Featuredస్టేట్ న్యూస్

తెలంగాణ రాష్ట్ర సమితి భవితవ్యం

  • తప్పుదారిలో కారు
  • ప్రతిపక్షం లేకపోతే…
  • వలసవాదులు పలాయనం..?
  • అసమ్మతి విస్ఫోటనం

(అనంచిన్ని వెంకటేశ్వరరావు, న్యూఢిల్లీ, ఆదాబ్‌ హైదరాబాద్‌)

స్వతంత్ర భారతం..ధర్మం నాలుగు పదాలతో నడవటం కోసం రాజ్యాంగం, పరిపాలన, న్యాయస్థానం, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ.. ఆ,యా వ్యవస్థల అధికారాలు, బాధ్యతలు వాటి మధ్య సమన్వయం ఎలా ఉండాలో కూడా రాజ్యాంగంలో స్పష్టంగా ఉంది. అయితే రాజకీయం అరాజకీయంగా మారింది. ఊరు బయట ఉండాల్సిన దొంగలు ఊళ్ళ విూద పడినట్లు ఎన్నికల బూచాళ్ళు పార్టీకి ఒక రంగేసుకొని అచ్చొసిన ఆంబుతుల్లా కోట్లు మింగుతున్నారు. ఈ సమయంలో ఉద్యమ పార్టీగా తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవించింది. 18వ ఏట అడుగిడిన తెరాస భవితవ్యం ఎలా ఉండబోతోంది.? ‘ఆదాబ్‌ హైదరాబాద్‌’ విశ్లేషణ కథనం.

తొలినాళ్ళలో..:

కేసీఆర్‌ కు తెలుగుదేశం ప్రభుత్వంలో మంత్రి పదవి దక్కకపోవడంతో తెలంగాణ వాదం తెరపైకి వచ్చింది. అంచెలంచెలుగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంది. ఢిల్లీ గల్లీల్లోని గడప గడప కేసీఆర్‌ ఎక్కారు. ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు.

తెలంగాణ ఎన్నికల అనంతరం రాజశేఖర్‌ రెడ్డి ఆంధ్రప్రదేశ్‌ సభలో మాట్లాడుతూ… తెలుగుదేశం పార్టీకి ఓటేస్తే ‘తెలంగాణ’కు వెళ్ళాలంటే పాస్‌ పోర్ట్‌ కావాలంటూ చేసిన వాఖ్యలు తీవ్ర దుమారం రేగింది. ఇది ప్రతి తెలంగాణ పౌరుడిని బాధించింది. రాజశేఖర్‌ రెడ్డి హఠాన్మరణంతో కాంగ్రెస్‌ లో బలమైన నాయకత్వం కరువైంది. ఇదే అదనుగా కేసీఆర్‌ తన ఎత్తులకు పదును పెట్టారు. కేసీఆర్‌ ను కాంగ్రెస్‌ స్థానిక నాయకులు చాలా తేలిగ్గా తీసుకున్నారు. దీనికి తోడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస ఎమ్మెల్యేలకు వల వేసి కేసీఆర్‌ ను ఒక విధంగా ముప్పుతిప్పలు పెట్టారు.

ఉద్యమంలో అందరూ..:

తెలంగాణ ఉద్యమంలో సమాఖ్య వాదులు తప్ప అందరూ ఏకతాటిపైకి వచ్చారు.( నాడు సమాఖ్య వాదులుగా పేరుబడ్డ వారు నేడు తెరాసలో కీలకంగా ఉన్నారు. వారి సంగతి మరోసారి చూద్దాం). తప్పనిసరి పరిస్థితులలో తెలుగుదేశం రెండు కళ్ళ సిద్దాంతం కేసీఆర్‌ కు కలసి వచ్చింది. అయితే సమాఖ్య వాదం వినిపించిన జగన్‌ పార్టీ ఇప్పుడు కేసీఆర్‌ ముద్దు చేస్తున్నారు. అందరూ కలసి చేసిన ఉద్యమాన్ని కేసీఆర్‌ సమర్థవంతంగా తనవైపుకు తిప్పుకున్నారు.

