Featuredప్రాంతీయ వార్తలురాజకీయ వార్తలుస్టేట్ న్యూస్

ఫలితం బట్టి భవితవ్యం..

కారు గెలిచేనా.. చేయి తిరిగేనా..

నేడు వెల్లడికానున్న భవిష్యత్తు..

ఎవరికి అనుకూలమో, ప్రతికూలమో..

ఫలితాన్ని బట్టి మారనున్న రాజకీయం..

ఎవరూ గెలుస్తారో, ఎవరూ ఓడుతారో తెలియదు కాని అక్కడి ఫలితంపై మాత్రం అందరిలో ఉత్కంఠ నెలకొంది. ఎందుంటే హుజూర్‌నగర్‌ ఉప ఎన్నిక ఫలితం మీదనే ప్రధాన పార్టీల ఆగ్రనేతలిద్దరూ ఆశలు పెట్టుకున్నారు. కాంగ్రెస్‌ కంచుకోటను బద్దలు కొట్టాలని టిఆర్‌ఎస్‌ విశ్వప్రయత్నాలు చేస్తూ ప్రచారాన్ని హోరెత్తించారు. గులాబీ పార్టీకి ఎట్టి పరిస్థితుల్లో అవకాశం ఇవ్వకుండా తన ప్రాతినిధ్యాన్ని కాపాడుకోవాలని కాంగ్రెస్‌ పార్టీ ప్రచారాన్ని పరిగెత్తించింది. ప్రధాన పార్టీలు రెండు హుజూర్‌ నగర్‌ ఉప ఎన్నికను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. హుజూర్‌నగర్‌లో వెలువడే ఫలితాన్ని బట్టి రాష్ట్రంలో అనుకొని రాజకీయ సమీకరణాలు జరిగే అవకాశం ఉంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న టిఆర్‌ఎస్‌ పార్టీ కనుక అక్కడ గులాబీ జెండా ఎగురవేస్తే రాష్ట్రంలో ఆ పార్టీకి వ్యతిరేకత లేదనే విషయం బహిర్గతమవ్వడమే కాకుండా టిఆర్‌ఎస్‌ ఆగ్రనేత కెసిఆర్‌ మరింత దూకుడుగా వెళ్లే అవకాశాలకు ఎక్కువగా ఉంటున్నాయి. గ్రామాల్లో, జిల్లాలో పార్టీ మనుగడకు ఢోకా లేదని కొంతమంది కావాలనే తప్పుడు ప్రచారాన్ని చేస్తున్నారనే వాదనను తెరాస శ్రేణులు బలంగా వినిపించే అవకాశం లేకపోలేదు. సొంత నియోజకవర్గంతో పాటు తమ భార్యను గెలిపించుకోలేని పరిస్థితుల్లో ఉన్న ఉత్తమ్‌ రాష్ట్రంలో పార్టీని ఏలా నడిపిస్తాడనే ఆరోపణలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాంగ్రెస్‌ కంచుకోటలో టిఆర్‌ఎస్‌ ఓటమి చెంది కాంగ్రెస్‌ విజయం సాధిస్తే మాత్రం గులాబీ పార్టీకి నూకలు చెల్లాయనే వ్యతిరేక ప్రచారం రాష్ట్రమంతా పాకే అవకాశం ఉంటుంది. రాష్ట్రంలో ప్రజలు ఎన్నో సమస్యలపై తల్లడిల్లుతున్న ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోకుండా ఒంటెద్దు పోకడలు పోతుంది కాబట్టి ప్రజలు గుణపాఠం చెప్పారని ప్రతిఫక్షాల ఆరోపణలకు మరింత బలం చేకూరే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికే తెలంగాణలో జరుగుతున్న ఆర్టీసీ నిరవధిక సమ్మెకు ప్రభుత్వం నుంచి చర్చలకు పిలవకుండా వారిని ఇబ్బంది పెడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. టిఆర్‌ఎస్‌ ఓటమిని అవకాశంగా మార్చుకొని ఇటు బిజెపి, అటు కాంగ్రెస్‌ మునిసిపల్‌ ఎన్నికల్లో మరింత దూకుడుగా వ్యవహరించే అవకాశం ఉంటుంది. తెలంగాణలో జరుగుతున్న ఏకైకా ఉప ఎన్నికల ఫలితాన్ని బట్టే ఇరు పార్టీలు ముందడుగు వేసే ఆలోచనతో ఉన్నట్లు అర్థమైపోతుంది. అందుకే ఇరు పార్టీలకు, ఇరు పార్టీల ఆగ్రనేతలకు నేడు వెలువడే ఫలితమే వారి భవితవ్యంతో పాటు, పార్టీ భవిష్యత్తును తెలిపే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోంది.

