తెలంగాణలో కల్వకుంట్ల రాజ్యాంగం

0

ఆమరణ దీక్షగా మారిన నిరసన..!

  • రాజకీయ ఉన్మాదిలా కేసీఆర్‌
  • భట్టి దీక్షకు మద్దతు తెలిపిన రేవంత్‌రెడ్డి

కాంగ్రెస్‌ నేత, మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ధ్వజమెత్తారు. కేసీఆర్‌ అంబేడ్కర్‌ రాజ్యాంగాన్ని కాదని.. కల్వకుంట్ల రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్‌ చేస్తున్న అరాచకాలకు నిరసనగా ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం దీక్షలు చేస్తున్నట్లు చెప్పారు. సీఎల్పీ విలీనాన్ని నిరసిస్తూ ఇందిరా పార్కు వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన భట్టి విక్రమార్కకు మద్దతు తెలిపిన అనంతరం ఆయన మాట్లాడారు. దళితుడనే కాకుండా ప్రశ్నించేతత్వం, సమర్థుడనే కారణంతోనే మల్లు భట్టి విక్రమార్కను కాంగ్రెస్‌ పార్టీ ప్రతిపక్ష నాయకుడిని చేసిందని రేవంత్‌ స్పష్టం చేశారు. శాసనసభ్యుల విలీన ప్రక్రియ స్పీకర్‌ పరిధిలో ఉండదన్నారు. కాంగ్రెస్‌ పార్టీ 12 మంది ఎమ్మెల్యేల విూద ఫిర్యాదు చేస్తే పట్టించుకోని స్పీకర్‌.. విలీనాన్ని ఎలా ఆమోదిస్తారని ప్రశ్నించారు. ఐదేళ్లలో కేసీఆర్‌ ఫిరాయింపుల విూద పెట్టిన శ్రద్ధ.. రెండు పడక గదుల ఇళ్లు, నిరుద్యోగులపై పెట్టి ఉంటే బాగుండేదన్నారు. కేసీఆర్‌ రాజకీయ ఉన్మాదానికి పాల్పడుతున్నారని విమర్శించారు.

ఆమరణ దీక్షగా మారిన భట్టి విక్రమార్క నిరసన..!