ఎన్నికల్లో..:

తెలంగాణ వాదంతో ఒక్కసారిగా కారు జోరు పెరిగింది. ఇందులో ఎక్కాల్సిన వారందరూ తొలి దశలో ఎక్కారు. ఉద్యమాన్ని వ్యతిరేకించన వారు సైతం మంత్రులయ్యారు. ఇదే సందర్భంలో స్థానికంగా చోటామోటా నాయకులు వికృతాలు తెరపైకి వచ్చాయి. దీంతో కారు దారి తప్పింది. అయితే అధినేత ఎత్తుగడలతో రెండోసారి అధికార పగ్గాలు కేసీఆర్‌ చేపట్టారు.

ప్రతిపక్షం లేకపోతే…:

రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా తెరాస చేస్తుందని పరిస్థితులు చెప్పకనే చెపుతున్నాయి. ఈ పరిస్థితి ఇతర పార్టీలకన్నా తెరాసకే ఊహించని ప్రమాదకరం. తెరాసలోకి వలస వెళ్లిన ప్రతి రాజకీయ నాయకుడికి ఎదో ఒక ఆశ ఉంది. ఉంటుంది. అవి తీరే అవకాశాలు కనుచూపు మేరలో లేవు. అందులో సీనియర్‌ నాయకులు ఇప్పటికే మౌనంగా నవ్వుతూ రోదిస్తున్నారు. ప్రతిపక్షం లేకపోయినా ‘ఇంటర్‌ సమస్య’పై ప్రజలు రోడ్లెక్కారు. ప్రభుత్వం కూడా తప్పు జరిగిందని ఒప్పుకోక తప్పలేదు. సమస్య వస్తే తెలంగాణలో రాజకీయ పార్టీల అవసరం లేదని ప్రజలు గుర్తించారు. ఇది తెరాసకే నష్టం.

వలసవాదులు పలాయనం..?

ఇతర పార్టీల నుంచి.. ప్రత్యేకంగా తెలుగుదేశం నుంచి వచ్చిన నాయకులతో సమస్య ముందుంది. ఈ వలస నాయకులు ఆంధ్రా ప్రాంత నాయకులకు ‘టచ్‌’ లో ఉండటం మరో మలుపు. దీనికి తోడు కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం కూడా తన పార్టీ నేతలతో ‘కోవర్ట్‌ అపరేషన్‌’ చేయడం కారుకు మరో ఆందోళన కలిగించే విషయం.

అసమ్మతి విస్ఫోటనం:

కేసీఆర్‌ ఇక అన్ని పార్టీలను దాదాపుగా ఖాళీ చేసి కారెక్కించారు. అయితే సుమారు నాలుగు వందల మంది నాయకులు వివిధ స్థాయిలో పదవులు ఆశిస్తున్నారు. దీనికి తోడు సీనియర్లతో తలనొప్పి. స్వంత పార్టీలో పదవులు రాని వారితో ఒక రకమైన ఇబ్బందులు. అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో డబ్బులు ఖర్చు చేసిన నాయకుల బాధ మరో రకమైన సమస్యలు. ఇలా అందరూ ‘కారు హవా’ అనుకుంటున్న నేపథ్యంలో కేంద్రంలో కేసీఆర్‌ అవసరం లేని పార్టీకి స్పష్టమైన మెజారిటీ వస్తే అసమ్మతి విస్పోటనం ఖాయంగా కన్పిస్తోంది.

ఏం చేయాలి..:

ఇక కారు తలుపులు మూయాలి. ఎందుకంటే స్థానిక ఎన్నికల తర్వాత పదవుల పందేరం ఉంటుందని అందరూ ఆశిస్తున్నారు. పదవులు ఆశించే వారి సంఖ్య 1:3 ఉంది. ఇది కారుకు భారం కానున్నది. దీనికి తోడుగా ఇంకా వలసలు కొనసాగితే అది అసలుకే మోసం వచ్చే అవకాశం ఉంది. యుగ పురుషుడు ఎన్టీఆర్‌ కే వెన్నుపోట్లు తప్పలేదు. యువరాజును ముఖ్యమంత్రి చేయాలనే ఆలోచన కూడా గులాబీ నేతకు ఉంది. ఈ కీలక సమయంలో తెరాసలో నాయకులు పెరిగితే అది ఆ పార్టీ భవితవ్యానికి జారుడు మెట్లని గులాబీ అధినేత గుర్తించాలి.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close