హైదరాబాద్‌ ఆదాబ్‌ హైదరాబాద్‌…

తెలంగాణలో జరిగిన హుజూర్‌ నగర్‌ ఉప ఎన్నిక ఫలితంపై తెలంగాణ రాష్ట్రాల్లో హట్‌ టాపిక్‌గా మారిపోయింది. ఇక్కడి ఫలితం భవిష్యత్తు రాజకీయ పరిణామాలకు సంకేతంగా ఉంటుందని ప్రధాన పార్టీలు అంటున్నాయి. ఏ పార్టీకి ఓటర్లు పట్టం కట్టారో, ఏ పార్టీని పక్కన పెట్టారో కాసేపట్లో తెలియనుంది. ఓటర్లు ఎవరికి అనుకూలంగా తీర్పు ఇచ్చారు అన్నదానిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఉప ఎన్నిక అటు రాజకీయ పార్టీల నే కాదు ఇటు ఆర్టీసీ కార్మికులను సైతం టెన్షన్‌ పెడుతున్నాయి. ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించకుండా నిరంకుశంగా వ్యవహరించిన సీఎం కేసీఆర్‌ కు హుజూర్‌ నగర్‌ ప్రజలు ఉప ఎన్నికల్లో అనుకూలంగా తీర్పు ఇచ్చారా? లేక ప్రతికూలంగా తీర్పునిచ్చారా? అన్నది అటు రాజకీయ వర్గాలను, ప్రస్తుతం సీఎం కేసీఆర్‌ పై సమర శంఖం పూరించిన ఆర్టీసీ కార్మికులను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. సిట్టింగ్‌ స్థానమైన హుజూర్నగర్‌ స్థానాన్ని దక్కించుకోవడం కాంగ్రెస్‌ పార్టీకి ప్రతిష్ఠాత్మకం. అలాగే ఇప్పటివరకు గులాబీ పార్టీ విజయకేతనం ఎగురవేయాలని హుజూర్‌ నగర్‌ ఓటర్ల చేత జీహుజూర్‌ అనిపించుకోవడం అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి ప్రతిష్ఠాత్మకం. హుజూర్‌ నగర్‌ ఉప ఎన్నికలో గెలుపుకోసం అన్ని ప్రత్నాలు చేసినప్పటికి ఫలితం ప్రతికూలంగా వస్తే ప్రజలకు ఎలాంటి వివరణ ఇవ్వాలి అనే అంశంపై సీఎం చంద్రశేఖర్‌ రావు కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. హుజూర్‌ నగర్‌ లో గెలిస్తే పరవాలేదు, గెలవక పోతే దాని ప్రభావం అంతాగా లేకుండా, ఎందుకు ఓడిందో అదే కారణం ప్రజలకు చెప్పాలని గులాబీ పార్టీ బాస్‌ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. రాజకీయవర్గాలతో పాటు సామాన్య జనం కూడా హుజూర్‌ నగర్‌ ఫలితం పట్ల తీవ్ర ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. ఫలితం ఎలా ఉండబోతుందోనని ఊపిరి బిగబట్టుకుని ఎదురు చూస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ఇదే సమయంలో ఫలితం తమకే అనుకూలంగా వస్తుందని ఆయా పార్టీలు మాత్రం ధీమాగా ఉన్నాయి. అయితే.. పోలింగ్‌ ముగిసిన తర్వాత వెలువడిన ఎగ్జిట్‌ పోల్స్‌ అన్నీ అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకే అనుకూలతను వ్యక్తం చేసాయి. ఈసారి గులాబీ విజయం ఖాయమని గొతెత్తి చాటాయి. దీంతో సిట్టింగ్‌ స్థానాన్ని కాంగ్రెస్‌ పార్టీ కోల్పోక తప్పదనే చర్చ కూడా జరుగుతోంది.