శాసనసభా పక్షాన్ని తెరాస ఎల్పీలో విలీనం చేయడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్‌ నాయకులు చేస్తున్న దీక్ష రెండో రోజుకి చేరుకుంది. 36 గంటలపాటు నిరసన తెలుపుతామంటూ దీక్షకు దిగారు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క. అయితే, రెండోరోజుకి చేరుకునేసరికి.. ఆ దీక్షను ఆమరణ దీక్షగా కొనసాగిస్తారని పీసీసీ ఛీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ప్రకటించారు. నిరసన తీవ్రత మరింత పెంచుతామని ఆయన అంటున్నారు. దీన్ని ఇక్కడితో ఆపకూడదనీ, ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ జరిగాలనీ, స్పీకర్‌ తీరుపైనా సీఎం కేసీఆర్‌ అనుసరిస్తున్న రాజకీయ విధానాలపైనా రాష్ట్రమంతా చర్చ జరగాలంటే.. దీక్షను కొనసాగించడమే ఉత్తమం అని టి. కాంగ్రెస్‌ నేతలు నిర్ణయించారు. భట్టి దీక్షకు సంఘీభావం తెలిపేందుకు రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ ఛార్జ్‌ కుంతియాతోపాటు, జీవన్‌ రెడ్డి, టీడీపీ నుంచి రావుల చంద్రశేఖర్‌, టీజేయస్‌ అధినేత కోదండరామ్‌ సహా పలువురు ప్రముఖులు ఇందిరా పార్క్‌ దగ్గరున్న దీక్షాస్థలికి చేరి వారి సంఘీభావం తెలిపారు. ఓరకంగా, కాంగ్రెస్‌ పార్టీకి సంబంధించిన అతి ముఖ్యమైన కార్యక్రమంగా దీన్ని చూడాలి. వరుస ఓటములు తరువాత తెరాసపై ధీటైన పోరాటాన్ని కొనసాగించేందుకు ఇదే మంచి సందర్భం. ఎందుకంటే, ఫిరాయింపులపై ప్రజల్లో కూడా కొంత చర్చ జరుగుతోంది. తెరాసకు అసెంబ్లీలో స్పష్టమైన మెజారిటీ ఉండి కూడా? ఇలా ఫిరాయింపుల్ని ప్రోత్సహించి, సీఎల్పీ విలీనం చేసేంత వరకూ వెళ్లాల్సిన అవసరం ఏముందనే అంశంపై చాలా విమర్శలు వినిపిస్తున్నాయి. సీఎల్పీ విలీనం రాజ్యాంగబద్ధంగానే జరిగిందని తెరాస నేతలు చెబుతున్నా, ఇది రాజకీయ కక్ష సాధింపు ధోరణిగానే కనిపిస్తున్న పరిస్థితి! 36 గంటల దీక్షను ఆమరణ దీక్షగా కొనసాగించాలని కాంగ్రెస్‌ నిర్ణయించినా? దీనిపై పోలీసుల స్పందన ఎలా ఉంటుందనేది వేచి చూడాలి. ఎందుకంటే, కాంగ్రెస్‌ పార్టీకి 36 గంటలే నిరసన తెలిపేందుకు పోలీసులు అనుమతి ఇచ్చారు. ఆ సమయం పూర్తిగానే పోలీసులు ఎలా వ్యవహరిస్తారనేది చూడాలి. కాంగ్రెస్‌ నిర్ణయించినట్టుగా దీక్ష కొనసాగించేందుకు అనుమతి పొడిగిస్తారా? లేదంటే, శిబిరాన్ని బలవంతంగా ఖాళీ చేసే పరిస్థితి ఉంటుందా అనేదీ కొంత ఆసక్తికరంగా మారింది. ఏదేమైనా, ఈ పోరాటం కొనసాగుతుందనీ, రాష్ట్రంతోపాటు జాతీయ స్థాయిలో కూడా దీనిపై చర్చించే విధంగా తమ కార్యాచరణ ఉంటుందని భట్టి అంటున్నారు. త్వరలోనే రాష్ట్రపతిని కలిసి, సీఎల్పీ విలీనం తీరుపై ఫిర్యాదు చేస్తామని అంటున్నారు. ఫిరాయింపులపై న్యాయ పోరాటానికీ కాంగ్రెస్‌ సిద్ధమైన సంగతి తెలిసిందే.

ప్రజాస్వామ్య పరిరక్షణ సత్యాగ్రహం పేరుతో చేపట్టిన ఈ దీక్ష తొలుత 36 గంటలపాటు చేయాలని భావించారు. అయితే భట్టి నిరవధిక నిరసన దీక్షకు దిగుతున్నట్లు టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ ప్రకటించారు. తమ డిమాండ్లను పరిష్కరించే వరకు వెనక్కి తగ్గమని ప్రకటించారు. దీక్షలో కూర్చున్న భట్టికి డాక్టర్లు వైద్య పరీక్షలు చేశారు. బీపీ, షుగర్‌ లెవల్స్‌ చెక్‌ చేశారు. భట్టీకి మద్దతు తెలుపుతూ ధర్నాచౌక్‌ దగ్గర ఆయన సోదరుడు మల్లు రవి, పలువురు కాంగ్రెస్‌ నేతలు ఉన్నారు. అటు ఆదివారం మాజీ ఎంపీ వీహెచ్‌, మరి కొందరు నేతలు కూడా భట్టికి సంఘీభావం తెలుపుతూ.. దీక్షలో పాల్గొన్నారు. కాంగ్రెస్‌ను నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతోందని.. అలా చేయడం ఎవరికీ సాధ్యం కాదన్నారు టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌. ఇతర పార్టీల సభ్యులను విలీనం చేసే అధికారం స్పీకర్‌కు ఉండదని చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here