Featuredస్టేట్ న్యూస్

మసకబారుతున్న సామాన్యుడి చట్టం

సహచట్టంపై ప్రభుత్వాలకెందుకీ వివక్ష

తూతూ మంత్రంగానే నియమకాలు

చట్టం సామాన్యుల దరిచేరేదేలా

నిపుణులకు పట్టించుకొని ప్రభుత్వం

అవినీతిపై వజ్రాయుధం.. సామాన్య మానవుడికి రామబాణంలాంటి చట్టం.. ప్రభుత్వ పథకాలలో అవినీతి జరిగినా, అర్హులైనా లబ్దిదారులకు అన్యాయం జరిగినా నిలదీసి, నిగ్గదీసి ప్రశ్నించే హక్కు సమాచారహక్కు చట్టానికి ఉంది. మన దేశంలో వందలాది చట్టాలున్నాయి, కాని సామాన్యుడికి నేనున్నానని భరోసానిస్తూ, భద్రత కల్పించేది ఒక్క సహచట్టం మాత్రమే. అలాంటి సహచట్టంలో రాజకీయ ప్రవేశం ఎక్కువైపోతుంది. రాజకీయాలకు అతీతంగా, నిజాయితీగా పనిచేసిన రిటైర్ట్ అధికారులనో, స్వచ్చంధ సంస్థ ప్రతినిధులనో సహ చట్టం కమిషనర్లుగా ఎంపిక చేయాల్సిన ప్రభుత్వం నిభందనలను తుంగలో తొక్కుతూ తమ ఇష్టానుసారంగా ఎంపికచేస్తోంది. ఎంపికైనా వారిలో సహచట్టంపై పనిచేయనే వారే ఎక్కువశాతం ఉండడం విస్తుగొలుపుతోంది. ప్రభుత్వ అధికారులు అంతో, కొంతగా పనిచేస్తున్నారనడానికి ప్రధాన కారణం సహచట్టమే. అలాంటి శక్తివంతమైన చట్టంలో రాజకీయాలకు సంబంధం ఉన్నవారిని నియమిస్తే వారెలా అన్యాయం జరిగిందని కమిషన్ కు వస్తున్న సామాన్యుడికి న్యాయం చేస్తారో అర్థం కావడం లేదు. ప్రజలకు సంబంధించిన చట్టాలను ప్రభుత్వాలు కావాలనే తుంగలో తొక్కుతున్నారనే విషయం అర్థమవుతూనే ఉంది. ప్రజల్లో చైతన్యం రావొద్దనే, ప్రశ్నించే ఆలోచన అణిచివేయడమే కూడా ఒక ప్రధాన కారణంగా చెప్పవచ్చు

హైదరాబాద్ ఆదాబ్ హైదరాబాద్:

అధికారంలోకి రాకముందు ప్రతి ప్రభుత్వం అవినీతి రహిత పాలన అందిస్తూ, ప్రజలకు జవాబుదారీతనంగా ఉంటామని చెపుతారు. తీరా అధికారంలోకి వచ్చాక ఎన్నికల ముందు చెప్పిన హమీలను, వాగ్దానాలను మరిచిపోవడం మన పాలకులకు అలవాటుగా మారిపోయింది. ప్రతి ప్రభుత్వ శాఖలో తమకు నచ్చిన వారికే అందలాలు ఎక్కిస్తూ, నీతిగా, నిజాయితీగా పనిచేసే వారిని పక్కనపెడుతున్నారనే విషయం ప్రజానీకానికంతా తెలిసిందే. ఇప్పుడు సామాన్యుడికి అవసరమైనా సమాచార హక్కు చట్టం కమిషన్ల నియామక విషయంలో కూడా రాజకీయాలకు సంబంధం ఉన్నవారిని ఎంపిక చేసి మళ్లీ అధికార శక్తి చూపించారు.

నియమితులైన సహచట్టం కమిషనర్లు

కట్టా శేఖర్ రెడ్డి నల్లగొండ జిల్లా మాడగులపల్లి ప్రాంతానికి చెందిన వారు. పాత్రికేయరంగంలో మూడు దశాబ్దాలకు పైగా అనుభవం ఉంది. 2014 సంవత్సరం నుంచి అధికార పార్టీకి చెందిన నమస్తే తెలంగాణ పేపర్ లో ఎడిటర్ గా పనిచేస్తున్నారు. అంతకుముందు వివిధ దినపత్రికల్లో పనిచేశారు. కాని సమాచారహక్కు చట్టంపై అంతో కొంత అవగాహన ఉంది. కాకపోతే అధికార పార్టీకి చాలా దగ్గర మనిషి అనే విషయం అందరికి తెలిసిందే. సమాచారహక్కు చట్టంపై ఏలాంటి కార్యక్రమాలు చేస్తారో చూడాల్సిందే..

