భారత్‌లో జన విస్ఫోటనం

0
  • అత్యధిక జనాభాగల దేశంగా ఇండియా
  • ఐక్యరాజ్యసమతి నివేదిక వెల్లడి

న్యూఢిల్లీ (ఆదాబ్‌ హైదరాబాద్‌): వచ్చే ఎనిమిదేళ్లలో చైనాను దాటేసి భారత్‌ అత్యధిక జనాభా గల దేశంగా నిలుస్తుందని ఐక్యరాజ్యసమితి అంచనా వేస్తోంది. అప్పటి నుంచి దశాబ్దం చివరి వరకు అత్యధిక జనాభా గల దేశంగా భారత్‌ కొనసాగనుందని చెబుతోంది. 2019 నుంచి 2050 మధ్య దేశ జనాభా మరో 27.3కోట్లు పెరిగే అవకాశముందని.. ది వరల్డ్‌ పాపులేషన్‌ ప్రాస్పెక్ట్స్‌ 2019: హైలైట్స్‌ పేరుతో ఐక్యరాజ్యసమితి ఆర్థిక, సామాజిక వ్యవహారాల విభాగం నివేదిక విడుదల చేసినట్లు ఐరాస తాజా నివేదికలో పేర్కొంది. ఐక్యరాజ్యసమితి వెలువరించిన నివేదిక పలు ఆసక్తకర అంశాలను వెలుగులోకి తెచ్చింది. ఈ శతాబ్ధం అంతా భారత్‌ దేనని స్పష్టం చేసింది. జనాభా పెరుగుదల విషయంలో భారత్‌ పోటీ వచ్చే దేశం మరొకటి లేదని తేల్చేసింది. దాంతో పాటు రానున్న 30 ఏళ్ళలో ప్రపంచ జనాభా కూడా మరో 200 కోట్ల మేర పెరిగే అవకాశం ఉందని ఈ నివేదిక వెల్లడించింది. ప్రస్తుతం ప్రపంచ జనాభా 7.7 బిలియన్లు ఉండగా.. 2050 నాటికి 9.2 బిలియన్లకు చేరుకుంటుందని నివేదికలో పేర్కొంది. అలాగే ఈ శతాబ్దం చివరి నాటికి ప్రపంచ జనాభా స్థాయి 1100 కోట్లకు పెరగవచ్చునని అంచనా వేసింది. అయితే జనాభా పెరుగుదల అంశంలో మరో కీలక విషయాన్ని వెల్లడించిన ఐక్యరాజ్యసమితి? జనాభా పెరుగుదల అంతా.. దాదాపు 9 దేశాల్లోనే కేంద్రీకృతమై ఉంటుందనే విషయాన్ని స్పష్టం చేసింది. ఈ తొమ్మిది దేశాలన్నింటి కంటే అత్యధిక పెరుగుదల భారత్‌లోనే ఉంటుందని తెలిపింది. భారత్‌ తరువాతి స్థానాల్లో నైజీరియా, పాకిస్థాన్‌, డెమోక్రటిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ ది కాంగో, ఇథియోపియా, టాంజానియా, ఇండోనేషియా, ఈజిప్టు, అమెరికాలో జనాభా పెరుగుదల అత్యధికంగా ఉండనుందని ఐరాస నివేదిక తెలిపింది. ప్రస్తుతం 1.4 బిలియన్ల మంది జనాభాతో అత్యధిక జనాభా కలిగిన దేశంగా చైనా మొదటి స్థానంలో, 1.37 బిలియన్ల మందితో భారత్‌ రెండో స్థానంలో కొనసాగుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here