట్రిపుల్‌ ఐటీలో చదువుకునే విద్యార్ధులకు అందించే ప్రతీ పనిలో భారీగా అవినీతి చోటు చేసుకుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ పనులు చేపట్టాలంటే ఎక్కడైనా టెండర్‌ పిలుస్తారు. తక్కువ కోట్‌ చేసినవారికి ఆ పనులు అప్పగిస్తారు. కానీ.. ఈ యూనివర్సిటీ మాత్రం దానికి పూర్తిగా భిన్నంగా వెళుతోందనే ఆరోపణలున్నాయి..

అక్కడి అధికారులదే ఇష్టారాజ్యం… 2018ా19 విద్యాసంవత్సరంలో ట్రిపుల్‌ ఐటీ కోసం 1500 ల్యాప్‌టాప్‌ల కొనుగోలుకు ఈాప్రొక్యూర్‌మెంట్‌ టెండర్‌ ఇచ్చారు. పలు కంపెనీలు ముందుకు వచ్చినా… ఊఖ సంస్థ ఆ టెండర్‌ను దక్కించుకుంది. ఇంతకీ వర్సిటీ కొనుగోలు చేసిన ల్యాప్‌టాప్‌ల ధర ఎంతో తెలుసా… ఒక్కోదానికి అక్షరాలా 51వేల 600 రూపాయలు. అదే సాఫ్ట్‌ వేర్‌ సేమ్‌ కాన్ఫిగరేషన్‌తో ఏసర్‌ కంపెనీ 36 వేల 950 రూపాయలకే అందిస్తామని టెండర్‌ వేసినా… పట్టించుకోలేదు. ఎందుకంటే… ఎవరికి టెండర్‌ దక్కాలో ముందే డిసైడ్‌ చేస్తున్నారు. అందుకే ఎక్కువ ధర కోట్‌ చేసినా ఆ కంపెనీకే టెండర్‌ దక్కింది. అయితే.. ఈ డీల్‌లో 2 కోట్ల రూపాయల వరకు చేతులు మారాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ అక్రమాలు బయటపడకుండా కొంత మందిని మేనేజ్‌ చేస్తున్న ఫోన్‌ సంభాషణ కూడా వెలుగులోకి వచ్చింది. ఈ సంభాషణలో మాట్లాడుతున్న ఇద్దరిలో ఒకరు కీలక వ్యక్తికి పీఏగా ప్రచారం చేసుకుంటున్నాడు. ఈ వ్యవహారం బయటపడకుండా ఎవరెవరికి ఎంతెంత ఇవ్వాలో కూడా ఫిక్స్‌ చేశారు. ఇక.. సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంక్‌ ఫిల్టర్‌ బెడ్ల నిర్వహణ విషయానికి వస్తే.. వీటి నిర్వహణకు 96లక్షలు ఖర్చు చేస్తున్నారు. ప్రభుత్వ ఇతర మంచినీటి శుద్ధికేంద్రాల్లో కోటి రూపాయలతో ఏకంగా ఒక టీయంసీ నీటిని శుద్ధి చేస్తుంటే.. ఇక్కడ మాత్రం అందులో వందో వంతు అంటే 0.003 టీఎంసీల నీటి శుద్ధికి దాదాపు కోటి రూపాయలు వెచ్చిస్తున్నారు. దీంట్లో కూడా భారీగా అవినీతి చోటుచేసుకుందనే వాదన బలంగా వినిపిస్తోంది. ట్రిపుల్‌ ఐటీలో టెండర్లను దక్కించుకునేది, కావాల్సిన సామగ్రిని అందించేది ఒక్క శివోహం సేల్స్‌ కార్పొరేషన్‌ కంపెనీ మాత్రమే. దీన్ని బ్లాక్‌ లిస్టులో పెట్టినా… నోడల్‌ ఏజెన్సీ ద్వారా ఇప్పటికీ కావాల్సిన పనులు గుట్టుగా చక్కబెట్టేస్తోంది. ఈ అవినీతి పనుల్లో ముఖ్య అధికారి చెప్పిందే చెల్లుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాసుల కక్కుర్తికి అలవాటు పడిన ఆయన… తన పదవీ కాలం ముగిసేలోగా అడ్డదిడ్డంగా సంపాదించడమే టార్గెట్‌గా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. వచ్చే విద్యాసంవత్సరానికి కూడా.. ఇప్పుడే టెండర్లు పిలిచి అక్రమార్జనకు దారులు తెరిచాడు. అక్రమాల్లో తన పేరు బయటకు రాకుండా ఆ అధికారి జాగ్రత్తపడుతున్నారని వినికిడి. ఎక్కడ కూడా ఆ అధికారి ప్రత్యక్షంగా పాల్గనకుండా.. తన పీఏతో పనులు చక్కబెట్టేస్తాడని వినిపిస్తోంది. ఇన్ని అక్రమాలు జరుగుతున్నా పట్టించుకునే వారే లేరంటున్నారు విద్యార్థులు. ఇప్పటికైనా ట్రిపుల్‌ ఐటీపై సర్కార్‌ దృష్టిసారించాలని.. అక్రమాలకు చెక్‌ చెప్పాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు డిమాండ్‌ చేస్తున్నారు…

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close