మైద నారాయణరెడ్డి సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండలం రుసుపూర్ గ్రామానికి చెందినవారు. డిగ్రీ వరకు చదివారు. గతంలో పలు పత్రికల్లో పనిచేశారు. జర్నలిజంపై పట్టున్న వ్యక్తి. 2014 నుంచి 2019 వరకు ప్రెస్ అకాడమీ సభ్యుడిగా పనిచేశారు. ప్రస్తుతం అధికార పార్టీకి చెందిన న్యూస్ ఛానల్ లో పనిచేస్తున్నారని సమాచారం. వీరికి ఇప్పటివరకు సమాచార హక్కుకు ఎక్కడ సంబంధం లేదు. అధికార పార్టీకి దగ్గరని వీరిని కూడా కమిషనరుగా నియమించారు. ప్రజల్లోకి సహచట్టాన్ని ఏలా తీసుకెళతారో చూడాల్సిందే..

మహ్మద్ అమీర్ హుసేన్ హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ ప్రాంతానికి చెందినవారు. ప్రస్తుతం న్యాయ సలహదారుగా ఉన్నారు. బాలల హక్కులు, న్యాయ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ వివిధ స్వచ్చంధ సంస్థలతో కలిసి అనేక సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారని సమాచారం. వీరు సామాన్యుడి వజ్రాయుధమైనా సమాచారహక్కు చట్టాన్ని ప్రజల్లోకి ఏలా తీసుకెళతారో, ఏలా అవగాహన కల్పిస్తారో, ఏలాంటి తీర్పులు ఇస్తారో చూడాల్సిందే. ఇతను కూడా అధికార పార్టీ మనిషి అని సమాచారం.

శంకర్ నాయక్ మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం బావోజీగూడెం గ్రామం బోజ్యతండాకు చెందినవారు. విద్యార్థి సంఘం నాయకుడిగా పేరుగాంచారు. ప్రస్తుతం ఉస్మానియా యూనివర్శిటీలో పిహెచ్ డీ చేస్తున్నారు. గిరిజన విద్యార్థి సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడిగా, ఉస్మానియా జెఎసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేసినట్లు సమాచారం. అధికార పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనే కార్యకర్త అని పేరుంది. ఇతనిని సహచట్టం కమిషనర్ గా నియమితులయ్యారు. వీరికి సమాచారహక్కు చట్టంతో ఇప్పటివరకు ఏలాంటి సంబంధం లేదు. సామాన్యులకు సంబంధించిన ఈ చట్టంపై ఏలా పనిచేస్తారో చూడాల్సిందే..

సయ్యద్ ఖలీలుల్లా హైదరాబాద్ ఆఘాపురకు చెందినవారు. న్యాయవాద వృత్తిలో ఉన్నారు. సిటీ క్రిమినల్ కోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్నారు. గల్ఫ్ లో పనిచేస్తున్న వారికి తమ హక్కులపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. అనేకమందికి న్యాయం అందిస్తారని సమాచారం. అధికారపార్టీకి చెందిన దగ్గరి వ్యక్తులతో మంచి సంబంధం ఉందని సమాచారం. సామాన్యుడికి ప్రధానమైనా సమాచారహక్కు చట్టాన్ని ప్రజల్లోకి ఏలా తీసుకెళతారో చూడాల్సిన విషయమే..

ఏదో ఒక రకంగా రాజకీయ సంబంధాలే

పేద ప్రజల పాతుపశాస్త్రమైనా సమాచార హక్కు చట్టం అంటేనే రాజకీయనాయకులకు, పాలకులకు అస్సలు పడదనే ప్రచారం ఉంది. అలాంటి చట్టంలోకి మంచిపేరు గల వారిని, మంచి వారిని ఎంపిక చేస్తే చట్టం ప్రజల్లోకి విస్తృతంగా వెళుతోంది. అడుగడుగునా అధికార పార్టీకి నాయకులందరికి ఆటంకాలే ఎదురవుతాయి. అందుకే రాష్ట్రంలో అధికారంలో ఉన్న పాలకులు వారికి నచ్చినవారిని, వారి పార్టీ సన్నిహితులను, సానుభూతిపరులను మాత్రమే కమిషనర్లగా నియమిస్తూ చట్టాన్ని ఎదగనీయకుండా చేస్తున్నారనే ప్రచారం ఇప్పటి నియమాకాన్ని బట్టి చూస్తేనే అర్థమవుతోంది. తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు నియమించిన ఐదుగురు, ఇంతకుముందు నియమితులైనా ఇద్దరూ కూడా అధికారంలో ఉన్న పార్టీకి ఏదో ఒక రకంగా దగ్గరివారేననే విషయం ప్రచారం జరుగుతోంది. పార్టీ ఏదైనా కమిషనర్లుగా నియమితులైనవారు, న్యాయం కోసం వచ్చెవారికి న్యాయం చేస్తూ, సమాచార హక్కు చట్టంపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పిస్తే అంతకంటే కావాల్సిందీ లేదు. లేదా కమిషనర్లుగా నియమితలైనవారు చూసీచూడనట్టు ఉంటే మాత్రం సామాన్యుడి ఏకైక చట్టం మరింత లోతులోకి పోయే ప్రమాదం ఉంది.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close