Featuredస్టేట్ న్యూస్

నిర్మానుష్యంగా మారిన భాగ్యనగరం

ఎప్పుడు బిజీ బిజీగా ఉండే భాగ్యనగర రోడ్లు ఖాళీ అయ్యాయి. ట్రాఫిక్‌ అస్సలు లేదు. సంక్రాంతికి నగర ప్రజలు సొంతూళ్లకు వెళ్లడంతో హైద్రాబాద్‌లోని రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. ట్రాఫిక్‌ కానిస్టేబుల్స్‌కు కూడా పెద్దగా పని లేదు. హైదరాబాద్‌ సిటీ అంతా నిర్మానుష్యంగా మారిపోయింది. ఏడాది పొడవునా కన్నవారికి వున్న వూరికి దూరంగా వుండే వారంతా సంక్రాంతి పండుగకి సొంత గూటికి చేరే ప్రయత్నాల్లో నరకం చవి చూసారు. ఏపీలోని టోల్‌ ఫ్లాజాల వద్ద వాహనాల రద్దీ మొదలైంది. కృష్ణా జిల్లా చిల్లకల్లు, కీసర టోల్‌ గేట్ల దగ్గర భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. ఫాస్టాగ్‌ ద్వారా వాహనాలు వెళ్తున్నప్పటికీ రద్దీ కొనసాగుతోంది. సంక్రాంతికి నగర ప్రజలు పల్లెబాట పడుతున్నారు. దీంతో రద్దీ మరింత పెరిగే అవకాశముంది. అయితే ట్రాఫిక్‌ జామ్‌ లతో కిక్కిరిసి పోయి కనిపించే హైదరాబాద్‌ రొటీన్‌ కి భిన్నంగా ఈ నాలుగు రోజులు కనిపిస్తుంది. నగర రోడ్లు నిర్మానుష్యంగా మారాయి. జనం అలికిడి కనిపించదు, వాహనాలు సౌండ్‌ పొల్యూషన్‌ కూడా అస్సలు ఉండదు.సంక్రాంతి వచ్చిందంటే చాలు హైదరాబాద్‌ నుంచి ఏపీతో పాటు… నల్లగొండ, ఖమ్మం జిల్లాలకు హైదరాబాదీలు క్యూ కడ్తుంటారు. ప్రస్తుతం వాహనాల తాకిడి హైదరాబాద్‌ విజయవాడ ప్రధాన రహదారిపై పెరిగింది. గతానుభవాలను దృష్టిలో పెట్టుకొని ఈజీ ట్రాఫిక్‌ ఫ్లో ఉండేలా అదనపు సిబ్బందిని మోహరించారు.

ఫాస్టాగ్‌ కష్టాలు

సంక్రాంతి సంబరాలేమో గాని.. ప్రయాణం పేరు చెబితేనే వణుకు పుట్టేలా ఉంది. ముందు ఛార్జీల వంతు అయితే.. రెండోది ట్రాఫిక్‌ జామ్‌ గురించి. టోల్‌ ప్లాజా దగ్గర కిలోమీటర్ల మేర.. గంటల కొద్దీ వెయిట్‌ చేయాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. విజయవాడ రూట్‌లో ప్రయాణికులు, వాహనాలతో రద్దీ వాతావరణం నెలకొంది. అటు మహబూబ్‌నగర్‌ రూట్‌లో కూడా వాహనాల రద్దీ భారీగా ఉంది. సంక్రాంతి పండుగ నేపథ్యంలో దాదాపు అన్ని టోల్‌ గేట్ల వద్ద భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడుతోంది. నల్లగొండ జిల్లాలోని పంతంగి, కొర్లపహాడ్‌ టోల్‌గేట్ల వద్ద విజయవాడ మార్గంలో కిలోమీటర్‌ వరకు వాహనాలు నిలిచిపోయాయి. పంతంగి టోల్‌ప్లాజా వద్ద రెండు వైపులా 16 గేట్లు ఉండగా విజయవాడ వైపు పది గేట్లు తెరిచారు. కొర్లపహాడ్‌ వద్ద 8 బూత్‌లు తెరిచారు. ఈ సారి ఫాస్టాగ్‌ను అమల్లోకి తీసుకురావడంతో మరిన్ని ఇబ్బందులు తప్పడం లేదు. ముఖ్యంగా యాదాద్రి జిల్లా గూడూరు టోల్‌ప్లాజా వద్ద ఫాస్టాగ్‌ గేట్ల పనితీరు అస్సలు బాగోలేదు. ఫాస్టాగ్‌ను గుర్తించే పరికరాలు సరిగా పనిచేయకపోవడంతో వాహనాదారులు ఇబ్బందులు పడ్డారు. సాంకేతిక సమస్యలతో ఫాస్టాగ్‌ ఉన్న వాహనదారులకు టోల్‌ గేట్ల వద్ద రద్దీ తిప్పలు తప్పలేదు. సంక్రాంతి సెలవులకు సొంతూళ్లకు వెళుతున్న నగరవాసులకు ఫాస్టాగ్‌ ఇక్కట్లు తప్పడంలేదు. రంగారెడ్డి జిల్లా జడ్చర్ల ఎక్స్‌ప్రెస్‌ హైవే టోల్‌ గేట్‌ వద్ద వాహనాలు బారులు తీరాయి. ఫాస్టాగ్‌ లేకుండా క్యాష్‌తో టోల్‌ గేట్‌ ట్యాక్స్‌ చెల్లించాలనుకునేవారికి..టోల్‌ సిబ్బంది కేవలం రెండు లైన్లు ఏర్పాటు చేశారు. దీంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోతున్నాయి. అటు ఛార్జీల బాదుడు కూడా ఓ రేంజ్‌లో ఉంది. ఆర్టీసీ బస్సులు కిక్కిరిసిపోవడంతో ప్రయాణికులు ప్రైవేట్‌ వాహనాలను ఆశ్రయిస్తున్నారు. విజయవాడకు 950 రూపాయలు డిమాండ్‌ చేస్తున్నారు. విశాఖకు ఏకంగా 2500 రూపాయలు వసూలు చేస్తున్నారు. వేరే ఆప్షన్‌ లేకపోవడంతో రేటు ఎక్కువైనా సరే.. సొంతూళ్లకు వెళ్తున్నారు.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close