ఓడినా పార్టీ భవిష్యత్తు ప్రశ్నార్థకమే..

హుజూర్‌నగర్‌ లో జరిగిన ఎన్నికల్లో ఇప్పటివరకు అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ గెలిచిన దాఖలాలు లేవు. ఈసారి ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో గులాబీ పార్టీ తీవ్రంగా శ్రమించింది. ఎన్నికకు రెండు వారాల ముందు ఆర్టీసి ఉద్యోగుల సమ్మెకు పిలుపు నివ్వడం, దాదాపు 50వేల మంది ఉద్యోగులు సాల్ప్‌ డిస్మిస్‌ అయ్యారని సీఎం చంద్రశేఖర్‌ రావు ప్రటించడం, ఇద్దరు ఉద్యోగులు ఆత్వహత్యకు పాల్పడడం వంటి పరిణామాలు చకాచకా జరిగిపోయాయి. దీంతో ఆర్టీసి ఉద్యోగుల సమ్మె ఉదృతం కావడమే కాక, కార్మికుల మరణం ప్రభుత్వానికి శరాఘాతంలా పరిణమించింది. అంతే కాకుండా కోర్టు కూడా కార్మికులకు అనుకూలంగా స్పందించడంతో ప్రభుత్వం మరింత ఇరుకున పడ్డట్టయ్యింది. దీని ప్రభావం పూర్తిగా హుజూర్‌ నగర్‌ ఉప ఎన్నిక విూద పనిచేసినట్టు తెలుస్తోంది. అంతే కాకుండా ఉత్కంఠ రేపుతున్న హుజూర్‌నగర్‌ ఉప ఫలితం ఆసక్తికరంగా మారనుంది. తెలంగాణలో అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ఉప ఎన్నిక గెలుపు అధికార గులాబీ పార్టీకి మాత్రం ఎంతో ప్రత్యేకం కానుంది. హుజూర్‌ నగర్‌ లో గెలిస్తే ఒక లెక్క గెలవకపోతే మరోలెక్క అన్నట్టు వ్యవహరించబోతుంది అధికార గులాబీ పార్టీ. గులాబీ పార్టీ గెలిస్తే ప్రజలకు చంద్రశేఖర్‌ రావు ప్రభుత్వం పైన ఇంకా విశ్వాసం ఉన్నట్టు, గెలవక పోతే ఆర్టీసి ఉద్యోగుల ప్రభావం ప్రజల్లో పనిచేసినట్టుగా భావించాల్సిఉంటుందనే సంకేతాలను ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ఇదే సమయంలో సిట్టింగ్‌ స్థానాన్ని కాపాడుకోవడానికి కాంగ్రెస్‌ పార్టీ గట్టిగానే ప్రయత్నం చేసింది. చివరి రెండు రోజుల రేవంత్‌ రెడ్డి ప్రచారం కాంగ్రెస్‌ వర్గాల్లో ఫుల్‌ జోష్‌ నింపిందని పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఐనప్పటికి ఫలితం అధికార టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా వస్తే, ఇక ప్రజా మద్దతు తమకే ఉందన్న విషయాన్ని జనంలోకి బలంగా తీసుకెళ్తుందని, ఇదే సమయంలో సీఎం చంద్రశేఖర్‌ రావు మరింత దూకుడుగా, కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుందని, ఆర్టీసీ విషయంలో తీవ్ర పరిణామాలు ఉంటాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఒకవేళ ఫలితం ప్రతికూలంగా వస్తే మాత్రం, ఇక అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ పతనానికి పార్లమెంట్‌ ఎన్నికలు పునాదులు వేస్తే, ఆర్టీసి సమ్మె సహకారంతో హుజూర్‌ నగర్‌ ఉప ఎన్నిక పిల్లర్ల నిర్మించిందనే చర్చ జరుగనున్నట్టు తెలుస్తోంది. ప్రతిపక్షంతో పాటు అన్ని ప్రజా సంఘాలు అనుకున్నట్టుగా టిఆర్‌ఎస్‌ పార్టీపై ప్రజల్లో అనుకూలమా, వ్యతిరేకమా అనే భావన కాసేపట్లోనే బయడపడనుంది..

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close